బంగ్లాదేశీ సినిమాల‌కు సంబంధించిన ఫోటోలను తప్పుడు ‘లవ్ జిహాద్’ క్లైములతో షేర్ చేస్తున్నారు

ఒక ‘లవ్ జిహాద్’ సంఘటనను చూపిస్తున్నాయని చెప్తూ రెండు ఫోటోలు సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) వైరల్ అవుతున్నాయి. మొదటి ఫోటోలో ఒక వ్యక్తి, ఒక మహిళ కలిసి కనిపిస్తున్నారు. రెండవ ఫోటోలో అదే మహిళ ముఖంపై కాలిన గాయాలు ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు నందిని మండల్ అని, ఆమె 2023లో అబ్దుల్ ఆదిల్ ఖాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని, ఇస్లాం మతంలోకి మారి, తన పేరును జరా ఇస్లాంగా మార్చుకుందని, మొదటి ఫోటో 2023కి సంబంధించినది అని, రెండవది 2025లో ఆ మహిళ స్థితిని చూపిస్తుంది అని క్లెయిమ్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ముస్లిం భర్త దాడికి గురైన హిందూ మహిళను చూపిస్తున్న ఫోటోలు.

ఫాక్ట్(నిజం): ఈ రెండు ఫోటోలు ఎటువంటి ‘లవ్ జిహాద్’ ఘటనకు సంబంధించినవి కాదు. మొదటి ఫోటో బంగ్లాదేశీ సినిమా “విధవ భార్య” పోస్టర్. ముఖంపై కాలిన గాయాలు ఉన్న రెండో ఫోటో మరో బంగ్లాదేశీ సినిమా “నేను నుస్రత్ మాట్లాడుతున్నాను” షూటింగ్‌కు సంబంధించినది. రెండవ ఫోటోలో ఉన్న గాయం మేకప్ మాత్రమే. నటీ జౌటీ ఇస్లాం స్వయంగా ఈ క్లెయిమ్ ఫేక్ అని స్పష్టం చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ అవుతున్న మొదటి ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, జౌటీ ఇస్లాం అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఇదే ఫోటోతో ఉన్న పలు పోస్టులు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) కనిపించాయి. ఈ పోస్టుల వివరాల ద్వారా ఈ ఫోటో “విధవ భార్య” అనే సినిమాకు చెందినది అని తెలిసింది.

“విధవ భార్య” అనే సినిమాకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా, ఇది ఒక బంగ్లాదేశీ సినిమా అని తెలిసింది. ఛాయస్ వ్యూ మీడియా అనే యూట్యూబ్‌ ఛానల్‌లో వైరల్ ఫోటోనే ఈ సినిమా థంబ్‌నెయిల్‌గా ఉపయోగించి “విధవ భార్య | బిధోబా బౌ | తుహిన్ చౌదరి | జౌటీ ఇస్లాం | మోహిన్ ఖాన్ | బంగ్లా న్యూ నాటిక 2024” అనే శీర్షికతో షేర్ చేశారు. దీని బట్టి మొదటి వైరల్ ఫోటో బంగ్లాదేశీ సినిమా ‘విధవ భార్య’ పోస్టర్‌దేనని, ఈ సినిమాలో జౌటీ ఇస్లాంనే నటించినట్లు తెలుస్తోంది.

ముఖంపై కాలిన గాయాలు ఉన్న రెండో ఫోటో నిజం తెలుసుకునేందుకు జౌటీ ఇస్లాం సోషల్ మీడియా హ్యాండిల్‌ను పరిశీలించగా, 21 అక్టోబర్ 2025న అప్లోడ్ చేసిన వీడియోలో ఆమె ముఖంపై కాలిన గాయాలు కనిపించాయి. ఆ వీడియో క్యాప్షన్‌, కామెంట్స్‌లో ఇది షూటింగ్‌లో భాగమేనని జౌటీ ఇస్లాం తెలిపింది. ఈ వీడియో “నేను నుస్రత్ మాట్లాడుతున్నాను” సినిమా షూటింగ్ సమయంలో తీసినట్లు, రెండవ వైరల్ ఫోటోలో కనిపించే కాలిన గాయం మేకప్ అని మేము తెలుసుకున్నాము.

03 నవంబర్ 2025న జౌటీ ఇస్లాం ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు వైరల్ ఫోటోలను షేర్ చేస్తూ, ఈ వైరల్ క్లెయిమ్ ఫేక్ అని స్పష్టం చేసింది.

చివరిగా, బంగ్లాదేశీ సినిమాల‌కు సంబంధించిన ఫోటోలను తప్పుడు ‘లవ్ జిహాద్’ క్లైములతో షేర్ చేస్తున్నారు.