2017లో ముంబైలో తీసిన ర్యాలీని ఇటీవల కర్ణాటకలో జరిగిన హిందువుల ర్యాలీ అని షేర్ చేస్తున్నారు

కర్ణాటకలో హిందువులు ర్యాలీ తీస్తున్న వీడియో అంటూ ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. కర్ణాటకలో హిజాబ్ ధరించిన విద్యార్థులకు వ్యతిరేకంగా కొంతమంది హిందూ విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి నిరసన వ్యక్తం చేసారు, దీని నేపథ్యంలో ఈ వీడియో వైరల్ అయ్యింది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కర్ణాటకలో కొనసాగుతున్న హిజాబ్ వివాదం నేపథ్యంలో హిందువులు ర్యాలీ తీస్తున్న వీడియో.

ఫాక్ట్: ఈ వీడియోకి కర్ణాటకతో సంబంధంలేదు. విద్య మరియు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కోరుతూ మరాఠాలు ముంబైలో ఆగష్టు 2017లో ‘మరాఠా క్రాంతి మోర్చా’ నిర్వహించినప్పుడు తీసింది ఈ వీడియో. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.   

వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే వీడియో కనీసం ఆగష్టు 2017 నుండి ఫేస్‌బుక్‌లో షేర్ అవుతున్నట్టు తెలిసింది. ఇదే వీడియో, “Maratha andolan–JJ Flyover 4.5-5 LAKHS OF PROTESTERS MARCH TO AZAD MAIDAN,AT MUMBAI.” అనే టైటిల్‌తో యూట్యూబ్‌లో అప్లోడ్ చేసారు.

విద్య మరియు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కోరుతూ మరాఠాలు ముంబైలో ఆగష్టు 2017లో ‘మరాఠా క్రాంతి మోర్చా‘ నిర్వహించారు. జెజె ఫ్లైఓవర్ (ముంబై)పై మరాఠాల నిరసన ర్యాలీకి సంబంధించిన మరిన్ని విజువల్స్ ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

చివరగా, రిజర్వేషన్లు కోరుతూ మరాఠాలు 2017లో ముంబైలో తీసిన ర్యాలీని పట్టుకొని కర్ణాటకలో హిందువుల ర్యాలీ అని షేర్ చేస్తున్నారు.