17 అక్టోబర్ 2025న, సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన ‘జాయ్ ఫోరం’ కార్యక్రమం సందర్భంగా జరిగిన ఒక ప్యానెల్ చర్చలో, నటుడు సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ఇలా అన్నారు: “ప్రస్తుతం, మీరు ఒక హిందీ సినిమా తీసి ఇక్కడ (సౌదీ అరేబియాలో) విడుదల చేస్తే, అది సూపర్ హిట్ అవుతుంది. మీరు ఒక తమిళ, తెలుగు లేదా మలయాళ సినిమా తీస్తే, అది వందల కోట్ల వ్యాపారాన్ని చేస్తుంది ఎందుకంటే ఇతర దేశాల నుండి చాలా మంది ఇక్కడకు వచ్చారు. బలూచిస్తాన్ వారు ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన ప్రజలు ఉన్నారు, పాకిస్తాన్ ప్రజలు ఉన్నారు, అందరూ ఇక్కడ పనిచేస్తున్నారు.” నటులు ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్ కూడా పాల్గొన్న ఈ కార్యక్రమంలో సల్మాన్ చేసిన ఈ వ్యాఖ్య (పాకిస్తాన్, బలూచిస్తాన్ లను వేరు వేరుగా సంబోధించడం) ఆన్‌లైన్‌లో విస్తృత చర్చకు దారితీసింది.
ఈ సందర్భంలో, పాకిస్తాన్ నటుడు సల్మాన్ ఖాన్‌ను పాకిస్తాన్ ఇటీవల ‘టెర్రరిస్ట్’గా ప్రకటించిందని చెప్తున్న వీడియోలు, పోస్టులు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) కొన్ని సోషల్ మీడియాలో షేర్ చేయబడుతున్నాయి. అసలు “బలూచిస్తాన్” ప్రస్తావన ఆయన తేవడం ఏంటి అని చెప్పి పాకిస్తాన్‌కు విపరీతమైన కోపం వచ్చి ఇలా చేసిందని ఈ వీడియోలలో చెప్తున్నారు. ఈ వీడియోలతో పాటు షేర్ అవుతున్న ఒక నోటిఫికేషన్ ప్రకారం, సల్మాన్ ఖాన్‌ను పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక చట్టం, 1997 కింద, ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న వ్యక్తులను పర్యవేక్షించడానికి ఉపయోగించే జాబితా అయిన నాల్గవ షెడ్యూల్‌లో (fourth schedule) చేర్చింది. ఈ నోటిఫికేషన్ బలూచిస్తాన్ హోం శాఖ వారు విడుదల చేసినట్లు ఇందులో ఉంది. న్యూస్ 18, మింట్, ది టెలిగ్రాఫ్, మనీకంట్రోల్, డిడి న్యూస్, ది టైమ్స్ ఆఫ్ ఇండియా, ఔట్‌లుక్ వంటి అనేక భారతీయ మీడియా సంస్థలు కూడా దీనిపై కథనాలను ప్రచురించాయి. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను పాకిస్తాన్ ఇటీవల ‘టెర్రరిస్ట్’గా ప్రకటించింది. పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద నిరోధక చట్టం, 1997 కింద తీవ్రవాద లేదా నిషేధిత సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులను పర్యవేక్షించే జాబితాలో సల్మాన్ ఖాన్‌ను చేర్చింది.
ఫ్యాక్ట్: ఈ వాదనలో ఎటువంటి నిజం లేదు. వైరల్ అవుతున్న ఈ నోటిఫికేషన్ ఒక పాత నోటిఫికేషన్‌ను ఉపయోగించి తయారు చేసినది. పాకిస్తాన్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ యొక్క ఫ్యాక్ట్ చెక్ విభాగం వారు 26 అక్టోబర్ 2025న ఇది నిజం కాదని స్పష్టం చేశారు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ముందుగా వైరల్ నోటిఫికేషన్‌ను(సర్క్యులర్) పరిశీలించినప్పుడు, అది నిజమైనది కాదని సూచించే అనేక అవకతవకలు మాకు అందులో కనిపించాయి. ఈ సర్క్యులర్ 16 అక్టోబర్ 2025 నాటిది. కానీ సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్ పాల్గొన్న ప్యానెల్ చర్చ, రియాద్‌లో జరిగిన జాయ్ ఫోరమ్ యొక్క రెండవ రోజున అనగా 17 అక్టోబర్ 2025న జరిగింది. అంటే, సల్మాన్ ఖాన్ బలూచిస్తాన్ వ్యాఖ్యకు ముందు నోటిఫికేషన్ జారీ చేయబడిందని ఇది చూపిస్తుంది. అంతేకాకుండా, ఇందులో చాలా స్పెల్లింగ్, వ్యాకరణ లోపాలు ఉన్నాయి: “BALOCHISTAN” ను “BALOCIIISTAN” అని, “Terrorism” ను “Terrarism” అని, “Affiliated” ను “Affilisted” అని మరియు “Such person” ను “Soch person” అని ఇందులో వ్రాయబడి ఉంది.
దీని బట్టి ఈ నోటిఫికేషన్ ఫేక్ అయి ఉండవచ్చు అని, అధికారికంగా విడుదల చేసినది కాదని మనకు అర్థం అవుతుంది. అలాగే, పాకిస్తాన్ పౌరులకు మాత్రమే జారీ చేసే (ఇక్కడ, ఇక్కడ) కంప్యూటరైజ్డ్ నేషనల్ ఐడెంటిటీ కార్డ్ (CNIC) నంబర్ సల్మాన్ ఖాన్‌కు కూడా ఉన్నట్లు ఇందులో ఉంది. “52203-000000” అనే ఈ నంబర్‌లో 11 అంకెలు ఉన్నాయి, అయితే పాకిస్తానీ CNIC నంబర్‌లో 13 అంకెలు ఉంటాయి. అంటే ఇది ఇన్‌వ్యాలీడ్ నంబర్.
తర్వాత, తగిన కీవర్డ్స్ ఉపయోగించి మేము ఇంటర్నెట్‌లో వెతకగా, బలూచ్ ఉమెన్ ఫోరం వారు 21 అక్టోబర్ 2025న చేసిన ఒక X పోస్ట్ (ఆర్కైవ్ చేయబడింది) మాకు లభించింది. దీనిలో ముగ్గురు వ్యక్తులను నాల్గవ షెడ్యూల్‌కు జోడిస్తూ చేసిన ఒక అధికారిక నోటిఫికేషన్ ఉంది.
వైరల్ అవుతున్న నోటిఫికేషన్‌లో ఈ నోటిఫికేషన్‌లోని అవే వివరాలు ఉన్నాయని మాకు తెలిసింది. ఇందులో ఉన్న సీరియల్ నంబర్, మొదటి పేరాలోని రిఫరెన్స్ లెటర్ నంబర్, టెక్స్ట్, జారీ చేసిన తేదీ, స్టాంప్, సంతకం యొక్క స్థానం ఇవన్నీ వైరల్ అవుతున్న నోటిఫికేషన్‌లో ఉన్నట్లు గానే ఉన్నాయి. అంటే దీన్ని సల్మాన్ ఖాన్‌ను ఇరికించడానికి ఎడిట్ చేసి తయారు చేసినదని దీనిబట్టి మను అర్థం అవుతుంది.
పాకిస్తాన్ లేదా బలూచిస్తాన్ ప్రభుత్వాల నుండి లేదా విశ్వసనీయ పాకిస్తాన్ మీడియా సంస్థల ద్వారా కానీ, సల్మాన్ ఖాన్ ఉగ్రవాద నిరోధక చట్టంలోని నాల్గవ షెడ్యూల్‌లో చేర్చబడ్డారని సూచించే ఎటువంటి అధికారిక సమాచారం మాకు దొరకలేదు.
పాకిస్తాన్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వారి ఫ్యాక్ట్ చెక్ విభాగం, 26 అక్టోబర్ 2025న చేసిన ఒక X పోస్ట్‌లో, సల్మాన్ ఖాన్‌ను ఉగ్రవాద నిరోధక చట్టం కింద పాకిస్తాన్ “నాల్గవ షెడ్యూల్”లో చేర్చారు అనే వాదనలు నకిలీవని తెలిపారు.
చివరగా, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను పాకిస్తాన్ ఇటివల ‘టెర్రరిస్ట్’గా ప్రకటించలేదు.