120 ఐఏఎస్ ఆఫీసర్లు ఎలక్షన్ కమిషన్‌లో జరిగిన మోసాన్ని సుప్రీంకోర్టులో బయటపెట్టనున్నారంటూ నిరాధారమైన పాత వార్తను మళ్ళీ షేర్ చేస్తున్నారు

‘రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ మరియు 120 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఎలక్షన్ కమిషన్‌లో జరిగిన మోసాన్ని  సుప్రీంకోర్టులో బయటపెట్టనున్నారని’ చెప్తున్న  పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. బీజేపీ మరియు వైసీపీ ఎన్నికల్లో టాంపరింగ్ చేసినట్టు కూడా పోస్టులో ఆరోపిస్తున్నారు. ఈ కథనం ద్వారా పోస్టులో చెప్పిన వార్తలో  నిజముందో చూద్దాం.

YouTube Poster
ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ మరియు 120 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఎలక్షన్ కమిషన్‌లో జరిగిన మోసాన్ని  సుప్రీంకోర్టులో బయటపెట్టనున్నారు’.

ఫాక్ట్ (నిజం): ఇదే వార్త 2019 జనరల్ ఎన్నికల ఫలితాల వచ్చినప్పటి నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతూనే ఉంది. ఐతే 2019లో గానీ లేక ఆ తర్వాత గానీ ఇలా భారీ సంఖ్యలో ఐఏఎస్ ఆఫీసర్లు ఈవీఎం టాంపరింగ్ జరిగిందంటూ సుప్రీంకోర్టును సంప్రదించినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. పలు జాతీయ నేతలు మరియు ఐఏఎస్ ఆఫీసర్లు టాంపరింగ్ ఆరోపణలు చేసారే తప్ప ఆరోపణలు రుజువైనట్టు గానీ, కోర్టులో కేసు వేసినట్టు గానీ ఎటువంటి ఆధారాలు లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఇలా 120 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఎలక్షన్ కమిషన్‌లో జరిగిన మోసాన్ని  సుప్రీంకోర్టులో బయటపెట్టనున్నారంటూ 2019 నుండే సోషల్ మీడియాలో పోస్టులు (ఇక్కడ మరియు ఇక్కడ) షేర్ చేసారు. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నుండి ఈ వార్త ప్రచారంలోకి వచ్చింది.

ఐతే 2019లో గాని లేక ఆ తర్వాత గాని ఇలా భారీ సంఖ్యలో ఐఏఎస్ ఆఫీసర్లు ఈవీఎం టాంపరింగ్ జరిగిందంటూ సుప్రీంకోర్టును అశ్రయించినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. ఒకవేళ ఇలా నిజంగా జరిగుంటే మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేది, కాని అటువంటి కథనాలేవి మాకు కనిపించలేదు. అలాగే బీజేపీ లేదా వైసీపీ ఎన్నికల్లో టాంపరింగ్ చేసినట్టు ఆరోపణలే తప్ప రుజువైనట్టు ఎటువంటి ఆధారాలు లేవు.

2019 ఎన్నికల ముందు మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు మొదలైన నాయకులు ఈవీఎం టాంపరింగ్ చేయవచ్చని, ఎన్నికలు బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని డిమాండ్ చేసారు. అలాగే ఎన్నికల ఫలితాల అనంతరం ఒకరిద్దరు ఐఏఎస్ అధికారులు ఈవీఎం టాంపరింగ్ జరిగిందని ఆరోపించారు, ఐతే ఈ ఆరోపణలు రుజువు కాలేదు. అంతేగాని పోస్టులో చెప్తునట్టు అందరు కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు ఎటువంటి కథనాలు లేవు.

చివరగా, 120 ఐఏఎస్ ఆఫీసర్లు ఎలక్షన్ కమిషన్‌లో జరిగిన మోసాన్ని  సుప్రీంకోర్టులో బయటపెట్టనున్నారంటూ నిరాధారమైన పాత వార్తను మళ్ళీ షేర్ చేస్తున్నారు.