సంబంధం లేని పాత వీడియోలు షేర్ చేసి కంగనా రనౌత్ రక్షణ కోసం ర్యాలీగా బయలుదేరిన కర్ణి సేన అని చెప్తున్నారు

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రక్షణ కోసం కర్ణి సేన ఆయుధ ప్రదర్శన చేస్తూ ముంబైలో ర్యాలీగా వెళ్తున్న దృశ్యం అంటూ షేర్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరొక ఫేస్బుక్ పోస్టులో (ఆర్కైవ్డ్) టోల్ బూత్ దగ్గర ర్యాలి గా వెళ్తున్న వాహనాలని చూపిస్తూ కంగనా రనౌత్ రక్షణ కోసం బయలుదేరిన కర్ణి సేన అని షేర్ చేసారు. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కంగనా రనౌత్ కి రక్షణగా కర్ణి సేన ఆయుధ ప్రదర్శన చేస్తూ ముంబైలో చేసిన ర్యాలీ వీడియో.

ఫాక్ట్ (నిజం): పోస్టులోని వీడియో 2018లో రాజా హరి సింగ్  పుట్టినరోజు సందర్బంగా జమ్మూలో చేసిన ర్యాలీకి సంబంధించినది. ఫేస్బుక్ లో షేర్ చేసిన మరొక వీడియో కూడా 2018 నుంచి ఇంటర్నెట్ లో ఉంది. కావున, ఈ వీడియోలు కంగనా రనౌత్ రక్షణ కోసం బయలుదేరిన కర్ణి సేన ర్యాలీవి అంటూ క్లెయిమ్ చేస్తున్న ఈ పోస్ట్ తప్పు.

వీడియో-1:

పోస్టులో షేర్ చేసిన ఆ వీడియోని జాగ్రత్తగా గమనిస్తే, వీడియో మొదట్లో కనిపిస్తున్న బస్టాండ్ మీద ఒక రాజకీయ పార్టీ కి సంబంధించిన ఫ్లెక్స్ ఉన్నట్టు గుర్తించొచ్చు. ఆ ఫ్లెక్స్ పై సైకిల్ గుర్తుతో పాటు  “जामू काश्मीर नेशनल पैंथर्स पार्टी ” అని రాసి ఉంది. సైకిల్ గుర్తు కలిగిన ఈ పార్టీ జమ్మూ కాశ్మీర్ కి సంబంధించింది అని మా విశ్లేషణలో తెలిసింది. అలాగే, ఈ ర్యాలీలో ఒక బండి పై ‘YUVA RAJPUT SABHA’ అనే పోస్టర్ తగిలించి ఉండటం మనం గమనించవచ్చు.

ఈ వివరాల ఆధారంగా ఆ వీడియో కోసం యూట్యూబ్ లో ‘YUVA RAJPUT SABHA’ అనే పదాలతో వెతకగా, విశాల సింగ్ అనే యూసర్ ఇదే వీడియోని 2018 లో యూట్యూబ్ లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోని అతను ‘25 అక్టోబర్ 2018’ నాడు యూట్యూబ్ లో పోస్ట్ చేసారు. ఈ వీడియో ‘YUVA RAJPUT SABHA’ వారు రాజా హరి సింగ్  పుట్టినరోజు సందర్బంగా జమ్మూ నగరంలో చేసిన ర్యాలీకి సంబంధించినది అని అందులో తెలిపారు.

గూగుల్ లో రాజా హరి సింగ్ పుట్టినరోజు వేడుకలకి సంబంధించిన వివరాల కోసం వెతకగా, 2018లో రాజా హరి సింగ్ పుట్టినరోజు సందర్భంగా చేసిన ఈ ర్యాలీకి సంబంధించిన వివరాలు తెలుపుతూ రాసిన ఆర్టికల్స్ దొరికాయి. అవి ఇక్కడ, ఇక్కడ , ఇక్కడ చదవొచ్చు. ఈ ర్యాలీకి సంబంధించిన వివరాలు తెలుపుతూ ఒక న్యూస్ ఛానల్ పోస్ట్ చేసిన వీడియో కూడా దొరికింది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఆ వీడియో పాతది అని, ఈ వీడియోకి కంగనా రనౌత్ కి రక్షణగా ఉంటామన్న కర్ణి సేనకి ఎలాంటి సంబంధం లేదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

వీడియో-2:

ఫేస్బుక్ లో కంగనా రనౌత్ రక్షణగా వస్తున్న కర్ణి సేన అని షేర్ చేసిన మరొక వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అవే దృశ్యాలు కలిగిన వీడియో ఒక బ్లాగ్ లో దొరికింది. ఈ వీడియో గురించి వివరిస్తూ ‘Sher Singh Rana has come to Rajasthan with 1000+ trains! Sher Singh Rana Coming With 1000+ Cars’ అని రాసి ఉంది. ఇదే వీడియోని ఒక యూసర్ ‘08 April 2018’ నాడు యూట్యూబ్ లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. ‘Raja Bhaiya convoy with Rajasthani army (Rajasthan) – Desiyoungstar’ అని ఆ వీడియో వివరణలో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా ఈ వీడియో మూడేళ్ళ క్రితం నుంచే ఇంటర్నెట్ లో ఉన్నట్టు ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ వీడియోకి ఇప్పటి సంఘటనలకు ఎటువంటి సంబంధం లేదు.

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కి మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ఘర్షణలో తమ మద్దతు కంగనా రనౌత్ కి ఉంటుంది అని కర్ణి సేన వారు ’07 సెప్టెంబర్ 2020’ నాడు ప్రకటించారు. ముంబై నగరాన్ని ‘పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్’ తో పోలుస్తూ కంగనా పెట్టిన ట్వీట్ తో ఈ వివాదం మొదలైంది.

చివరగా, సంబంధం లేని వీడియోలు చూపిస్తూ కంగనా రనౌత్ రక్షణ కోసం ర్యాలీగా బయలుదేరిన కర్ణి సేన అని షేర్ చేస్తున్నారు.