అమెరికాలో నిర్మించిన ప్రత్యేక కోవిడ్-19 ఆసుపత్రుల ఫోటోలని తెలంగాణలో ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్లని షేర్ చేస్తున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని కళ్యాణ మండపాలను, సినిమా హాళ్ళను కోవిడ్ సెంటర్ల గా మారుస్తున్న అధికారులు, అంటూ రెండు ఫోటోలతో కూడిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. కరోనా వైరస్ నియంత్రణ చర్యలలో భాగంగా, ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈ పోస్టులో తెలిపారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని కళ్యాణ మండపాలను, సినిమా హాళ్ళను కోవిడ్ సెంటర్లుగా మారుస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటోలలో కనిపిస్తున్న కోవిడ్ క్వారంటైన్ సెంటర్లు అమెరికా దేశానికి సంబంధించినవి. మొదటి ఫోటోలో కనిపిస్తున్నది న్యూయార్క్ నగరంలోని ‘The Javits Convention Center’ భవనంలో నిర్మించిన ప్రత్యేక  కోవిడ్-19 ఎమర్జెన్సీ హాస్పిటల్. అలాగే, రెండవ ఫోటోలో కనిపిస్తున్నది కోలంబస్ నగరంలోని ‘Greater Columbus Convention Center’ అని తెలిసింది. మార్చ్ 2020 సమయంలో అమెరికా దేశంలో కరోనా వైరస్ భారీగా విజృంభించడంతో, రోగులకి చికిత్స అందించడానికి ఈ కోవిడ్-19 ఎమర్జెన్సీ ఆసుపత్రులని నిర్మించారు. ఈ కోవిడ్ సెంటర్లు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి కావు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఫోటో-1:

పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ మార్చి 2020 లో పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్ దొరికింది. ఈ ఫోటోలో కనిపిస్తున్నది న్యూయార్క్ నగరంలోని  ‘The Javits Convention Center’ అని ఈ ఆర్టికల్ తెలిపింది. న్యూయార్క్ నగరంలో కరోనా వైరస్ విజృంభించడంతో, కరోనా రోగులకి చికిత్స అందించడానికి ఈ కన్వెన్షన్ సెంటర్ ని కోవిడ్-19 ఎమర్జెన్సీ హాస్పిటల్ గా మార్చినట్టు ఈ ఆర్టికల్ రిపోర్ట్ చేసింది. ‘The Javits Convention Center’ లో నిర్మించిన ఈ కోవిడ్-19 ఎమర్జెన్సీ హాస్పిటల్ కి సంబంధించి పబ్లిష్ అయిన మరికొన్ని న్యూస్ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

ఫోటో-2:

పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ‘The Columbus Dispath’ న్యూస్ సంస్థ పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. ఈ ఫోటోలో కనిపిస్తున్నది అమెరికా దేశం ఒహాయో రాష్ట్రంలోని ‘Greater Columbus Convention Center’ అని ఆర్టికల్ తెలిపింది. కరోనా వైరస్ సోకిన వ్యక్తులకి చికిత్స అందించడానికి ఈ కన్వెన్షన్ సెంటర్ ని కోవిడ్-19 హాస్పిటల్ గా మార్చినట్టు ఈ ఆర్టికల్ లో రిపోర్ట్ చేసారు. ‘Greater Columbus Convention Center’ లో నిర్మించిన ఈ కోవిడ్-19 సెంటర్ కి సంబంధించి పబ్లిష్ అయిన మరికొన్ని న్యూస్ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో అమెరికా దేశానికి సంబంధించిందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, అమెరికా దేశంలో నిర్మించిన ప్రత్యేక కోవిడ్-19 హాస్పిటల్స్ ఫోటోలని చూపిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం కేసీఆర్ ప్రత్యేకంగా నిర్మించిన కోవిడ్ సెంటర్లని షేర్ చేస్తున్నారు.