రిజ్వాన్ అహ్మద్ చనిపోయింది గుండె మరియు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వల్ల అని అంబేద్కర్ నగర్ జిల్లా పోలీసులు స్పష్టం చేసారు

ఉత్తర్ ప్రదేశ్ లో రిజ్వాన్ అహ్మద్ అనే యువకుడు కూరగాయలు అమ్ముకుని వస్తుండగా పోలీసులు కొట్టడంతో అక్కడికి అక్కడే మరణించాడు అనే క్లెయిమ్ తో ఒక పోస్ట్ సోషల్ మీడియా లో ప్రచారం కాబడుతుంది. ఆ  క్లెయిమ్ లో ఎంతవరకు నిజం ఉందో విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ఉత్తర్ ప్రదేశ్ లో పోలీసులు కొట్టిన దెబ్బలకు మరణించిన రిజ్వాన్ అహ్మద్ అనే యువకుడి ఫోటో.

ఫాక్ట్ (నిజం): అంబేద్కర్ నగర్ జిల్లా పోలీసులు తాము చేసిన విచారణలో రిజ్వాన్ అహ్మద్ ని పోలీసులు కొట్టలేదని తెలిసింది అని స్పష్టం చేసారు. అంతేకాక, పోలీసులు మృతుడి పోస్టమోర్టమ్ రిపోర్ట్ లో అతడికి గుండె మరియు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉందని మరియు మోటార్ సైకిల్ ఆక్సిడెంట్ వల్ల అయిన గాయాలు ఉన్నాయని స్థానిక డాక్టర్ ద్రువీకరించాడని తెలిపారు. కావున, పోస్ట్ లోని క్లెయిమ్ అబద్ధం.

పోస్ట్ లో ఉన్న సమాచారంతో గూగుల్ లో కొన్ని కీలక పదాలతో వెతికితే ‘The Hindu’ దిన పత్రిక వారు 18 ఏప్రిల్ 2020న ప్రచురించిన ఒక ఆర్టికల్ కనిపించింది. ఆ ఆర్టికల్ ప్రకారం, ‘ఉత్తర ప్రదేశ్ లోని అంబేద్కర్ నగర్ జిల్లాలో రోజువారీ కూలీగా పని చేసే రిజ్వాన్ అహ్మద్  మూడు రోజుల ముందు తాండా పట్టణ పోలీసులు కొట్టడం వల్ల గాయాల కారణంగా మరణించాడని అతని తండ్రి ఆరోపించారని తెలుస్తుంది’.

అయితే, ఏప్రిల్ 19, 2020 న అంబేద్కర్ నగర్  జిల్లా పోలీసులు తమ ట్వీట్‌ లో పెట్టిన వీడియోలో, వారు CCTV ఫుటేజీని పరిశీలించారని,  దాంట్లో రిజ్వాన్ కుటుంబ సభ్యులు ఆరోపించిన సంఘటన ఏదీ చోటు చేసుకోలేదని మరియు పోస్ట్‌మార్టం రిపోర్ట్ లో మృతుడి శరీరం పైన లాఠీ దెబ్బలు కూడా ఏవి కనిపించలేదని తెలిపారు. అంతేకాక, పోలీసులు ఆ రిపోర్ట్ లో మృతుడి ఊపిరితిత్తుల్లో మరియు గుండెలో ఇన్ఫెక్షన్ ఉందని, మోటార్ సైకిల్ మీద నుండి కింద పడడం వల్ల అయిన గాయాలను స్థానిక వైద్యుడు ధృవీకరించారని చెప్పారు.

ఇంకో ట్వీట్‌ లో అంబేద్కర్ నగర్ పోలీసులు స్థానిక (తాండా) డాక్టర్ చేసిన స్టేట్‌మెంట్ల రికార్డింగ్‌తో  ఉన్న ఒక వీడియోను అప్‌లోడ్ చేశారు. ఆ వీడియోలో తనని 5-6 రోజుల క్రితం, రిజ్వాన్ కుటుంబ సభ్యుడు మెడిసిన్  కోసం తనను సంప్రదించి, రిజ్వాన్ ఆక్సిడెంట్ కి గురయ్యాడని చెప్పాడు. తరువాత, తాను ఇంకో రోజు రిజ్వాన్ ఇంటికి చికిత్స కోసం వెళ్ళినప్పుడు, అతడి కాళ్ళపై గాయాలను చూసాను అని చెప్పాడు. అంబేద్కర్ నగర్ పోలీసులు కూడా తమ ట్వీట్ లో ఆ సంఘటన పై సోషల్ మీడియా లో ఫేక్ న్యూస్ రావడాన్ని ఖండించారు.

చివరగా, రిజ్వాన్ అహ్మద్ అనే యువకుడు అతని గుండె మరియు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉండడం వలన మరియు మోటార్ సైకిల్ ఆక్సిడెంట్ వల్ల అయిన గాయాల వలన చనిపోయాడని అంబేద్కర్ నగర్ పోలీసులు స్పష్టం చేసారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?