వక్ఫ్ సవరణ చట్టం, 2025ని వ్యతిరేకిస్తూ, ఏప్రిల్ 2025లో పశ్చిమ బెంగాల్‌లో చాలా చోట్ల నిరసనలు జరిగాయి. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఈ ఆందోళనులు హింసాత్మకంగా మారి, గొడవలు, అల్లర్లు కూడా జరిగాయని వార్తా కథనాలు పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ కథనాల ప్రకారం (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ), ముర్షిదాబాద్‌లో జరిగిన గొడవల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు, ఇందులో చందన్ దాస్, హరగోబింద్ దాస్ అనే ఇద్దరు హిందువులు ఒక మూక దాడిలో మరణించగా, ఒక ముస్లిం వ్యక్తి పోలీసు కాల్పుల్లో చనిపోయాడు. ముర్షిదాబాద్ జిల్లాలో జరుగుతున్న ఈ హింసను తప్పించుకోవడానికి వందలాది హిందువులు తమ ఇళ్లను వదిలి, ఆశ్రయం పొందడానికి మాల్డా నగరానికి చేరుకున్నారని కూడా మీడియా రిపోర్ట్ చేసింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ముర్షిదాబాద్‌లో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర బలగాలని మోహరించాలని కలకత్తా హైకోర్టు 12 ఏప్రిల్ 2025న ఆదేశించింది (ఇక్కడ, ఇక్కడ). ఈ అల్లర్లకు సంబంధించి 150 మందికి పైగా వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు రిపోర్ట్స్ పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ).
ఈ నేపథ్యంలో, బెంగాల్లో హిందువులపై దాడి చేసిన ముస్లింలను భారత సైనికులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారంటూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఈ వీడియోలో సైనికులు కొందరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం చూడవచ్చు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: ఏప్రిల్ 2025 పశ్చిమ బెంగాల్ అల్లర్ల సమయంలో హిందువులపై దాడి చేసిన ముస్లింలను భారత ఆర్మీ అరెస్టు చేసినప్పటి దృశ్యాలు.
ఫాక్ట్: ఈ వీడియో బంగ్లాదేశ్ దేశానికి చెందినది. 28 అక్టోబర్ 2024న మారణాయుధాలు కలిగి ఉన్నారనే కారణంతో బంగ్లాదేశ్ ఆర్మీ స్థానిక పోలీసులతో కలిసి ఢాకా జిల్లాలోని మొహమ్మదపూర్ ప్రాంతంలో ఏడుగురిని అరెస్టు చేసిన ఘటనను ఈ వీడియో చూపిస్తుంది, ఇది 2025 పశ్చిమ బెంగాల్ అల్లర్లకు సంబంధించినది కాదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా, వైరల్ వీడియోలో కనిపించే ‘బంగ్లా విజన్’ అనే లోగో గురించి వెతకగా ఇదొక బంగ్లాదేశ్ టీవీ ఛానెల్ అని తెలిసింది. ఇక, వైరల్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, బంగ్లా విజన్ యొక్క యూట్యూబ్ ఛానెల్లో ఇదే వీడియోని (ఆర్కైవ్) 29 అక్టోబర్ 2024లో అప్లోడ్ చేసినట్లు గుర్తించాం. బంగ్లాదేశ్ ఢాకా జిల్లాలోని మొహమ్మదపూర్ ప్రాంతంలో బంగ్లా ఆర్మీ చేసిన ఆర్మీ ఆపరేషన్‌ను చూపుతుందని వీడియో టైటిల్లో పేర్కొన్నారు. ఇదే ఘటనకు సంబంధించి బంగ్లాదేశ్ మీడియా సంస్థలు ప్రసారం చేసిన మరిన్ని వీడియోలను ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.
బంగ్లాదేశ్ వార్తా కథనాల (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ప్రకారం, 28 అక్టోబర్ 2024న ఢాకా జిల్లాలోని మొహమ్మదపూర్ ప్రాంతంలో కొందరి వ్యక్తుల వద్ద మారణాయుధాలు ఉన్నాయనే సమాచారంతో బంగ్లాదేశ్ ఆర్మీకి చెందిన 23వ ఈస్ట్ బెంగాల్ రెజిమెంట్, 46వ ఇండిపెండెంట్ బ్రిగేడ్ సైనికులతో కలిసి స్థానిక షేర్- ఈ- బంగ్లా, మొహమ్మదపూర్, అదబార్ పోలీసులు దాడి చేసి ఏడుగురిని అరెస్టు చేసి వారి నుంచి తుపాకులను, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
అదనంగా, వైరల్ వీడియోలోని సైనికుల యూనిఫాంపై ఉన్న చిహ్నాన్ని పరిశీలించగా, ఇది బంగ్లాదేశ్ ఆర్మీకి చెందిన 46వ ఇండిపెండెంట్ బ్రిగేడ్ సైన్యానికి చెందినదని తెలుస్తుంది. పై ఆధారాలను బట్టి వైరల్ వీడియో పశ్చిమ బెంగాల్ అల్లర్లకు సంబంధించినది కాదని నిర్ధారించవచ్చు.
చివరిగా, పశ్చిమ బెంగాల్ ఆలర్లకు కారణమమైన ముస్లింలను అరెస్టు చేశారంటూ బంగ్లాదేశ్ వీడియోని షేర్ చేస్తున్నారు.