బంగ్లాదేశ్‌లో ధ్వంసం చేయబడిన రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహం పాత ఫోటోలు, 2024లో బంగ్లాదేశ్‌లో జరుగుతున్న సంక్షోభానికి సంబంధించినవిగా షేర్ చేస్తున్నారు

బంగ్లాదేశ్‌లో 2024లో కొనసాగుతున్న సంక్షోభం మధ్య, రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న వీడియో మరియు ఫోటోను “సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). దీని వెనుక ఎంత వాస్తవం ఉందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

ఆర్కైవ్ చేసిన పోస్టును ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బంగ్లాదేశ్‌లో 2024లో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహాన్ని ధ్వంసం చేసారు, వాటికి సంబంధించిన ఫోటోలు.

ఫాక్ట్ (నిజం): ఈ విజువల్స్ బంగ్లాదేశ్‌లో ఇటీవలి 2024 అశాంతికి సంబంధించినవి కాదు, 2023 నాటివి. వార్తా కథనాల ప్రకారం, ఢాకా యూనివర్శిటీలోని ఫైన్ ఆర్ట్స్ ఫ్యాకల్టీకి చెందిన స్కల్ప్చర్ డిపార్ట్‌మెంట్ విద్యార్థులు 14 ఫిబ్రవరి 2023న పబ్లిక్ ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో భాగంగా బంగ్లాదేశ్‌లో ‘సెన్సార్‌షిప్ మరియు వాక్ స్వాతంత్య్రాన్ని అరికట్టడానికి’ వ్యతిరేకతకు చిహ్నంగా, రాజు మెమోరియల్ స్కల్ప్చర్ దగ్గర 19.5 అడుగుల ఠాగూర్ శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిష్టించిన రెండు రోజుల తర్వాత విగ్రహం కనిపించకుండా పోయింది. విగ్రహం యొక్క విరిగిన తల మరియు ఇతర భాగాలు ఢాకాలోని సుహ్రవర్ది ఉద్యాన్‌లో కనుగొనబడ్డాయి. ఢాకా యూనివర్శిటీ ప్రొక్టర్, ప్రొఫెసర్ డాక్టర్ ఎకె.ఎం.గోలమ్ రబ్బానీ మాట్లాడుతూ, “యూనివర్సిటీలో విగ్రహాలు స్థాపించే విషయంలో సంస్థకు కొన్ని పాలసీలు ఉన్నాయి, ఈ విగ్రహం యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ను సంప్రదించకుండా స్థాపించినందున మేము దాన్ని తొలగించాము (అనువదించబడింది)” అని తెలిపారు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. 

బంగ్లాదేశ్‌లో కోటా వ్యతిరేక ఉద్యమంగా జూలై 2024లో ప్రారంభమైన నిరసనలు, ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటుగా పరిణామం చెంది, తీవ్ర రాజకీయ అనిశ్చితికి దారి తీశాయి. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవడంతో పరిస్థితి ఇంకా తీవ్రమైంది. మైనారిటీలు, ముఖ్యంగా హిందువుల ఇళ్లు మరియు వ్యాపారాలపై దాడి చేసి వారి విలువైన వస్తువులను (ఇక్కడ) దోచుకున్నారని వార్తా సంస్థలు ప్రచురించాయి. 

ఈ నేపథ్యంలో వైరల్ అవుతున్న రవీంద్రనాధ్ ఠాగూర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వైరల్ ఫోటో గురించి తెలుసుకుందేందుకు రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, 17 ఫిబ్రవరి 2023న ఢాకాకు చెందిన బెంగాలీ వార్తా సంస్థ ‘ప్రోథమ్ అలో’ వైరల్ ఫోటోను  ప్రచురించిన కథనం లభించింది. దీని ప్రకారం, ఢాకా యూనివర్శిటీలోని ఫైన్ ఆర్ట్స్ ఫ్యాకల్టీకి చెందిన స్కల్ప్చర్ డిపార్ట్‌మెంట్ విద్యార్థులు 14 ఫిబ్రవరి 2023న పబ్లిక్ ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో భాగంగా బంగ్లాదేశ్‌లో ‘సెన్సార్‌షిప్ మరియు వాక్ స్వాతంత్య్రాన్ని అరికట్టడానికి’ వ్యతిరేకతకు చిహ్నంగా, రాజు మెమోరియల్ స్కల్ప్చర్ దగ్గర 19.5 అడుగుల ఠాగూర్ శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిష్టించిన రెండు రోజుల తర్వాత విగ్రహం కనిపించకుండా పోయింది. విగ్రహం యొక్క విరిగిన తల మరియు ఇతర భాగాలు ఢాకాలోని సుహ్రవర్ది ఉద్యాన్‌లో కనుగొనబడ్డాయి.

తదుపరి, రవీంద్రనాధ్ ఠాగూర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న వీడియో గురించి తెలుసుకునేదుకు, వీడియో యొక్క కీ ఫ్రేములను ఉపయోగిస్తూ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, 17 ఫిబ్రవరి 2023న ప్రచురించబడిన ఢాకా ట్రిబ్యూన్ కథనంలో కూడా అదే ఠాగూర్ విగ్రహం యొక్క ఫోటోను ప్రచురించడం మేము కనుగొన్నాము. ఈ రిపోర్ట్ ప్రకారం, రాజు మెమోరియల్ స్కల్ప్చర్ పక్కన విద్యార్థులు ఏర్పాటు చేసిన రవీంద్రనాధ్ ఠాగూర్ విగ్రహాన్ని, ఢాకా విశ్వవిద్యాలయం (DU) అధికారులు తొలగించారు. ఢాకా యూనివర్శిటీ ప్రొక్టర్, ప్రొఫెసర్ డాక్టర్ ఎకెఎం గోలమ్ రబ్బానీ మాట్లాడుతూ, “యూనివర్సిటీలో విగ్రహాలు స్థాపించే విషయంలో సంస్థకు కొన్ని పాలసీలు ఉన్నాయి, ఈ విగ్రహం యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ను సంప్రదించకుండా స్థాపించినందున మేము దాన్ని తొలగించాము (అనువదించబడింది)” అని తెలిపారు. ఈ వీడియోను 16 ఫిబ్రవరి 2023న ‘ప్రోథమ్ అలో’ ప్రచురించడం గమనించాం.

18 ఫిబ్రవరి 2023న ఢాకా ట్రిబ్యూన్ ప్రచురించిన ఒక కథనం ప్రకారం, విద్యార్థులు ఈ శిల్పాన్ని పునర్నిర్మించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని రిపోర్టులను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, బంగ్లాదేశ్‌లో ధ్వంసం చేయబడిన రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహం యొక్క పాత విజువల్స్, 2024లో బంగ్లాదేశ్‌లో జరుగుతున్న సంక్షోభానికి సంబంధించిందిగా షేర్ చేస్తున్నారు.