2017 మొబైల్ టవర్ ప్రమాదం వీడియోని ఇపుడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలతో ముడిపెడుతున్నారు

భారతీయ రైతు ఉద్యమంలో జియో టవర్ స్వాహా, అంటూ షేర్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భారత ప్రభుత్వం కొత్తగా అమలులోకి తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలని వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న నిరసనలో, రిలయన్స్ సంస్థకు సంబంధించిన అన్ని ఉత్పత్తులని ముఖ్యంగా జియో ని బ్యాన్ చేయాలనీ రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఆ పోస్టులో ఎంత వరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: జియో మొబైల్ టవర్ ని రైతులు ద్వంసం చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): వీడియోలో కనిపిస్తున్న ఈ ఘటన 2017లో చోటుచేసుకుంది. డెహ్రాడున్ లోని ఒక ఇంటి పై అమర్చిన మొబైల్ టవర్ నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చినట్టు కొన్ని మీడియా సంస్థలు ఇవే దృశ్యాలను చూపుతూ రిపోర్ట్ చేసాయి. మొబైల్ టవర్ లో షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్లనే ఈ మంటలు చెలరేగినట్టు ఈ రిపోర్ట్స్ లో తెలిపారు. ఈ వీడియోకి ఇటివల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలకి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, అవే దృశ్యాలని చూపుతూ ‘News 18 Hindi’ న్యూస్ వెబ్ సైట్ ‘29 జూన్ 2020’ నాడు రిపోర్ట్ చేసిన వీడియో దొరికింది. ఈ ఘటన 2017లో డెహ్రాడున్ నగరంలో చోటుచేసుకున్నట్టు ఈ వీడియోలో తెలిపారు. డెహ్రాడున్ నగరంలోని అంకిత్ పురం దగ్గర ఉన్న ఒక ఇంటిపై అమర్చిన మొబైల్ టవర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు ఈ వీడియోలో తెలిపారు. మొబైల్ టవర్ లో షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్లనే ఈ మంటలు చెలరేగినట్టు ఈ వీడియో రిపోర్ట్ లో తెలిపారు. ఫైర్ ఇంజిన్ సిబ్బంది కొంతమంది లోకల్ ప్రజల సహాయంతో ఈ మంటలను ఆపినట్టు తెలిసింది.

ఇవే దృశ్యాలని చూపుతూ ‘Amar Ujala’ న్యూస్ వెబ్ సైట్ ‘28 జూన్ 2017’ నాడు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో డెహ్రాడున్ లోని ఒక మొబైల్ టవర్ నుంచి మంటలు చెలరేగినట్టు ఈ ఆర్టికల్ లో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

కొత్తగా అమలులోకి తీసుకొచ్చిన  వ్యవసాయ చట్టాలకు సంబంధించి రైతులకి, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ఘర్షణలో, కొంతమంది రైతు సంఘాల కార్యకర్తలు జియో మొబైల్ టవర్లకి విద్యుత్ నిలిపేసిన ఘటనలు ఇటివల చోటుచేసుకున్నాయి. ఆ ఘటనలకి సంబంధించి పబ్లిష్ చేసిన న్యూస్ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

చివరగా, 2017లో జరిగిన మొబైల్ టవర్ ఆక్సిడెంట్ యొక్క వీడియోని ఇటివల రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలకి ముడిపెడుతున్నారు.