బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలను రోడ్డుపై కర్రలతో కొడుతున్న ఈ వీడియో పాతది

బీఆర్ఎస్ పార్టీ గూండాలు బీజేపీ కార్యకర్తలపై దాడి చేస్తున్న ఇటీవల దృశ్యాలుగా సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా షేర్ అవుతోంది. 30 నవంబర్ 2023 నాడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలపై దాడి చేస్తున్న ఇటీవల దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): వీడియోలోని ఘటన 2022 ఫిబ్రవరి నెలలో జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు జనగామలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసనలో భాగంగా నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను తగలపెడుతుండగా, అడ్డుపడిన బీజేపీ కార్యకర్తలను, బీఆర్ఎస్ కార్యకర్తలు ఇలా కొట్టారు. పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది మరియు 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.  

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లను రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియో ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ వార్తా సంస్థ 10 ఫిబ్రవరి 2022 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్‌లో దొరికింది. జనగామలో నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా టిఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) పార్టీ కార్యకర్తలు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నట్టు ఈ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.

2014లో యూపిఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సంబంధించి నరేంద్ర మోదీ 08 ఫిబ్రవరి 2022 నాడు పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు జనగామలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టినటు తెలిసింది. అయితే, నిరసనలో భాగంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, జనగామ క్రాస్ రోడ్డు దగ్గర నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను తగలపెడుతుండగా, కొందరు బీజేపీ కార్యకర్తలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినట్టు తెలిసింది. దీనితో, ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొని, బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదంపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ ఎంపీలు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెట్టారు.

చివరగా, బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలను రోడ్డుపై కర్రలతో కొడుతున్న ఈ వీడియో పాతది.