ఈ వీడియోలో పోలీసు వాహనాలపై రాళ్లతో దాడి చేస్తున్నది వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులు కాదు

ఇటీవల ఉత్తర్ ప్రదేశ్‌లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులపై దాడి జరిగి కొంత మంది రైతులు, ఆ తర్వాతి హింసాత్మక సంఘటనలలో కొందరు బీజేపీ కార్యకర్తలు చనిపోయిన నేపథ్యంలో, కొందరు వ్యక్తులు రాళ్లతో దాడి చేస్తూ పోలీస్ వాహానాన్ని తరుముతున్న వీడియోని రైతుల ఉద్యమానికి ఆపాదిస్తూ, రైతులు ఉద్యమం పేరుతో ఇలా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులు, పోలీస్ వాహనంపై రాళ్లతో దాడి చేసి తరుముతున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో ఒక మాంసం వ్యాపారిపై కాల్పులు జరిపిన దుండగులను వెంబడిస్తూ పోలీసులు అక్కడి బెంగాలీ మురికివాడల్లోకి వెళ్ళగానే, అక్కడి స్థానిక ప్రజలు పోలీసులపై రాళ్లు మరియు కత్తులతో దాడి చేశారు. ఈ వీడియో ఆ ఘటనకి సంబంధించిందే. ఈ దాడికి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులకు ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వీడియో గురించిన మరింత సమాచారం కోసం యూట్యూబ్‌లో కీవర్డ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోని రిపోర్ట్ చేసిన ఒక న్యూస్ వీడియో మాకు లభించింది. ఈ రిపోర్ట్ ప్రకారం ’01 అక్టోబర్ 2021 రాత్రి ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో ఒక మాంసం వ్యాపారిపై దుండగులు కాల్పులు జరిపారన్న సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంతలో దుండగులు తప్పించుకుని బెంగాలీ మురికివాడల్లోకి పారిపోయారు. ఐతే పోలీసులు వారిని వెంబడిస్తూ మురికివాడల్లోకి వెళ్ళగానే, అక్కడి స్థానిక ప్రజలు పోలీసులపై రాళ్లు మరియు కత్తులతో దాడి చేశారు.’ పోస్టులో షేర్ చేసిన వీడియో ఘటనకి సంబంధించిందే. ఐతే పోలీసులు ఈ ఘటనకి సంబంధించి పోలీసులపై దాడి చేసిన వారిలో 10 మందిని పట్టుకున్నట్టు ఈ కథనంలో పేర్కొన్నారు.

పైన తెలిపిన న్యూస్ రిపోర్ట్ ఆధారంగా గూగుల్‌లో వెతకగా, ఇదే వీడియోని రిపోర్ట్ చేస్తూ రాసిన ఒక వార్తా కథనం మాకు లభించింది. పైన చెప్పినట్టు ఈ కథనం కూడా ఈ వీడియో ఢిల్లీలోని సీమపురి ప్రాంతంలో పోలీసులపై కొందరు వ్యక్తులు చేసిన దాడికి సంబంధించిందని స్పష్టం చేస్తుంది. ఐతే ఈ వార్తా కథానాలేవి కూడా కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులు ఈ దాడి చేసినట్టుగాని లేక వారికి ఈ దాడితో సంబంధం ఉన్నట్టుగాని రాయలేదు.

పోలీసులపై జరిగిన ఈ దాడికి సంబంధించి జరిగిన అరెస్ట్ వార్తను ప్రముఖ వార్తా సంస్థలు కూడా ప్రచురించాయి (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ ). ఈ కథనాలు కూడా ఈ దాడితో రైతులకు సంబంధం ఉన్నట్టు చెప్పలేదు. వీటన్నిటిబట్టి ఈ దాడికి, రైతులకి ఎటువంటి సంబంధంలేదని స్పష్టమవుతుంది.

చివరగా, ఈ వీడియోలో పోలీసు వాహనాలపై రాళ్లతో దాడి చేస్తున్నది వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులు కాదు, ఢిల్లీ సీమాపురి ప్రాంతంలోని స్థానిక ప్రజలు.