Fake News, Telugu
 

పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ సైన్యం దాడులంటూ పాత వీడియోలను షేర్ చేస్తున్నారు

0

ఇజ్రాయిల్ మరియు పాలస్తీనా మధ్య దాడులు జరుగుతున్న నేపథ్యంలో  సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ‘ఇజ్రాయిల్ సైన్యం పాలస్తీనా ప్రజలపై దాడులు’ అన్న పేరుతో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ఆలాంటి రెండు వీడియోలు షేర్ చేసిన పోస్టులు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఐతే ఈ కథనం ద్వారా ఆ పోస్టులకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇజ్రాయిల్ సైన్యం పాలస్తీనా ప్రజలపై దాడులు చేస్తున్న వీడియోలు.

ఫాక్ట్ (నిజం): ఇవి ఇజ్రాయిల్ – పాలస్తీనా కి చెందిన పాత వీడియోలు, ఒక వీడియో 2012లో జరిగిన ఘటనకి సంబంధించింది కాగా మరొకటి 2018లో జరిగిన ఘటనది. ఈ వీడియోలకి ప్రస్తుతం ఇజ్రాయిల్ మరియు పాలస్తీనా మధ్యలో జరుగుతున్న ఘర్షణలకి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వీడియో 1:

ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోని 2018లో ప్రచురించిన ఒక వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం జెరూసలేం పట్టణ సమీపంలోని అల్-ఖాన్ అల్-అహ్మర్‌ ప్రాంతంలో పాలస్తీనాకి చెందిన బెడౌయిన్ తెగకి చెందిన నివాస ప్రాంతాలను ఇజ్రాయిల్ సైన్యం తొలగిస్తున్న సమయంలో ఇజ్రాయిల్ సైన్యానికి మరియు ఆ తెగకి చెందిన వారికి మధ్య జరిగిన జరిగింది. ఈ వీడియో ఆ ఘర్షణలకు సంబంధించింది.

ఐతే పైన తెలిపిన కథనం ఆధారంగా యూట్యూబ్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా బెడౌయిన్ కి చెందిన నివాసాలను ఇజ్రాయిల్ సైన్యం కూల్చేసే క్రమంలో జరిగిన ఘర్షణలు చోటుచేసుకున్నాయి అనే సారాంశం గల వివరణతో 2018లో అప్లోడ్ చేసిన ఒక న్యూస్ వీడియో మాకు కనిపించింది. ఈ వీడియో మరియు పోస్టులోని వీడియో రెండు వేరైనప్పటికి రెండు ఒకే ప్రాతంలో మరియు ఒకే సందర్భంలో తీసినవని చెప్పడానికి మాకు కొన్ని ఆధారాలు లభించాయి. వీటిని బట్టి, పోస్టులోని వీడియో మరియు ఈ న్యూస్ వీడియో రెండు ఒకే ఘటనకి సంబంధించినవని చెప్పొచ్చు.

పైగా వీటి ఆధారంగా గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా 2018లో బెడౌయిన్ తెగకి చెందిన నివాస ప్రాంతాలను ఇజ్రాయిల్ సైన్యం తొలగించడానికి సంబంధించి చాలా వార్తా కథనాలు మాకు లభించాయి, ఈ కథనాలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. వీటన్నిటి ఆధారంగా ఈ వీడియో పాతదని అర్ధం చేసుకోవచ్చు.

వీడియో 2:

ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వీడియోని రిపోర్ట్ చేసిన న్యూస్ వీడియోని ఒక యూట్యూబ్ యూసర్ తన ఛానల్ లో 2012లో అప్లోడ్ చేసిన వీడియో మాకు కనిపించింది. ఈ వీడియోలో కనిపిస్తున్న సబ్ టైటిల్స్ ప్రకారం ఈ వీడియో పాలస్తీనాలోని సెంట్రల్ వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలోని నబీ సలీహ్ అనే ఉళ్ళో తమ స్థలాన్ని ఇజ్రాయిల్ సైన్యం ఆక్రమించుకోవడంతో ఒక కుటుంబానికి ఇజ్రాయిల్ సైన్యానికి మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సందర్భానిది.

యూట్యూబ్ వీడియో ఆధారంగా గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా పోస్టులోని విజువల్స్ ని పోలిన ఫోటోలు ప్రచురించిన ఒక 2012 వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనంలో ఈ ఫోటోకి సంబంధించిన వివరణ కూడా పైన తెలిపిన విషయాన్నే ద్రువీకరిస్తుంది. దీన్నిబట్టి, పోస్టులోని వీడియో 2012కి సంబంధించిన వీడియో అని స్పష్టమవుతుంది.

2019లో జరిగిన ఇంకో ఘటనకి సంబందించిన వీడియోని కూడా ఇప్పుడు మళ్ళీ షేర్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఇజ్రాయిల్ మరియు పాలస్తీనా మధ్యలో ఘర్షణలు జరుగుతున్న విషయం నిజమైనప్పటికి, పోస్టుల్లోని వీడియోలు ఇజ్రాయిల్ – పాలస్తీనాకి సంబంధించిన పాత వీడియోలు. ఐతే అవి ఇప్పుడు షేర్ చేయడం వల్ల ప్రజలు వీటిని ప్రస్తుతం ఇజ్రాయిల్ మరియు పాలస్తీనా మధ్య జరుగుతున్న ఘర్షణలకు సంబంధించినవని తప్పుగా అర్ధం చేసుకొనే అవకాశం ఉంది.

చివరగా, పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ సైన్యం దాడులంటూ పాత వీడియోలను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll