“భారతదేశంలో ఆర్.ఎస్.ఎస్, బీజేపీ అత్యంత శక్తివంతమైనవని తాలిబాన్ ల అంతర్గత సంభాషణ” అని అంటూ ఒక వీడియోతో ఉన్న పోస్టును బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఆర్.ఎస్.ఎస్ మరియు బీజేపీ అత్యంత శక్తివంతమైనవని తాలిబాన్ల అంతర్గత సంభాషణ వీడియో.
ఫాక్ట్: వీడియో 01 మార్చ్ 2019న రికార్డు చేసారు. వీడియోలో ఉన్నది ఖాలిద్ మెహమూద్ అబ్బాసి. ఖాలిద్ పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఉంటున్న ఒక ఇస్లామిక్ స్కాలర్. 30 సంవత్సరాలు తన్జీమ్-ఎ-ఇస్లామీ అనే సంస్థతో పనిచేసాడు, 2018లో తన్జీమ్-ఎ-ఇస్లామీని విడిచిపెట్టి, అతను శుభ్బన్-ఉల్-ముస్లిం అనే సంస్థ స్థాపనలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం శుభ్బన్-ఉల్-ముస్లింలో పనిచేస్తున్నాడు. ఈ సంస్థలకి తాలిబాన్లతో సంబంధం ఉన్నట్టు మాకు ఎటువంటి సమాచారం లభించలేదు. ఆర్.ఎస్.ఎస్, బీజేపీ అత్యంత శక్తివంతమైనవని తాలిబాన్లు అన్నట్టు ఎటువంటి న్యూస్ ఆర్టికల్స్ లభించలేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.
వీడియోను గమనించినప్పుడు, “ఎన్ డబ్ల్యు ఏ ఏ స్టూడియోస్” అని వీడియో పైన లోగో ఉన్నట్టు చూడొచ్చు. యూట్యూబ్‌లో ఎన్ డబ్ల్యు ఏ ఏ స్టూడియోస్ (NWAA Studios) అని వెతకగా, అదే విజువల్స్‌తో ఉన్న ఒక యూట్యూబ్ వీడియో లభించింది. ఈ యూట్యూబ్ వీడియో 06 ఆగస్ట్ 2020న అప్లోడ్ చేసారు, కానీ వీడియో 01 మార్చ్ 2019న రికార్డ్ చేసినట్టు తెలుస్తుంది. యూట్యూబ్ వీడియోను 0.48 టైం స్టాంప్ దగ్గర క్లిప్ చేసి 11:23 నిడివిగల వీడియోను పోస్ట్ ద్వారా వైరల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. వీడియోలో ఉన్నది ఖాలిద్ మెహమూద్ అబ్బాసి అని టైటిల్ ద్వారా తెలుస్తుంది.
ఖాలిద్ అధికారిక ఫేస్బుక్ పేజీలో ఇచ్చిన సమాచారం ప్రకారం ఖాలిద్ పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఉంటున్న ఒక ఇస్లామిక్ స్కాలర్. 30 సంవత్సరాలు తన్జీమ్-ఎ-ఇస్లామీ అనే సంస్థతో పనిచేసాడు, 2018లో తన్జీమ్-ఎ-ఇస్లామీని విడిచిపెట్టి, అతను శుభ్బన్-ఉల్-ముస్లిం అనే సంస్థ స్థాపనలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం శుభ్బన్-ఉల్-ముస్లింలో పనిచేస్తున్నాడు. ఈ సంస్థలకి తాలిబాన్లతో సంబంధం ఉన్నట్టు మాకు ఎటువంటి సమాచారం లభించలేదు.
ఈ వీడియోలో ఆర్.ఎస్.ఎస్, ఇతర సన్నిహిత సంస్థల (సంఘ్ పరివార్) ఆలోచనలు, విధానాలు, వారికి దేశంలో ఉన్న శక్తి సామర్ధ్యాల గురించి ప్రస్తావించినట్టు తెలుస్తుంది. కానీ, బీజేపీ అధికారంలో ఉండగా భారత్ పై దాడి చేయాలంటే ఏ దేశం, తీవ్రవాద సంస్థ సాహసించలేదని ఈ వీడియోలో అనలేదు. కాంగ్రెస్ ఒక సెక్యులర్ గవర్నమెంట్ అని అన్నాడు. కానీ, భారత్ మీద దాడి చేయాలంటే మొదట బీజేపీ అనే పార్టీని అధికారం నుండి తొలగించాలని అన్నట్టు వీడియోలో లేదు. ఆర్.ఎస్.ఎస్, బీజేపీ అత్యంత శక్తివంతమైనవని తాలిబాన్లు అన్నట్టు ఎటువంటి సమాచారం లభించలేదు.
చివరగా, 2019లో ఒక పాకిస్తానీ ఇస్లామిక్ స్కాలర్ చేసిన వీడియోను ఆర్.ఎస్.ఎస్, బీజేపీలపై తాలిబాన్ చేసిన వ్యాఖ్యలని షేర్ చేస్తున్నారు.