ఇంతకముందు వరకు చైనా ఆక్రమణలో ఉన్న టిబెట్ లోని కైలాస్ మానసరోవర్ శిఖరాన్ని ఇప్పుడు భారత జవాన్లు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు, అంటూ షేర్ చేస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోస్టులోని ఈ ఫోటోలో జవాన్లు కైలాస పర్వతం ముందు భారత జెండాను ఎగరేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కైలాస్ మానసరోవర్ పర్వతం ముందు భారత జెండాను ఎగరేస్తున్న జవాన్ల ఫోటో.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో ఎడిట్ (ఫోటోషాప్) చేయబడినది. సంబంధం లేని రెండు ఫోటోలని కలిపి చైనా ఆధీనంలో ఉన్న మానసరోవర్ పర్వతాన్ని భారత జవాన్లు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్టుగా షేర్ చేస్తున్నారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అదే జవాన్ల సమూహం భారత జెండాను ఎగరేస్తున్న ఒరిజినల్ ఫోటో ‘DefenceXP’ అనే వెబ్సైటులో దొరికింది. ఒరిజినల్ ఫోటోలో భారత జవాన్ల వెనుక మానసరోవర్ పర్వతం లేదు. వెబ్సైటులో ఈ ఫోటో క్రెడిట్స్ భారత ఆర్మీ కి ఇచ్చారు. ఈ ఫోటోకి సంబంధించి మరింత సమాచారం కోసం వెతకగా, ఫోటోలో కనిపిస్తున్న అదే భారత జవాన్ల సమూహం యొక్క మరొక ఫోటో ‘India vs Disinformation’ అనే వెబ్సైటులో దొరికింది. విపరీతమైన చలిలో కూడా భారత ఆర్మీ త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తూ LOC దగ్గర 71వ గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు జరుపుకున్నారని అందులో తెలిపారు. ఈ ఒరిజినల్ ఫోటోని ఇక్కడ మరియు ఇక్కడ కూడా చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా భారత జవాన్లు త్రివర్ణ పతాకాన్ని ఎగరేసింది మానసరోవర్ దగ్గర కాదు, LOC దగ్గర అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
పోస్టులోని ఫోటోలో కనిపిస్తున్న పర్వతం గురించి వెతకగా, అదే పర్వతం యొక్క ఫోటోని ఒక యూసర్ తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఫోటోలో కనిపించేది కైలాస్ మానసరోవర్ పర్వతం అని ఆ యూసర్ అందులో తెలిపారు.
చివరగా, సంబంధం లేని రెండు ఫోటోలని జత చేసి కైలాస్ మనసరోవర్ ముందు త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తున్న భారత జవాన్లు అని షేర్ చేస్తున్నారు.