పాత వీడియోలని భారత సైనికులు ఇటీవల చైనా సైనికులను నిలువరిస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

ఇటీవల భారత భూభాగంలోకి చొరబడిన చైనా సైనికులను భారత సైన్యం నిలువరిస్తున్న దృశ్యం, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. చైనా సైనికాధికారులు ‘తప్పిపోయి వచ్చాము..’, అని కాళ్ళు పట్టుకుంటేగానీ, భారత సైన్యం వారిని విడిచిపెట్టలేదని పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోకి చొరబడిన 200 మంది చైనా సైనికులను గతవారం భారత సైన్యం అడ్డుకొని గాయపరిచిన దృశ్యాలంటూ మరొక వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: భారత భూభాగంలోకి చొరబడిన చైనా సైనికులను ఇటీవల భారత ఆర్మీ నిలువరిస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): మొదటి పోస్టులోని ఫోటో, 2020 భారత్- చైనా గల్వాన్ వ్యాలీ యుద్ధం ఆధారంగా నిర్మించిన ఒక సినిమా షూటింగ్‌లోని దృశ్యాన్ని చూపిస్తుంది. మరొక పోస్టులో షేర్ చేసిన వీడియో, 2020లో చైనా-భారత్ గల్వాన్ వ్యాలీ ఘర్షణలో గాయపడిన చైనా సైనికుడి దృశ్యాలని చూపిస్తుంది. ఈ ఘర్షణ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఫోటో:

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ పలు చైనీస్ న్యూస్ సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఆ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. 2020 భారత్-చైనా సరిహద్దు ఘర్షణ ఆధారంగా రూపొందించిన చిత్రంలోని దృశ్యాలని ఈ వార్తా సంస్థలు తమ ఆర్టికల్స్‌లో రిపోర్ట్ చేసాయి. గల్వాన్ వ్యాలీ ఘర్షణలో చైనా సైనికుల ధైర్యసాహసాలను తక్కువ చేస్తూ భారతీయ చలనచిత్ర సంస్థలు సినిమాలు తీస్తున్నారని ఈ ఆర్టికల్స్‌లో ఆరోపించారు.

ఈ వివరాల ఆధారంగా ఆ ఫోటోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Martial Art Ladakh’ అనే యూట్యూబ్ ఛానల్ 03 డిసెంబర్ 2020 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. 2020లో భారత్-చైనా సరిహద్దు ఘర్షణ ఆధారంగా రుపొంచించిన ‘LAC’ సినిమాలోని మేకింగ్ దృశ్యాలని ఈ వీడియోలో తెలిపారు. ఈ సినిమా చిత్రికరణకు సంబంధించిన వీడియోని ‘Daily Excelsior’ న్యూస్ ఛానల్ 30 నవంబర్ 2020 నాడు ఒక వీడియో పబ్లిష్ చేసింది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో 2020 భారత్-చైనా యుద్ధం ఆధారంగా రూపొందించిన చిత్రంలోని దృశ్యాలని ఖచ్చితంగా చెప్పవచ్చు.

వీడియో:

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘RT’ న్యూస్ ఛానల్ 2021 ఫిబ్రవరి నెలలో తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసినట్టు తెలిసింది. గత ఏడాది భారత దేశంతో జరిగిన సరిహద్దు ఘర్షణకు సంబంధించిన దృశ్యాలని చైనా విడుదల చేసిందని ఈ వీడియో వివరణలో తెలిపారు.

‘RT’ న్యూస్ ఛానల్ పబ్లిష్ చేసిన ఈ వీడియోని జాగ్రత్తగా గమనిస్తే, గాయపడిన వ్యక్తిని తీసుకెళ్తున్న సైనికుల యూనిఫోరం పై పీపుల్ లిబరేషన్ ఆర్మీ (PLA) లోగో ఉండటాన్ని మనం చూడవచ్చు. దీన్ని బట్టి, వీడియోలో గాయపడిన వ్యక్తి చైనా సైనికుడని స్పష్టమయ్యింది. చైనా రిలీజ్ చేసిన ఈ వీడియోని పలు న్యూస్ సంస్థలు తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసాయి. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోలోని ఘటన ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకోలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, పాత వీడియోలని షేర్ చేస్తూ భారత సైనికులు ఇటీవల చైనా సైనికులను నిలువరిస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.