మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదని అన్నారని చెప్తున్న న్యూస్ పేపర్ క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) వైరల్ అవుతోంది. వెలుగు వార్తాపత్రిక యొక్క లోగో, ఈ కథనం యొక్క e-paper లింక్ ఈ కథనం యొక్క కింద భాగంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గురించి ఆయన మాట్లాడుతూ, అతని లాంటి ‘రౌడీలని’ నిలబెట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరువు తీస్తున్నారని, ఆయన నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తిలో ఒక మీడియా సమావేశంలో అన్నారని ఈ వార్తా కథనంలో ఉంది. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: 2025 జుబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారని 25 అక్టోబర్ 2025న వెలుగు పత్రిక ప్రచురించిన కథనం యొక్క పేపర్ క్లిప్పింగ్/స్క్రీన్‌షాట్.
ఫ్యాక్ట్(నిజం): వెలుగు పత్రిక ఈ కథనాన్ని 25 అక్టోబర్ 2025న ప్రచురించలేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు లేవు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల ఇటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్తున్న ఎటువంటి వార్తా కథనాలు లభించలేదు. అలాగే, వైరల్ న్యూస్ క్లిప్పులో చెప్తున్నట్లుగా, తను ఈ వ్యాఖ్యలు నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తిలో ఒక మీడియా సమావేశంలో చేశారని చెప్తూ కూడా మాకు ఎటువంటి వార్తా కథనాలు లభించలేదు.
అలాగే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోషల్ మీడియా పేజీలలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) కూడా తను ఈ వ్యాఖ్యలు చేసినట్లు మాకు ఎలాంటి పోస్టులు లభించలేదు. ఇక వైరల్ న్యూస్ క్లిప్పులో ఉన్న వెలుగు పత్రిక లింక్ ‘https://epaper.V6velugu.com/c’ని మేము సందర్శించగా, మాకు ఆ వెబ్ పేజీ దొరకలేదు.
అలాగే, 25 అక్టోబర్ 2025 నాటి వెలుగు పత్రిక e-paperని (హైదరాబాద్ మెయిన్ ఎడిషన్) ఈ వైరల్ కథనం గురించి వెతకగా, మాకు అది ఎక్కడ లభించలేదు. అలాగే, 25వ తారీఖు నాటి తెలంగాణ మెయిన్ ఎడిషన్‌లో కూడా ఈ కథనం కోసం మేము వెతకగా, అందులో కూడా మాకు ఇది లభించలేదు.
దీని బట్టి, వైరల్ అవుతున్న ఈ న్యూస్ క్లిప్పింగ్ నిజమైనది కాదు అని మనకు స్పష్టం అవుతుంది. దాన్ని వెలుగు పత్రిక వారు 25 అక్టోబర్ 2025న ప్రచురించలేదు. గతంలో, రాజకీయ నాయకులకు చెందిన నిజమైన వార్తా కథనాలని చెప్తూ నకిలీ పేపర్ క్లిప్పులు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు, వాటిని ఉద్దేశిస్తూ మేము పలు ఫ్యాక్ట్ చెక్ కథనాలు ప్రచురించాము (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).
చివరగా, 2025 జుబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారని 25 అక్టోబర్ 2025న వెలుగు పత్రిక వైరల్ అవుతున్న వార్తా కథనాన్ని ప్రచురించ లేదు.