మోదీ 2019 అమెరికా పర్యటనపై ‘ది ప్రింట్‌’ మొదట రాసిన కథనాన్ని, వారి అనుమతితో పాకిస్తానీ వార్తా సంస్థ ‘డాన్’ తిరిగి పబ్లిష్ చేసింది

YouTube Poster

‘పాక్ దిన పత్రిక డాన్ మోదీజీ అమెరికా పర్యటన గురించి ఏమైతే రాసిందో కనీసం కామా, ఫుల్ స్టాప్ కూడా తేడా లేకుండా ఆన్లైన్ ఇండియా వెబ్ పోర్టల్ ‘ది ప్రింట్’ సెం టూ సేమ్ దించేసింది’ అని చెప్తూ ఆ రెండు న్యూస్ ఆర్టికల్స్ ఫోటోని పోల్చుతున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: పాక్ దిన పత్రిక డాన్ మోదీజీ అమెరికా పర్యటన గురించి ఏమైతే రాసిందో భారత్ ఆన్లైన్ వెబ్ పోర్టల్ ‘ది ప్రింట్’ కూడా సెం టూ సేమ్ దించేసింది.

ఫాక్ట్ (నిజం): సెప్టెంబర్ 2019లో జరిగిన మోదీ అమెరికా పర్యటనను విశ్లేషిస్తూ ఆన్లైన్ న్యూస్ పోర్టల్ అయిన ది ప్రింట్‌, ఆ సంస్థలో సీనియర్ అసోసియేట్ ఎడిటర్ అయిన నయనిమా బసు రాసిన ఒక కథనాన్ని పబ్లిష్ చేసింది. ఐతే ఇదే కథనాన్ని ది ప్రింట్‌ అనుమతితో ప్రముఖ పాకిస్తానీ పత్రిక డాన్ తమ పోర్టల్‌లో తిరిగి పబ్లిష్ చేసింది. అంతేగాని పాకిస్తాన్ కథనాన్ని ది ప్రింట్‌ కాపీ చేయలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

21-27 సెప్టెంబర్, 2019లో భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన జరిగింది. ప్రముఖ ‘హౌడీ మోదీ’ కార్యక్రమం ఈ పర్యటనలోనే జరిగింది. ఈ పర్యటనలో భారత్ – అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం జరుగుతుందని అప్పుడు వార్తలు వచ్చినప్పటికీ, అలాంటిదేమీ జరుగలేదు. ఐతే ఈ పర్యటన నేపథ్యంలోనే  భారత ఆన్లైన్ న్యూస్ పోర్టల్ ‘ది ప్రింట్‌’, ఆ సంస్థలో సీనియర్ అసోసియేట్ ఎడిటర్ అయిన నయనిమా బసు రాసిన ‘No trade deal, no Kashmir win, no investment but BJP celebrating Modi return from US’ అనే శీర్షికతో కాశ్మీర్, వాణిజ్య ఒప్పందం, భారత్‌లో పెట్టుబడులు వంటి అంశాలపై విశ్లేషిస్తూ రాసిన కథనాన్ని 29 సెప్టెంబర్ 2019న పబ్లిష్ చేసింది.

ఐతే మోదీ అమెరికా పర్యటనపై నయనిమా బసు రాసిన ఈ కథనాన్ని ‘ది ప్రింట్‌’ అనుమతితో ప్రముఖ పాకిస్తానీ వార్తా సంస్థ ‘డాన్’ అదే రోజు పబ్లిష్ చేసింది. ‘డాన్’ పబ్లిష్ చేసిన కథనం మొదట్లో ‘ఈ వ్యాసం మొదట ది ప్రింట్‌లో ప్రచురించబడింది, వారి అనుమతితోని ఈ కథనాన్ని తిరిగి ప్రచురిస్తున్నాము’ అని స్పష్టంగా పేర్కొన్నారు. దీన్నిబట్టి, పాకిస్తాన్ పత్రిక రాసిన కథనాన్ని భారత ఆన్లైన్ న్యూస్ పోర్టల్ ‘ది ప్రింట్‌’ కాపీ చేయలేదని, ది ప్రింట్‌ రాసిన కథనాన్నే పాకిస్తాన్ పత్రిక తిరిగి పబ్లిష్ చేసిందన్న  విషయం స్పష్టమవుతుంది.

చివరగా, 2019లో మోదీ అమెరికా పర్యటనని విశ్లేషిస్తూ మొదట ది ప్రింట్‌ రాసిన కథనాన్ని, వారి అనుమతితో ప్రముఖ పాకిస్తానీ వార్తా సంస్థ డాన్ తిరిగి పబ్లిష్ చేసింది.