‘ఫైజర్ కంపెనీ US ప్రభుత్వానికి కోటి వ్యాక్సిన్లు ఒకొక్కటి ₹40 వేల చొప్పున అమ్మడానికి ఒప్పందం చేసుకుందని’ చేప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ విషయానికి సంబంధించిన నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: ఫైజర్ కంపెనీ US ప్రభుత్వానికి కోటి వాక్సిన్లు ఒకొక్కటి ₹40 వేల చొప్పున అమ్ముతుంది.
ఫాక్ట్ (నిజం): అమెరికా ప్రభుత్వం 2020లో ఫైజర్ వ్యాక్సిన్ పరిశోధన దశలో ఉన్నప్పుడే ఒక్క టీకాకి 19.5 డాలర్లు చొప్పున విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల నవంబర్ 2021లో ఫైజర్ కొత్తగా డెవలప్ చేస్తున్న ‘PAXLOVID’ అనే ఓరల్ (నోటి ద్వారా తీసుకునే) యాంటీవైరల్ డ్రగ్‌ని అమెరికా ప్రభుత్వానికి ఒక్కో కోర్స్ సుమారు ₹40 వేలు చొప్పున అమ్మేందుకు చేసుకున్న ఒప్పందాన్ని, గతంలో విక్రయించిన టీకా కూడా అదే ధరకు అమ్ముతునట్టు తప్పుగా అర్ధం చేసుకున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఫైజర్ కంపెనీ కరోనా వైరస్‌ను (SARS-CoV-2) ఎదురుకునేందుకు ‘PAXLOVID’ అనే ఓరల్ (నోటి ద్వారా తీసుకునే) యాంటీవైరల్ డ్రగ్‌ని అభివృద్ధి చేసింది. ఈ డ్రగ్‌ని ఒక కోర్స్ రూపంలో వాడాల్సి ఉంటుంది, పైగా ఈ డ్రగ్ ఇంకా పరిశోధన (క్లినికల్ ట్రయల్స్) దశలోనే ఉంది.
‘ఫైజర్ కంపెనీ PAXLOVID అత్యవసర వినియోగ అధికారం కోసం అమెరికా ప్రభుత్వం యొక్క ఫెడరల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) వద్ద ప్రయత్నిస్తుందని, PAXLOVID ఆమోదం పొందాక ఒక కోటి కోర్స్‌లు అమెరికా ప్రభుత్వానికి సప్లై చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుందని, ఇందుకుగాను అమెరికా ప్రభుత్వం ఫైజర్‌కి 5.29 బిలియన్ డాలర్లు చెల్లించనుందని’ ఫైజర్ కంపెనీ 18 నవంబర్ 2021 విడుదల చేసిన ఒక ప్రెస్ రిలీజ్‌లో పేర్కొంది.
కోటి కోర్స్‌లకి 5.29 బిలియన్ డాలర్లంటే ఒక కోర్స్‌కి 529 డాలర్స్ లెక్క. ఈ రోజు డాలర్- రూపాయి మారక విలువ ప్రకారం ఒక్క కోర్స్ సుమారు ₹40 వేలు. పోస్టులో చెప్తున్నది ఫైజర్ విడుదల చేసిన ఈ ప్రెస్ రిలీజ్ నుండి సేకరించిందే.
ఐతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పోస్టులో ప్రస్తావించింది ఫైజర్ ఇప్పుడు కొత్తగా డెవలప్ చేస్తున్న ఓరల్ యాంటీవైరల్ డ్రగ్ గురించి మాత్రమే, టీకా (ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం కరోనా నియంత్రణ కోసం ఇస్తున్న) వ్యాక్సిన్ గురించి కాదు. కరోనా నియంత్రణ కోసం ఉపయోగించేందుకు ప్రభుత్వ అనుమతి పొందిన మొట్టమొదటి వ్యాక్సిన్లలో ఫైజర్ ఒకటి.
వ్యాక్సిన్ రీసెర్చ్ దశలో ఉన్నప్పుడే మాన్యుఫాక్చరింగ్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్న దేశాలలో అమెరికా ఒక్కటి. ఫైజర్ తాము డెవలప్ చేసే వ్యాక్సిన్ వినియోగానికి సంబంధించి అన్ని ప్రభుత్వ అనుమతులు పొందిన నేపధ్యంలో అమెరికా ప్రభుత్వానికి ముందుగా ఒక 100 మిలియన్ డోసులు, ఆ తర్వాత మరో 500 మిలియన్ డోసులు సరఫరా చేస్తామని వ్యాక్సిన్ రీసెర్చ్ దశలో ఉన్నప్పుడే ఒప్పందం చేసుకుంది. ఐతే ముందుగా ఈ 100 మిలియన్ డోసులకుగాను అమెరికా ప్రభుత్వం 1.95 బిలియన్ డాలర్లు చెల్లించింది, అంటే ఒక్క టీకాకి 19.5 డాలర్లు, ఈ రోజు డాలర్- రూపాయి మారక విలువ ప్రకారం ఇది సుమారు ₹1500. ఇదే విషయాన్ని అన్ని ప్రముఖ వార్తా సంస్థలు కూడా ప్రచురించాయి (ఇక్కడ మరియు ఇక్కడ).
అమెరికా ప్రభుత్వానికి 2021లో 200 మిలియన్ డోసులు, 2022లో మరో 300 మిలియన్ డోసులు తక్కువ ధరలకే అందించనుందని ఫైజర్ ఈ సంవత్సరం జూన్‌లో ప్రకటించింది. అమెరికా ప్రభుత్వం ఈ వాక్సిన్లను WHO నెలకొల్పిన COVAX ద్వారా తక్కువ ఆదాయ, తక్కువ మధ్య- ఆదాయ దేశాలకు పంచనుంది.
పైన తెలిపిన వివరణ ప్రకారం అమెరికా ప్రభుత్వం ఫైజర్ కొత్తగా తయారు చేస్తున్న ఓరల్ యాంటీవైరల్ డ్రగ్ ఒప్పందాన్ని, ఫైజర్ టీకాని (mRNA వ్యాక్సిన్‌ని) కూడా ఎక్కువ ధరకు ప్రభుత్వానికి విక్రయిస్తుందని తప్పుగా అర్ధం చేసుకున్నట్టు స్పష్టమవుతుంది.
చివరగా, ఫైజర్, US ప్రభుత్వానికి ఒక్క డోస్ ₹40 వేల చొప్పున అమ్ముతున్నది తాము కొత్తగా తాయారు చేస్తున్న యాంటీవైరల్ డ్రగ్‌ను, ముందునుండి సరఫరా చేస్తున్న mRNA టీకా కాదు.