ఒక జంటను యూపీ పోలీసులు విచారిస్తున్న పాత ఫోటోని పెట్టి, ‘లవ్ జీహాద్’ కథ చెప్తూ తప్పుగా షేర్ చేస్తున్నారు

యోగీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాంటీ-రోమియో స్క్వాడ్ తాజగా నోయిడాలో ఒక జంటని విచారించినప్పుడు, అబ్బాయి తన పేరు లలిత్ అని, అమ్మాయి తన పేరు వందన అని చెప్పారని, కానీ పోలీసులు ఐడీ కార్డు చూపించమన్నప్పుడు అబ్బాయి పేరు రెహాన్ అని తెలిసిందని చెప్తూ, ఒక ఫోటోతో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. అమ్మాయి అప్పటివరకు అబ్బాయి ఒక హిందువు అని అనుకుందని, ఇలాంటి లవ్ జీహాద్ మోసాలు ఇకపై జరగకుండా ఉండటానికి ఈ విషయాలను షేర్ చేయండని పోస్ట్ లో చెప్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తాజాగా నోయిడా లో హిందూ లాగా నటించి ఒక అమ్మాయిని మోసం చేసిన రెహాన్. ఆ లవ్ జిహాద్ ఘటన కి సంబంధించిన ఫోటో.

ఫాక్ట్: పోస్ట్ లోని ఫోటో 2017 లో యోగీ ప్రభుత్వం మొదలుపెట్టిన యాంటీ-రోమియో స్క్వాడ్ లక్నోలో కొంత మందిని విచారిస్తుండగా తీసినది; ఫోటోని తీసింది తాజగా నోయిడా లో కాదు. పోస్ట్ లో చెప్పిన కథ, ఫోటోకి సంబంధించింది అని చెప్పటానికి ఎక్కడా ఎటువంటి ఆధారాలు లేవు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివెర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఆ ఫోటోతో ఉన్న చాలా న్యూస్ ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. 2017 లో యోగీ ప్రభుత్వం మొదలుపెట్టిన యాంటీ-రోమియో స్క్వాడ్ లక్నోలో కొంత మందిని విచారిస్తుండగా ఆ ఫోటో తీసినట్టు తెలిసింది. ఆ ఫోటోని 2017 లోనే ప్రచురించిన కొన్ని న్యూస్ వెబ్ సైట్లను ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవొచ్చు. ఫోటో తాజా ఘటన కి సంబంధించింది కాదు మరియు ఫోటో లక్నోలో తీసింది, నోయిడా లో కాదు.

అంతేకాదు, పోస్ట్ లో చెప్పిన కథ, పై ఫోటోకి సంబంధించింది అని చెప్పటానికి ఎక్కడా ఎటువంటి ఆధారాలు లేవు. ఫోటోలో కనిపిస్తున్న పోలీస్ అధికారితో ‘ఆల్ట్ న్యూస్’ వారు మాట్లాడగా, ఫోటోలోని ఘటన చాలా ఏళ్ళ క్రితం జరిగినందున తనకు దాని గురించి గుర్తులేదని, తనకు గుర్తున్నంత వరకు లవ్ జీహాద్ కి, ఆ ఘటనకి సంబంధంలేదని తను తెలిపినట్టు తెలిసింది.

అయితే, తాజాగా నోయిడా లో ఒక ముస్లిం వ్యక్తి తను హిందూ అని చెప్పి ఒక మహిళను మోసం చేసినట్టు ‘టైమ్స్ నౌ’ ఆర్టికల్ లో చదవొచ్చు. కానీ, పోస్ట్ లో చెప్పిన పోలీస్ విచారణ కథకి, ఈ ఘటనకి సంబంధంలేదు.  

చివరగా, ఒక జంటను యూపీ పోలీసులు విచారిస్తున్న పాత ఫోటోని పెట్టి, ‘లవ్ జీహాద్’ కథ చెప్తూ తప్పుగా షేర్ చేస్తున్నారు.