30 జూలై 2025న రష్యాలోని తూర్పు కమ్చట్కా ద్వీపకల్పంలో సుమారు 8.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. కమ్చట్కా ద్వీపకల్పంలో 3-5 మీటర్ల సునామీ నమోదైందని రాయిటర్స్ పేర్కొంది. దీనితో జపాన్, అమెరికా సహా వివిధ దేశాలలో సునామీ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. జపాన్, హవాయి, అమెరికా పశ్చిమ తీరప్రాంతంలో జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రష్యా, జపాన్ దేశాలలో ఈ భూకంపం, సునామీ సృష్టించిన విధ్వంసాన్ని చూపుతుందని చెప్తూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉన్నాయి. వీటిలో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: 30 జూలై 2025 రష్యా భూకంపం కారణంగా రష్యా, జపాన్ దేశాలలో జరిగిన విధ్వంసాన్ని చూపుతున్న వీడియోలు.
ఫాక్ట్: ఈ వీడియోలలో ఎక్కువ భాగం 30 జూలై 2025లో రష్యాలో వచ్చిన భూకంపానికి సంబంధించినవి కావు. కావున పోస్టులలో చేయబడ్డ క్లెయిమ్స్ తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి.
Update (31 July 2025):
వీడియో 5:
రష్యా తీర ప్రాంతాన్ని సునామీ అతలాకుతలం చేస్తుందని కొన్ని వీడియో క్లిప్పులు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ప్రచారంలో ఉన్నాయి.
సముద్రంలో అలలు ఎత్తుగా ఎగసిపడుతున్నట్లు చూపుతున్న మొదటి రెండు క్లిప్పులు కనీసం 2023 నుంచి ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి. నవంబర్ 2023లో జార్జియా ప్రాంతంలో తుఫాను వచ్చినప్పుడు ఈ దృశ్యాలు చిత్రీకరించినట్లుగా స్థానిక మీడియా పేర్కొంది. దీనికి సంబంధించి మేము ఇదివరకే రాసిన ఫాక్ట్-చెక్ కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.
అలాగే, భూకంపం తీవ్రతకు ఇంట్లోని సామన్లను కంపించడాన్ని చూపుతున్న మరో వీడియో క్లిప్పు ఏప్రిల్ 2024లో చైనాలో భూంకంపం వచ్చినప్పటి దృశ్యాలను (ఇక్కడ & ఇక్కడ) చూపుతుంది.
Published (30 July 2025):
వీడియో 1:
రష్యాలో భూకంపం కారణంగా ఒక షాపులో పని చేస్తున్న మహిళపై పడినట్లుగా ఉన్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ఒకటి ప్రచారంలో ఉంది.
వైరల్ వీడియోలోని దృశ్యాలు రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోని మార్చి 2025లో పలు మీడియా సంస్థలు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) రిపోర్ట్ చేశాయి. 28 మార్చి 2025లో మయన్మార్ దేశంలోని మాండలే నగరంలో భూకంపం వచ్చిన సమయంలో ఒక షాపులో రికార్డు ఈ వీడియో రికార్డు చేయబడిందని ఈ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
వీడియో 2:
రష్యాలో సునామీ దాటికి సముద్రపు ఒడ్డున ఉన్న పడవలు కొట్టుకుపోతున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ఒకటి ప్రచారంలో ఉంది.
ఈ వీడియో 2017లో గ్రీన్‌ల్యాండ్ ప్రాంతంలో వచ్చిన సునామీని చూపుతుంది. దీనికి సంబంధించిన మీడియా కథనాలను ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.
వీడియో 3:
రష్యాలో సునామీ దృశ్యాలంటూ ఒక వీడియా (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.
ఈ వీడియో 2017లో దక్షిణ ఆఫ్రికాలోని డర్బన్ బీచ్ దగ్గర రికార్డ్ చేయబడింది. మార్చి 2017లో డర్బన్ బీచ్‌లో ఒకేసారి పెద్ద అలలు రావడంతో పర్యాటకులు పారిపోవడాన్ని ఈ వీడియో చూపుతుంది. ఈ వీడియోకి సంబంధించి మేము ఇదివరకే రాసిన ఫాక్ట్- చెక్ ఆర్థికల్‌ని ఇక్కడ చూడవచ్చు.
వీడియో 4:
రష్యాలో సునామీ ధాటికి తెల్ల(బెలూగా) తిమింగలాలు ఒడ్డుకి కొట్టుకొచ్చాయని చెప్తూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) వైరల్ అవుతోంది.
ఈ వీడియో ఆగస్ట్ 2023లో రష్యాలోని కమ్చట్కా ప్రాంతంలో జరిగినట్లు వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) లభించాయి. సముద్రపు ఒడ్డుకి కొట్టుకు వచ్చిన ఐదు తెల్ల(బెలూగా) తిమింగలాలను స్థానికులు రక్షించి తిరిగి సముద్రంలోకి వదిలారని అందులో పేర్కొన్నారు.
చివరిగా, పాత, సంబంధంలేని వీడియోలను జూలై 2025 రష్యా భూకంపానికి ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.