“మాన్ ధన్ యోజన” పథకానికి ప్రస్తుతం 18-40 ఏళ్ల వయస్సు ఉన్న చిన్న రైతులు మాత్రమే అర్హులు

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన’ పథకం కింద 5 ఎకరాలు లోపు పొలం ఉన్న 60 ఏళ్లు దాటిన రైతులకు నెలకు రూ. 3000 పెన్షన్ వస్తుంది అని చెప్తున్న ఒక పోస్టు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

YouTube Poster

Claim: ‘ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన’ పథకం కింద 5 ఎకరాలు లోపు పొలం ఉన్న 60 ఏళ్లు దాటిన రైతులకు నెలకు రూ. 3000 పెన్షన్ వస్తుంది.

ఫాక్ట్: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకానికి కేవలం 18 నుంచి 40 వయస్సు ఉండి 2 హెక్టార్ల (5 ఎకరాలు)లోపు సాగు భూమి ఉన్న రైతులు మాత్రమే అర్హులు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారు, తమ వయస్సుని బట్టి, 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ప్రతి నెలా కొంత డబ్బుని చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్ల నిండిన తర్వాత, అప్పుడు వీరికి ప్రతి నెలా రూ. 3000 పెన్షన్ వస్తుంది. అందువలన,  ప్రస్తుతం 60 ఏళ్లు దాటిన వ్యక్తులకు ఈ పథకం కింద ఎటువంటి పెన్షన్ రాదు. కావున, ఈ పోస్టు తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా ఈ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, దీని అధికారిక వెబ్‌సైటుకు వెళ్ళాము. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం 18 నుంచి 40 ఏళ్ల వయసు ఉన్న చిన్న, సన్న కారు రైతులకు వృద్దాప్యంలో పెన్షన్ ఇవ్వడం ద్వారా ఆర్ధికంగా అండగా ఉండటం.

ఈ పథకానికి ఎవరు అర్హులు?  

పథకం ప్రయోజనాలు:

పై రెండు అర్హతలు ఉన్న వారు ఈ పథకం ప్రకారం మొదట ప్రభుత్వానికి ప్రతినెలా వారి  వయస్సుని బట్టి కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, ఈ పథకానికి ధరఖాస్తు చేసుకున్న సమయంలో వ్యక్తి వయస్సు 18 అయితే, ఆ వ్యక్తికి 60 ఏళ్లు వచ్చే వరకు ప్రతి నెలా రూ. 55 చెల్లించాల్సి ఉంటుంది. ఈ వ్యక్తికి 60 ఏళ్లు నిండిన తర్వాత అతను ఏమీ  చెల్లించాల్సిన అవసరం లేదు. అప్పుడు అతనికి/ఆమెకు ప్రతినెలా రూ. 3000 పెన్షన్ వస్తుంది.  అలాగే, ఈ పథకానికి ధరఖాస్తు చేసుకున్నప్పుడు వ్యక్తి  వయస్సుని బట్టి ప్రతినెలా ఎంత డబ్బు చెల్లించాలో ఈ క్రింది పట్టికలో చూడవచ్చు. ఈ పథకానికి సంబంధించి మరిన్ని విషయాలను ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, ప్రధానమంత్రి మాన్ ధన్ యోజన పథకం ద్వారా ప్రస్తుతం 60 ఏళ్లు నిండిన రైతులకు ఎటువంటి పెన్షన్ రాదు. ఇది కేవలం ప్రస్తుతం 18-40 ఏళ్ల వయస్సు ఉన్న చిన్న రైతులకు సంబంధించిన పథకం.