అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఆహ్వానించలేదని జరుగుతున్న ప్రచారం ఫేక్

22 జనవరి 2024న అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ఆహ్వానం అందలేదని చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

ఇదే పోస్టుని ఇక్కడ కూడా చూడవచ్చు.

క్లెయిమ్: 22 జనవరి 2024న అయోధ్య రామ మందిరంలో జరగనున్న శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ఆహ్వానం అందలేదు.

ఫాక్ట్: అయోధ్యలో జరిగే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్, ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా, ఆర్ఎస్ఎస్ నేత రామ్ లాల్ 12 జనవరి 2024న ఆహ్వాన పత్రికని అందజేశారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి అయోధ్య రామ మందిర ట్రస్టు నుంచి ఆహ్వానం అందిందా లేదా అని విషయం గురించి ఇంటర్నెట్లో వెతకగా దీనికి సంబంధించిన వార్తని ది హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మరియు ఇతర వార్తా పత్రికల వెబ్‌సైట్లలో ప్రచురించినట్లు గుర్తించాం.

ఈ కథనాల ప్రకారం, 12 జనవరి 2024న  విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్, ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా, ఆర్ఎస్ఎస్ నేత రామ్ లాల్ రాష్ట్రపతి ముర్ముకి అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికని అందజేశారు. ఇదే విషయాన్ని విశ్వ హిందూ పరిషత్ కూడా తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొంది.

చివరిగా, అయోధ్యలో జరగనున్న శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఆహ్వానించలేదని జరుగుతున్న ప్రచారం అవాస్తవం.