కరెన్సీ నోట్లపై ఎలాంటి వ్రాతలు ఉన్నా అవి చెల్లనివిగా పరిగణించబడుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మేనేజర్ గమనిక జారీ చేసిన దృశ్యం, అంటూ సోషల్ మీడియాలో SBI బ్యానర్ ఫోటో ఒకటి షేర్ అవుతుంది. భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) కొత్త నిబంధనల ప్రకారం కొత్తగా విడుదల చేసిన 500 మరియు 2000 రూపాయిల కరెన్సీ నోట్లపై ఏ విధమైన వ్రాతలు వ్రాయకూడదని, అలా అక్షరాలు రాసి ఉన్న నోట్లను ఇకనుండి చెల్లనవిగా పరిగణించడం జరుగుతుందని SBI మేనేజర్ ఈ గమనికలో హెచ్చరించారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కొత్తగా విడుదల చేసిన 500 మరియు 2000 రూపాయిల కరెన్సీ నోట్లపై ఏవిధమైన వ్రాతలు రాసి ఉన్న అవి చెల్లనివిగా పరిగణించాలని ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించింది.
ఫాక్ట్ (నిజం): అక్షరాలు రాసి ఉన్న కరెన్సీ నోట్లని చెల్లనివిగా పరిగణించాలని ఆర్‌బీఐ బ్యాంకులకు ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు. వ్రాతలు లేదా రంగు మరకలు ఉన్న నోట్లు చట్టబద్దమైన టెండరుగా కొనసాగుతాయని, అలాంటి కరెన్సీ నోట్లను ఏ బ్యాంకు శాఖలోనైనా డిపాజిట్ లేదా మార్చుకోవచ్చని ఆర్‌బీఐ తమ వెబ్సైటులో స్పష్టంగా తెలిపింది. కరెన్సీ నోట్లపై ఒకవేళ రాజకీయం లేదా మతపరమైన సందేశాలను వ్యాపింపజేసే పదాలు రాసివుంటే ఆ నోట్లు చెల్లింపు అవదని ఆర్‌బీఐ తెలిపింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.
పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన సమాచారం కోసం ఆర్‌బీఐ వెబ్సైటులో వెతికితే, అక్షరాలు లేదా రంగు మరకలు కలిగి ఉన్న నోట్ల గురించి ఆర్‌బీఐ తమ ‘తరచూ అడిగే ప్రశ్నల’ విభాగంలో ప్రస్తావించినట్టు తెలిసింది. ఇందులో ఆర్‌బీఐ తమ ‘క్లీన్ నోట్ పాలసీ’ గురించి వివరిస్తూ, ప్రజలను నోట్లపై ఎలాంటి అక్షరాలు రాయవద్దని అలాగే, రబ్బర్ స్టాంప్ లేదా వాటర్ మార్కులను నోట్లపై పెట్టవద్దని సూచించింది. కానీ, అలాంటి వ్రాతలు లేదా రంగు మరకలు ఉన్న నోట్లు చట్టబద్దమైన టెండరుగా కొనసాగుతాయని, వాటిని ఏ బ్యాంకు శాఖలోనైనా డిపాజిట్ లేదా మార్చుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది. మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్ నోట్లతో సహా అన్ని బ్యాంక్ నోట్లకు ఈ నియమాలు వర్తిస్తాయని ఆర్‌బీఐ స్పష్టంగా తెలిపింది.
అయితే, కరెన్సీ నోట్లపై రాజకీయ లేదా మతపరమైన సందేశాలను వ్యాపింపజేసే పదాలు రాసివుంటే ఆర్‌బీఐ (నోట్ రిఫండ్) రూల్స్, 2009 [రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (నోట్ రీఫండ్) సవరణ నిబంధనల ప్రకారం, 2018] నిబంధనల ప్రకారం ఆ నోట్లకు చెల్లింపు లభించదని ఆర్‌బీఐ స్పష్టంగా తెలిపింది.
ఇదివరకు, ఇలాగే అక్షరాలు రాసి ఉన్న నోట్లను బ్యాంకులు చెల్లనివిగా గుర్తిస్తున్నాయని ఇంటర్నెట్లో ప్రచారం చేస్తే, అటువంటి ఆదేశాలేవి తాము ఇవ్వలేదని ఆర్‌బీఐ పలు మార్లు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ కూడా పబ్లిష్ చేసాయి. పోస్టులో షేర్ చేసిన గమనిక ప్లకార్డు ఏ బ్యాంకు మేనేజర్ పెట్టారనేది మాకు తెలియలేదు.
చివరగా, కరెన్సీ నోట్లపై వ్రాతలుంటే చెల్లనివిగా పరిగణించాలని ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించలేదు.