అమెరికాలోని ఫిలడెల్ఫియా మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచిన పంచముఖ శివలింగం చిత్రాన్ని ఇటలీ మ్యూజియంలోని శివలింగమని షేర్ చేస్తున్నారు

ఇటలీ దేశం వాటికన్ నగరంలోని బాణ్ణిబిగో మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచిన పంచముఖ శివలింగం చిత్రమంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా షేర్ అవుతోంది. ఇటలీ ఉత్తరదిశ మధ్య ప్రాంతాలలో క్రీ.పు. 8 నుండి  4 వ.శతాబ్దం దాకా ఉన్న ఎడ్రూస్గర్  కాలంలో ఇటువంటి శివలింగాలకు పూజలు జరిగేవని చారిత్రక పరిశోధకులు తెలియజేసినట్టు ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

YouTube Poster

క్లెయిమ్: ఇటలీ వాటికన్ నగరంలోని బాణ్ణిబిగో మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచిన పంచముఖ శివలింగం యొక్క చిత్రం.

ఫాక్ట్ (నిజం): అమెరికాలోని ఫిలడెల్ఫియా మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచిన పంచముఖ శివలింగం శిల్పాన్ని ఈ ఫోటో చూపిస్తుంది.  19వ శతాబ్దంలో భారత దేశంలోని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ పంచముఖ శివలింగం శిల్పాన్ని రూపొందించారు. ఈ పంచముఖ శివలింగం ఇటలీ మ్యూజియంకు సంబంధించినది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటో ‘Pinterest’ వెబ్సైటులో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. 19వ శతాబ్దం నాటి పంచముఖ శివలింగం చిత్రమంటూ ఫిలడెల్ఫియా మ్యూజియం వారు ఈ ఫోటోని ‘Pinterest’ వెబ్సైటులో పబ్లిష్ చేశారు. అమెరికాకు చెందిన ఫిలడెల్ఫియా మ్యూజియం వెబ్సైటులో కూడా ఈ ఫోటోని పబ్లిష్ చేశారు. భారతదేశానికి సంబంధించిన 19వ శతాబ్దం నాటి పంచముఖ శివలింగం ఫోటో ఇదని ఫిలడెల్ఫియా మ్యూజియం వారు తెలిపారు.

19వ శతాబ్దంలో భారత దేశం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బనారస్ (ప్రస్తుత వారణాసి) నగరంలో ఈ పంచముఖ శివలింగం శిల్పాన్ని చెక్కినట్టు ఈ వెబ్సైటులో తెలిపారు.

వాటికన్ నగరంలో బాణ్ణిబిగో పేరుతో ఎటువంటి మ్యూజియం లేదు. వాటికన్ నగరంలో ఉన్న మ్యూజియంలలో పంచముఖ శివలింగం శిల్పమేదీ ప్రదర్శనకు ఉంచలేదు.పోస్టులో షేర్ చేసిన పంచముఖ శివలింగం, అమెరికాలోని ఫిలడెల్ఫియా మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారని, ఇటలీ దేశంలోని మ్యూజియంలో కాదని పై వివరాల ఆధారంగా ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, అమెరికాలోని ఫిలడెల్ఫియా మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచిన పంచముఖ శివలింగం చిత్రాన్ని ఇటలీలోని మ్యూజియంలోని శివలింగం శిల్పమంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు.