ప్రభుత్వ అంచనాల ప్రకారం భారతదేశంలోకి అక్రమంగా చొరబడ్డ బంగ్లాదేశీయుల సంఖ్య సుమారు రెండు కోట్లు

ఇది CAA, NPR, NRC గురించి వ్యతిరేక సభ. జరిగింది మన ఢిల్లీలోనో, హైద్రాబాద్ లోనో కాదు. ఇది జరిగింది బంగ్లాదేశ్ లో. మన దేశ చట్టాల గురించి వ్యతిరేకిస్తూ విదేశీ ముస్లిమ్స్ ఎందుకింత కంగారు పడుతున్నారని ఆశ్చర్యపోతున్నారా? ఇక్కడే ఉంది అసలు విషయం. బంగ్లాదేశ్ సరిహద్దు ని ఆనుకుని ఉన్న మన పశ్చిమ బెంగాల్ ద్వారా మన దేశంలోకి అక్రమంగా చొరబడ్డ ముస్లిం జనాభా సంఖ్య 8 కోట్లు…’ అంటూ ఒక వీడియోతో కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: భారతదేశంలోకి అక్రమంగా చొరబడ్డ బంగ్లాదేశీ ముస్లింల జనాభా సంఖ్య 8 కోట్లు. అందుకే వీడియోలో CAA చట్టానికి విరుద్ధంగా బంగ్లాదేశ్ లో నిరసన తెలుపుతున్నారు.

ఫాక్ట్ (నిజం): భారతదేశంలోకి అక్రమంగా చొరబడ్డ బంగ్లాదేశీయుల సంఖ్య సుమారు రెండు కోట్లు అని భారత ప్రభుత్వం 2016 లో రాజ్యసభ కి తెలిపింది. పోస్టులోని వీడియో బంగ్లాదేశ్ కి సంబంధించినదే. ఢిల్లీ అల్లర్లకు మోడీ కారణమని భావిస్తూ, తన బంగ్లాదేశ్ సందర్శనకి విరుద్ధంగా ఢాకా లో నిర్వహించిన రాలీ వీడియో అది. కావున వీడియోలో కొంత నిజమున్నా, తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. 

భారతదేశంలోకి బంగ్లాదేశ్ నుండి ఎంత మంది అక్రమంగా చొరబడ్డారని గూగుల్ లో వెతకగా, ఈ విషయం పై 2016 లో భారత ప్రభుత్వం రాజ్య సభలో సమాధానమిచ్చినట్టు తెలుస్తుంది. రాజ్యసభ లో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ‘భారతదేశంలోకి అక్రమంగా చొరబడ్డ బంగ్లాదేశీయుల సంఖ్య సుమారు రెండు కోట్లు’ అని కిరెన్ రిజిజు (అప్పటి ‘Minister of State in the Ministry of Home Affairs’) తెలిపాడు. అందులో ఎంత మంది ముస్లింలు ఉన్నారని తాను చెప్పలేదు. కావున,  భారతదేశంలోకి అక్రమంగా చొరబడ్డ బంగ్లాదేశీయుల ముస్లిం జనాభా సంఖ్య 8 కోట్లు కాదు.

పోస్టులోని వీడియో బంగ్లాదేశ్ కి సంబంధించినది అని చెప్తూ వార్తాసంస్థలు ప్రచురించిన ఆర్టికల్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. అంతేకాదు, వీడియో మొదట్లో ఉన్నది ఢాకాలోని బైతుల్ ముకర్రం మసీదు అని చూడవొచ్చు. ఢిల్లీ అల్లర్లకు మోడీ కారణమని భావిస్తూ, తన బంగ్లాదేశ్ సందర్శనకి విరుద్ధంగా ఢాకాలో నిరసన ర్యాలీలు నిర్వహించినట్టు తెలుస్తుంది. బంగ్లాదేశ్ దేశ వ్యవస్థాపకుడు షేక్ ముజిబర్ రెహ్మాన్ 100వ జయంతి వేడుకులు కొరోనా వైరస్ కారణంగా వాయిదా పడ్డాయి, దానికి వెళ్ళవలసిన మోడీ పర్యటన కూడా ఇప్పటికి వాయిదా పడినట్టు ఇక్కడ చదవొచ్చు.

చివరగా, భారతదేశంలోకి అక్రమంగా చొరబడ్డ బంగ్లాదేశీయుల సంఖ్య సుమారు రెండు కోట్లు అని ప్రభుత్వ అంచనా.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?