ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉచిత స్ప్లెండర్ బైక్ (Splendor Bike) పథకాన్ని ప్రకటించారు అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు మద్దతుగా ప్రధాని మోదీ వీడియో ఒకటి జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో, “మీరు బైక్ సొంతం చేసుకోవాలనే కల ఉచితంగా నెరవేరబోతోంది. కానీ గుర్తుంచుకోండి, ప్రతి ఆధార్ కార్డుతో ఒక స్ప్లెండర్ బైక్ మాత్రమే ఉచితంగా లభిస్తుంది” అని ప్రధాని మోడీ చెప్పడం మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉచిత స్ప్లెండర్ బైక్ (Splendor Bike) పథకాన్ని ప్రకటించారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎటువంటి ఉచిత బైక్ పథకాన్ని ప్రకటించలేదు. అలాగే, ఈ వైరల్ వీడియో ఫేక్. అసలు వీడియోకు AI జనరేటెడ్ ఆడియోను జోడించి ఈ వైరల్ వీడియోను రూపొందించారు. 24 ఫిబ్రవరి 2019న ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన (PM-KISAN పథకం) ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగాన్ని అసలు వీడియో చూపిస్తుంది. ఈ ప్రసంగంలో, మోదీ రైతుల గురించి, PM-KISAN పథకం, వ్యవసాయానికి సంబంధించిన ఇతర కార్యక్రమాల గురించి మాట్లాడారు. ఈ ప్రసంగంలో, ప్రధాని మోదీ ఉచిత బైక్ పథకం గురించి లేదా ఆటోమొబైల్స్‌కు సంబంధించిన మరే ఇతర పథకాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ముందుగా ఈ వైరల్ పోస్టులలో చెప్పినట్లుగా, ఉచిత స్ప్లెండర్ బైక్ (Splendor Bike) పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ప్రధాని మోదీ ఇలాంటి ప్రకటన చేసినట్లు ఎటువంటి విశ్వసనీయ రిపోర్ట్స్/ వార్తా కథనాలు మాకు లభించలేదు. ఒకవేళ ప్రధాని మోదీ లేదా భారత ప్రభుత్వ వర్గాలు ఇలాంటి పథకాన్ని ప్రకటించి ఉంటే, ఆ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు మీడియా సంస్థలు ఖచ్చితంగా కథనాలను ప్రచురించేవి.
తదుపరి, మేము భారత ప్రభుత్వ పథకాల గురించి సమాచారం అందించే MyScheme వెబ్‌సైట్‌ను,భారత ప్రభుత్వం యొక్క ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) జారీ చేసిన పత్రికా ప్రకటనలను కూడా సమీక్షించాము. అయితే, ఇలాంటి పథకం ప్రధాని మోదీ ప్రకటించినట్లు ఎటువంటి సమాచారం మాకు లభించలేదు. అలాగే, ప్రధాని మోదీకి సంబంధించిన అధికారిక సోషల్ మీడియా ఖాతాలను (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) కూడా తనిఖీ చేసాము. అక్కడ కూడా ఆయన ఇలాంటి ఉచిత బైక్ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఎటువంటి పోస్టులు చేయలేదు.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన వివరాల కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వైరల్ వీడియోకు సంబంధించిన అసలు వీడియో లభించింది. ఈ వీడియోను భారత ప్రధాని కార్యాలయంకు సంబంధించిన అధికారిక యూట్యూబ్ ఛానెల్ 24 ఫిబ్రవరి 2019న షేర్ చేసినట్లు గుర్తించాము. వైరల్ వీడియోలో కనిపించే దృశ్యాలను ఈ వీడియోలో మధ్య మనం చూడవచ్చు. ఇదే వీడియోను భారత పార్లమెంట్, భారతీయ జనతా పార్టీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక యూట్యూబ్ ఛానల్స్ కూడా 24 ఫిబ్రవరి 2019న షేర్ చేసినట్లు గుర్తించాము (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియో వివరణ ప్రకారం, 24 ఫిబ్రవరి 2019న ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన (PM-KISAN పథకం) ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగాన్ని ఈ వీడియో చూపిస్తుంది.
ఈ ప్రసంగంలో, మోదీ రైతుల గురించి, PM-KISAN పథకం, వ్యవసాయానికి సంబంధించిన ఇతర కార్యక్రమాల గురించి మాట్లాడారు. ఈ ప్రసంగంలో, ప్రధాని మోదీ ఉచిత బైక్ పథకం గురించి లేదా ఆటోమొబైల్స్‌కు సంబంధించిన మరే ఇతర పథకాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ సభలో ప్రధాని మోదీ చేసిన పూర్తి ప్రసంగం యొక్క ఇంగ్లీషు అనువాదాన్ని ఇక్కడ చూడవచ్చు.
దీన్ని బట్టి అసలు వీడియోకు AI జనరేటెడ్ ఆడియోను జోడించి ఈ వైరల్ వీడియోను రూపొందించినట్లు అర్థమవుతుంది. తదుపరి, ఈ వైరల్ వీడియోలోని ఆడియోను AI- ఉపయోగించి తయారు చేశారా? లేదా? అని నిర్ధారించడానికి, Resemble AI, & Hiya వంటి పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ ఉపయోగించి ఈ వీడియోను పరిశీలించగా, ఈ వైరల్ వీడియోలోని ఆడియో AI-జనరేటెడ్ ఆడియో కావచ్చని ఫలితాన్ని ఇచ్చాయి.
అంతేకాకుండా, 02 నవంబర్ 2025న, భారత ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) యొక్క ఫ్యాక్ట్-చెక్ విభాగం X (ట్విట్టర్)లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎటువంటి ఉచిత బైక్ పథకాన్ని ప్రకటించలేదని, ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడిందని స్పష్టం చేసింది.
చివరగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎటువంటి ఉచిత బైక్ పథకాన్ని ప్రకటించలేదు. ఈ వైరల్ వీడియో ఫేక్.