‘ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్’ వీడియోని అమరుడైన కల్నల్ సంతోష్ బాబు చివరి మాటలు అని ప్రచారం చేస్తున్నారు

‘ABN’ లోగో తో ఉన్నఒక వీడియోని ‘కల్నల్ సంతోష్ బాబు చైనా వాళ్ళతో చివరగా మాట్లాడిన మాటలు’ అని సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కల్నల్ సంతోష్ బాబు చైనా వాళ్ళతో చివరగా మాట్లాడిన మాటల వీడియో. 

ఫాక్ట్ (నిజం): ): ఈ వీడియో జనవరి 2020 నుండి యూట్యూబ్ లో ఉంది. అంతే కాదు, చైనా ఆర్మీ తో మాట్లాడుతున్న వ్యక్తి భుజాల మీద I.T.B.P అని స్పష్టంగా రాసి ఉండడం మనం చూడొచ్చు. I.T.B.P (ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్) కేంద్ర హోమ్ శాఖ ఆధ్వర్యంలో నడిచే ‘సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్’ కిందకి వస్తుంది, భారత ఆర్మీ కిందకు కాదు. మొన్న అమరుడైన కల్నల్ సంతోష్ బాబు ఇండియన్ ఆర్మీ ’16 బీహార్ రెజిమెంట్’ లో చేసేవాడు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వీడియోని గమనిస్తే, అందులో ‘ABN’ లోగో చూడవొచ్చు. ‘ABN’ ఛానల్ ఈ వీడియో ప్రచారం చేసిందా అని వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లో వెతికితే 18 జూన్ 2020న ‘చైనా సైనికులతో సంతోష్ బాబు సంభాషణ’ అనే శీర్షిక తో ఒక వీడియో (ఆర్కైవ్) ప్రచురించినట్టు తెలిసింది.

వీడియో ఎప్పటిదా అని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూస్తే, ఇదే వీడియో 13 జనవరి 2020న యూట్యూబ్ లో ‘అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ దగ్గర చైనీస్ ఆర్మీ తో ‘ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్’ వాదన’ అనే శీర్షిక తో ఒక వీడియో లభించింది. కావున ఇవి కచ్చితంగా కల్నల్ సంతోష్ బాబు చైనా వాళ్ళతో చివరగా మాట్లాడిన మాటల వీడియో కాదు. ఈ వీడియోని క్షుణ్ణంగా గమనిస్తే మన జవాను డ్రెస్ భుజాల దగ్గర ‘I.T.B.P’ అని స్పష్టంగా రాసి ఉండడం మనం చూడొచ్చు. I.T.B.P అంటే ‘ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్’. ఇది కేంద్ర హోమ్ శాఖ ఆధ్వర్యంలో నడిచే ‘సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్’ కిందకి వస్తుంది, భారత ఆర్మీ కిందకు కాదు. I.T.B.P లడఖ్ లోని కారకోరం పాస్ నుండి అరుణాచల్ ప్రదేశ్ లోని జచెప్ లా వరకు 3488 కిలోమీటర్ల ఇండో-చైనా సరిహద్దును కాపాడుతుంది. మొన్న అమరుడైన కల్నల్ సంతోష్ బాబు  ఇండియన్ ఆర్మీ  ’16 బీహార్ రెజిమెంట్’ లో చేసేవాడు. అందుకే అసలు ఈ వీడియో లో కనిపిస్తున్న వ్యక్తి కల్నల్ సంతోష్ బాబు కాదు, అది ఇప్పుడు జరిగిన సంఘటన కూడా కాదు 

‘ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్’ అధికారి చైనా ఆర్మీ తో సంభాషిస్తున్న పాత వీడియోని ‘కల్నల్ సంతోష్ బాబు చైనా వాళ్ళతో చివరగా మాట్లాడిన మాటల వీడియో’ అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

Update: ‘ABN’ ప్రచురించిన వీడియోలో 1:59 నిడివి నుండి ఇంకో సంఘటనకు సంబంధించి వీడియో జోడించారు. రివర్స్ సెర్చ్ చేస్తే ఈ వీడియో 07 జులై 2017న, ‘డెక్కన్ హెరాల్డ్’ సంస్థ తమ యూట్యూబ్ ఛానల్ లో పెట్టినట్టు తెలుస్తుంది. వీడియో శీర్షికలో చైనీస్ సైనికులని మన భూభాగంలోకి రాకుండా జవాన్లు అడ్డుకుంటున్న వీడియో మొదటి భాగం అని తెలిపారు. రెండో భాగం వీడియో ఇక్కడ చూడవొచ్చు. వీడియో వివరణలో ఇది ఎప్పటిదో కచ్చితంగా చెప్పలేమని, కానీ జూన్ 2017 రెండో వారంలో జరిగిన సంఘటన అయ్యుండొచ్చని తెలిపారు. కావున ఈ వీడియోకి కల్నల్ సంతోష్ బాబు మరణించినప్పుడు జరిగిన సంఘటనలకు సంబంధం లేదు.

‘ABN’ ప్రచురించిన వీడియోలోని రెండు భాగాలు పోయిన మూడు వారాలలో రెండు వేరు వేరు సందర్భాలలో తప్పుడు వివరణలతో వైరల్ అయినప్పుడు ‘FACTLY’ రాసిన ఆర్టికల్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?