Fake News, Telugu
 

‘Dance India Dance’ షో లో జరిగిన సరదా ఘర్షణ వీడియోని చూపిస్తూ డాన్స్ షో లో దాదాగిరి చేస్తున్న బీజేపి లీడర్ కొడుకు అని షేర్ చేస్తున్నారు

0

ఒక డాన్స్ కాంపిటీషన్ ఆడిషన్స్ లో తన తండ్రి నోయిడా నగరంలో పెద్ద బిల్డర్ మరియు బీజేపి లీడర్ అని  చెప్తూ ఒక పోటీదారుడు తనని ఆ షో విజేతగా ప్రకటించి ట్రోఫీ ఇవ్వాలని లైవ్ లో జడ్జిల ముందు దాదాగిరి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఆ పోటిదారుడు ట్రోఫి కోసం ఎంత కావాలన్నా ఇస్తాననడం, తీరా ఒప్పుకోకపోతే ఆ పోటిదారుడి తండ్రి షో కి వచ్చి లైవ్ లో జడ్జిలను బెదిరిస్తున్న దృశ్యాలు వీడియోలో మనం చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బీజేపి లీడర్ కొడుకు డాన్స్ కాంపిటీషన్ ఆడిషన్స్ లో దాదాగిరి చేసిన వీడియో.

ఫాక్ట్ (నిజం):  పోస్టులో షేర్ చేసింది ‘Dance India Dance’ షో లో జరిగిన ప్రాంక్ (సరదా) ఘర్షణకి సంబంధించిన వీడియో. ఈ ప్రాంక్ ఘర్షణకి సంబంధించిన సగం ఫూటేజ్ ని చూపెట్టి డాన్స్ షో లో దాదాగిరి చేస్తున్న బీజేపి లీడర్ అని షేర్ చేస్తున్నారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అదే దృశ్యాలు కలిగి ఉన్న వీడియోని ఒక యూసర్ తన ఫేస్బుక్ పేజి లో పెట్టిన  పోస్ట్ దొరికింది. ‘‘Dance India Dance’ షో లో జరిగిన సూపర్ ప్రాంక్’ అనే టైటిల్ తో ఆ యూసర్ ఈ వీడియోని పోస్ట్ చేసారు. అలాగే, వీడియోలో జడ్జిలు కూర్చున్న టేబుల్ పై  ‘డాన్స్ ఇండియా డాన్స్’ లోగో ఉండటం గమనించవచ్చు. ఈ వివరాల ఆధారంగా ‘ZEE TV’ లో ప్రసారం అయిన ‘Dance India Dance’ షో వీడియోలని వెతకగా, పోస్టులోని వీడియో ‘Dance India Dance’ ఐదవ సీజన్ మొదటి ఎపిసోడ్ లో టెలికాస్ట్ అయినట్టుగా గుర్తించాము. వీడియోలో కనిపిస్తునట్టుగా ఒక పోటీదారుడు తను నోయిడా బిల్డర్ కొడుకు అని చెప్తూ జడ్జిలను బెదిరిస్తున్న దృశ్యాలు ఈ ఎపిసోడ్ లో ప్రసారం అయ్యాయి. ‘Dance India Dance’ ఐదవ సీజన్ మొదటి ఎపిసోడ్ లో 40.01 నిమిషాల దగ్గర ఈ సంభాషణ మొదలవుతుంది. 42.53 నిమిషాల దగ్గర ఆ పోటీదారుడి తండ్రి లైవ్ షో లోకి వచ్చి దాదా గిరి చేస్తున్న దృశ్యాలు చూడవచ్చు.

ఈ ఘర్షణ ప్రాంక్ లో (సరదా) భాగమని ఎపిసోడ్ లోని 46.14 నిమిషాల దగ్గర బయట పెడతారు.  ‘Dance India Dance’ షో జడ్జిలలో ఒకరైన కొరియోగ్రాఫర్ పునిత్ పాథక్ ని తన సహచర జడ్జి ఇలా ప్రాంక్ చేసినట్టు ఆ ఎపిసోడ్ మొత్తం చూస్తే అర్థమైంది. పోస్టులో షేర్ చేసిన వీడియోలో ఈ ప్రాంక్ ఘర్షనకి సంబంధించిన సగ భాగమే చూపెట్టారు, ప్రాంక్ అని బయట పెట్టే దృశ్యాలు చూపించలేదు.

చివరగా, ‘Dance India Dance’ షో లో జరిగిన ప్రాంక్ (సరదా కోసం) ఘర్షణ వీడియోని చూపిస్తూ డాన్స్ షో లో దాదాగిరి చేస్తున్న బీజేపి లీడర్ కొడుకు అని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll