2015లో జస్టిన్ ట్రూడో సిక్కు సొసైటీని సందర్శించినప్పటి ఫోటోని ఇప్పుడు రైతులు చేస్తున్న నిరసనలకు ముడిపెడుతున్నారు

కెనడాలో కూర్చున్న భారతీయ రైతుల బాధను కెనడా ప్రధానమంత్రి చూడగలిగాడు కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత దేశంలో ఉంటూ భారత రైతుల బాధ పట్టించుకోవడం లేదని షేర్ చేస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. కెనడా దేశంలో భారతదేశ రైతులకి మద్దతు తెలుపుతూ చేసిన నిరసన కార్యక్రమంలో కెనడా ప్రధానమంత్రి  జస్టిన్ ట్రూడో పాల్గొన్నట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. భారతదేశంలో అమలులోకి తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న నిరసనలకి కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో మద్దతు తెలిపిన నేపథ్యంలో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కెనడాలో భారతదేశ రైతులకి మద్దతు తెలుపుతూ నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో పాల్గొన్నారు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో పాతది. 2015లో కెనడాలోని ‘Gurdwara Sahib Ottawa Sikh Society’ ని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో సందర్శించినప్పుడు తీసిన ఫోటో ఇది. ఈ ఫోటోకి ఇటివల భారతదేశంలోని రైతులు చేస్తున్న నిరసనలకి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ 2015లో పబ్లిష్ చేసిన న్యూస్ ఆర్టికల్స్ దొరికాయి. ఈ ఫోటో 2015లో కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ‘Gurdwara Sahib Ottawa Sikh Society’ ని సందర్శించినప్పుడు తీసిన ఫోటో అని ఒక ఆర్టికల్ వివరణలో తెలిపారు. ఇదే విషయాన్నీ తెలుపుతూ పబ్లిష్ చేసిన మరొక న్యూస్ ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు. ఇదే ఫోటోని ‘Reuters pictures’ లో కూడా చూడవచ్చు.

ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో గురించిన మరింత సమాచారం కోసం వెతికితే, ఇదే ఫోటో ‘Stock’ ఫోటోగ్రఫీ వెబ్సైటులో దొరికింది. ‘11 నవంబర్ 2015’ నాడు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ‘Gurdwara Sahib Ottawa Sikh Society’ ని సందర్శించినప్పుడు తీసిన ఫోటో అని అందులో తెలిపారు. ఇదే విషయాన్నీ తెలుపుతూ పబ్లిష్ చేసిన మరొక న్యూస్ ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో ఇటివల రైతులు వ్యవసాయ బిల్లులకి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలకి సంబంధించిది కాదు అని అర్థం అవుతుంది.

చివరగా, 2015లో జస్టిన్ ట్రూడో కెనడా లోని ఒక సిక్కు సొసైటీ ని సందర్శించినప్పుడు తీసిన ఫోటోని ఇటివల భారత దేశంలో రైతులు చేస్తున్న నిరసనలతో ముడిపెడుతున్నారు.