బోస్వానా దేశంలో ఆకాశం నుండి ప్రకాశించిన ‘దేవదూత’ అంటూ పెట్టిన ఫొటో ఫోటోషాప్ చేయబడిన ఇమేజ్

ఈ వేళ మధ్యాహ్నం బోస్వానా అనే దేశంలో ఒక గొప్ప వెలుగు ఆకాశంలో నుండి ప్రకాశించి అందరికీ కనబడి ఓ 15 నిమిషాల తరువాత అందులో నుండి ఓ ప్రకాషమానమైన దేవదూత తన అందమైన రెండు రెక్కలను చక్కగా బయటకు చాపి నిలువబడగా అలా ప్రజలందరూ ఏమిటా ఈ దృశ్యం అని ఓ 45 నిమిషాల పాటు వీక్షిస్తుండగా, ఆకాశము నుండి ఓ గంభీర స్వరం….’ అని చెప్తూ అందుకు సంబంధించిన ఫోటోనొకదాన్ని ఫేస్బుక్ లో పోస్టు చేస్తున్నారు. పోస్టులో చెప్పింది ఎంతవరకు నిజమో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బోస్వానా దేశంలో ఆకాశం నుండి ప్రకాశించిన ‘దేవదూత’.    

ఫాక్ట్ (నిజం): అమెరికా దేశంలోని సాండియాగో నగరంలో సెప్టెంబర్ 2019 లో వచ్చిన తుఫాన్ కి సంబంధించినది ఫోటోని తీసుకొని ఎడిట్ చేసి అందులో రెక్కలను పెట్టారు. కావున, పోస్టులో చెప్పింది తప్పు

పోస్ట్ లో ఉన్న ఫోటోని యాండెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, చాలా సెర్చ్ రిజల్ట్స్ వచ్చాయి. ఒక సెర్చ్ రెసుల్ట్ లోని కథనం లో పోస్టులో పెట్టిన ఫోటోలాంటిదే లభించింది. కానీ, అది పోస్ట్ చేసిన ఫోటో యొక్క మిర్రర్ ఇమేజ్ మరియు అందులో ప్రకాశవంతమైన ఆకారం వేరుగా (రెక్కలు లేవు) ఉంది. ఆ ఫోటో గురించి ఆ కథనం ద్వారా అది ‘సాండియాగో’ లో జరిగిన ఒక ఘటనకి సంబంధించినదని తెలిసింది.

ఈ సమాచారంతో ‘సాండియాగో’ అనే ఫిల్టర్ తో గూగుల్ రివర్స్ ఇమేజ్ చేసినప్పుడు, ‘Fox 5 News’ వారి కథనం ఒకటి లభించింది. ఆ కథనం లోని ఇమేజ్ చూసినప్పుడు, పోస్టులోని ఫోటో ఫోటోషాప్ చేయబడిన ఇమేజ్ అని నిర్ధారణకి రావొచ్చు. ఆ ఫోటో గురించిన సమాచారం కోసం చూసినప్పుడు, అది అమెరికాలోని సాండియాగో నగరంలో సెప్టెంబర్ 2019లో వచ్చిన తుఫాన్ కి సంబంధించినదని తెలిసింది. ఆ కథనంలో సాండియాగో లో తూఫాన్ కి సంబంధించిన వీడియో కూడా ఉంది. ఆ వీడియో లో పోస్టులోని ఫోటోకి సంబంధించిన కొంత భాగం చోడవచ్చు. దాని ద్వారా, ఆ ఫొటోలో కనిపించే ప్రకాశవంతమైన భాగం తూఫాన్ కి సంబంధించినదని తెలుసుకోవచ్చు. ఆ కథనంలో ఎక్కడా కూడా ఆ తూఫాన్ సందర్భంలో ‘దేవదూత’ ప్రకాశించినట్లుగా పేర్కొనలేదు.

చివరగా, బోస్వానా దేశంలో ఆకాశం నుండి ప్రకాశించిన ‘దేవదూత’ అంటూ పెట్టిన ఫొటో ఒక ఫోటోషాప్ చేయబడిన ఇమేజ్.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?