1987లో సియాచిన్‌లో క్వాడ్ పోస్ట్‌ను తమ ఆధీనంలోకి తీసుకునే ఆపరేషన్‌కు లెఫ్టినెంట్ రాజీవ్ పాండే గౌరవార్థం ‘ఆపరేషన్‌ రాజీవ్’ అని పేరు పెట్టారు

‘1987లో సియాచిన్‌లో కొంత భూమిని ఆక్రమించుకునే ఆపరేషన్‌కు రాజీవ్ గాంధీ పేరు పెట్టారని’ చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఈ విషయానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.

YouTube Poster

క్లెయిమ్: 1987లో సియాచిన్‌లో కొంత భూమిని ఆక్రమించుకునే ఆపరేషన్‌కు రాజీవ్ గాంధీ పేరు పెట్టారు.

ఫాక్ట్ (నిజం): 1987లో భారత సైన్యం ‘ఆపరేషన్ రాజీవ్’ ద్వారా సియాచిన్‌లో పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న క్వాడ్ పోస్ట్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంది. ఐతే అంతకు ముందు ఇదే ప్రయత్నంలో మరణించిన సెకండ్ లెఫ్టినెంట్ రాజీవ్ పాండే గౌరవార్థం ఈ ఆపరేషన్‌కు అయన పేరు పెట్టారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వార్తా కథనాలు మరియు పుస్తకాలలో కూడా లెఫ్టినెంట్ రాజీవ్ పాండే గౌరవార్థం ఈ ఆపరేషన్‌కు అయన పేరు పెట్టారని స్పష్టంగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రచురించే ఎన్‌సిఈఆర్‌టీ పుస్తకంలో సెకండ్ లెఫ్టినెంట్ రాజీవ్ పాండే మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఆపరేషన్ రాజీవ్ ప్రారంభించారని పేర్కొన్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

1987 మే నెలలో సియాచిన్‌లో పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న క్వాడ్ పోస్ట్‌ను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు సెకండ్ లెఫ్టినెంట్ రాజీవ్ పాండే నేతృత్వంలోని భారత సైనిక బృందం ప్రయత్నించి, విఫలమైంది. ఐతే ఈ ప్రయత్నంలో లెఫ్టినెంట్ రాజీవ్ పాండేతో పాటు మరికొందరు భారత సైనికులు చనిపోయారు.

ఐతే 1987 జూన్ నెలలో క్వాడ్ పోస్ట్‌ను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు భారత సైన్యం మరొక ఆపరేషన్‌ను మొదలుపెట్టి, ఈ సారి విజయం సాధించింది. ఐతే ఈ ఆపరేషన్‌కు గత ప్రయత్నంలో చనిపోయిన లెఫ్టినెంట్ రాజీవ్ పాండే గౌరవార్థం ‘ఆపరేషన్ రాజీవ్’ అని పేరు పెట్టారు.

కేంద్ర ప్రభుత్వం ప్రచురించే ఎన్‌సిఈఆర్‌టీ పుస్తకంలో క్వాడ్ పోస్ట్‌ను భారత సైన్యం ఆధీనంలోకి తీసుకున్న ఆపరేషన్‌కు రాజీవ్ పాండే అని పేరు పెట్టారని, సెకండ్ లెఫ్టినెంట్ రాజీవ్ పాండే మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఆపరేషన్ రాజీవ్ ప్రారంభించారని పేర్కొన్నారు.

ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వార్తా కథనాలలో కూడా లెఫ్టినెంట్ రాజీవ్ పాండే గౌరవార్థం ‘ఆపరేషన్ రాజీవ్’ అని పేరు పెట్టారని పేర్కొన్నారు. ఈ కథనాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఒకవేళ ఈ ఆపరేషన్‌కు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ గౌరవార్థం అయన పేరు పెట్టి ఉంటే ఈ విషయాన్ని వార్తా సంస్థలు రిపోర్ట్ చేసి ఉండేవి, కాని మాకు అలంటి కథనాలేవి లభించలేదు.

ఈ ఆపరేషన్‌ గురించి రాసిన పుస్తకాలలో కూడా లెఫ్టినెంట్ రాజీవ్ పాండే గౌరవార్థం ‘ఆపరేషన్ రాజీవ్’ అని పేరు పెట్టారని పేర్కొన్నారు. భారత సైన్యానికి సంబంధించి కల్నల్ ఫ్రాన్సిస్ రాసిన ‘Short Stories from the History of the Indian Army Since August 1947’ పుస్తకంలో కూడా ఈ ఆపరేషన్‌కు లెఫ్టినెంట్ రాజీవ్ పాండే గౌరవార్థం ‘ఆపరేషన్ రాజీవ్’ అని పేరు పెట్టారని పేర్కొన్నాడు.

చివరగా, 1987లో సియాచిన్‌లో క్వాడ్ పోస్ట్‌ను తమ ఆధీనంలోకి తీసుకునే ఆపరేషన్‌కు లెఫ్టినెంట్ రాజీవ్ పాండే గౌరవార్థం ‘ఆపరేషన్‌ రాజీవ్’ అని పేరు పెట్టారు.