ఇటీవల భారత్-చైనా సరిహద్దుల్లో చైనా సైనికులు ‘జై శ్రీరామ్’ నినాదాలు చేశారంటూ పాత వీడియోను షేర్ చేస్తున్నారు

ఇటీవల భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు, వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి ప్రతిష్టంభనను ముగించేందుకు భారత్, చైనాలు అంగీకరించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి మే 2020 కన్నా ముందు ఉన్న పరిస్థితి తిరిగి రావడానికి వీలుగా పెట్రోలింగ్ ఏర్పాట్లపై భారత్ మరియు చైనాలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ 21 అక్టోబర్ 2024న ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు (ఇక్కడ, ఇక్కడ). పలు రిపోర్ట్స్ ప్రకారం, భారతదేశం మరియు చైనా 25 అక్టోబర్ 2024న తూర్పు లడఖ్ నుండి తమ బలగాలను ఉపసంహరించుకోవడం ప్రారంభించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ నేపథ్యంలో, “ఇటీవల భారత్ చైనా మధ్య కుదిరిన శాంతి ఒప్పందంలో భాగంగా, సరిహద్దుల్లో చైనా తన బలగాలు ఉపసంహరించుకుంటున్న సందర్భంలో భారత సైనికులు చైనా సైనికులుచే జై శ్రీరామ్ అని నినాదాలు చేయించారు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).  ఈ కథనం ద్వారా ఈ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇటీవల భారత్-చైనా సరిహద్దు నుంచి చైనా తన బలగాలు ఉపసంహరించుకుంటున్న సందర్భంలో భారత సైనికులు చైనా సైనికులుచే ‘జై శ్రీరామ్’ నినాదాలు చేయిస్తున్న దృశ్యాలు చూపిస్తున్న వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో ఇటీవలది కాదు, ఈ వీడియో జనవరి 2024 నుండి ఇంటర్నెట్‌లో ఉంది. ఇటీవల భారత్-చైనాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందంలో భాగంగా భారత్-చైనా సరిహద్దు ప్రాంతమైన తూర్పు లడఖ్ నుంచి భారత్, చైనా బలగాల ఉపసంహరణకు ఈ వైరల్ వీడియోకు ఎలాంటి సంబంధం లేదు. ఈ వీడియో జనవరి 2024లో అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా వైరల్‌ అయింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను పలువురు సోషల్ మీడియా యూజర్స్ జనవరి 2024లో షేర్ చేసినట్లు గుర్తించాము (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) (ఆర్కైవ్డ్ లింక్). అయితే ఈ పోస్టులు ఏవీ ఈ వీడియోకు సంబంధించిన ఎలాంటి సమాచారం తెలపలేదు.

ఈ వీడియోకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఇదే వీడియోను రిపోర్ట్ చేస్తూ జనవరి 2024లో పలు వార్త సంస్థలు కథనాలు ప్రచురించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). “అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఈ వీడియో వైరల్‌గా మారిందని. అయితే, ఈ వీడియోకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలియదని, ఈ వీడియోకు సంబంధించి చైనా సైన్యం లేదా భారత సైన్యం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని” ఈ కథనాలు పేర్కొన్నాయి. దీన్ని బట్టి ఇటీవల భారత్-చైనా మధ్య కుదిరిన శాంతి ఒప్పందంలో భాగంగా భారత్-చైనా సరిహద్దు ప్రాంతామైన తూర్పు లడఖ్ నుండి భారత్ మరియు చైనా బలగాల ఉపసంహరణకు ఈ వైరల్ వీడియోకు ఎలాంటి సంబంధం లేదని మనం నిర్ధారించవచ్చు.

ఈ వీడియో జనవరి 2024లో తీసింది కాదని, ఇది 2023 దీపావళి నాటిదని, అలాగే ఈ వీడియో లడఖ్‌లోని చెప్జీ-చుమర్ ప్రాంతంలో చిత్రీకరించబడింది అని పలు రిపోర్ట్స్(ఇక్కడ, ఇక్కడ) పేర్కొన్నాయి. అయితే,  మేము ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించబడిందో స్వతంత్రంగా నిర్ధారించలేనప్పటికీ, ఈ వైరల్ వీడియో ఇటీవలిది కాదని స్పష్టమైంది.

చివరగా, ఇటీవల భారత్-చైనా సరిహద్దు నుంచి చైనా బలగాలు ఉపసంహరించుకునే సమయంలో చైనా సైనికులు ‘జై శ్రీరామ్’ నినాదాలు చేశారంటూ పాత వీడియోను షేర్ చేస్తున్నారు.