2004 అమెరికా-ఇరాక్ యుద్ధం వీడియోను ఇజ్రాయెల్ సైన్యం అల్-అక్సా మసీదును ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు షేర్ చేస్తున్నారు

ఇజ్రాయెల్ సైన్యం అల్-అక్సా మసీదుని తమ ఆధీనంలోకి తీసుకుంటున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. అంతేకాదు, పాలస్తీనా తో యుద్ధం ముగిసే సరకి తమ సైన్యం ఎంతవరకు వెళ్ళగలిగితే అక్కడివరకు కొత్త సరిహద్దు ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతనేహ్యు ప్రకటించినట్టు ఈ పోస్టులో చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇజ్రాయెల్ సైన్యం జెరూసలేం నగరంలోని అల్-అక్సా మసీదుని ఆధీనంలోకి తీసుకుంటున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో, అమెరికా సైన్యం 2004లో ఇరాక్ దేశంలోని అల్-అసకరి మసీదు పై జరిపిన రెయిడ్ దృశ్యాలని చూపిస్తుంది. 2004 ఇరాక్ యుద్ధంలో భాగంగా అమెరికా సైనికులు సమర్రా నగరంలోని గోల్డెన్ మసీదు (అల్-అసకరి మసీదుని గోల్డెన్ మసీదు అని కూడా పిలుస్తారు) పై రెయిడ్ నిర్వహించారు. ఈ వీడియోకి అల్-అక్సా మసీదు పై ఇజ్రాయిల్ సైన్యం ఇటీవల జరిపిన దాడులకి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ఒక యూట్యూబ్ యూసర్ 2014లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. అమెరికా స్పెషల్ ఫోర్స్ దళాలు గోల్డెన్ మసీదు పై రెయిడ్ చేస్తున్న దృశ్యాలని ఈ వీడియో వివరణలో తెలిపారు. ఇదే వీడియోని మరొక యూసర్ యూట్యూబ్ లో షేర్ చేస్తూ, ఇరాక్ దేశంలోని అల్-అసకరి మసీదు (అల్-అసకరి మసీదుని గోల్డెన్ మసీదు అని కూడా పిలుస్తారు) పై అమెరికా దళాలు రెయిడ్ నిర్వహిస్తున్న దృశ్యాలని తెలిపారు.

ఈ వివరాల ఆధారంగా ఆ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాల కోసం వెతకగా, యుద్ధ సమయాలలో చిత్రీకరించిన వీడియోలని మరియు మిలిటరీ సమాచారాన్ని రిపోర్ట్ చేసే ‘funker530’ వెబ్సైటు, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని  తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోని “Historical US Special Forces Raid On Golden Mosque” అనే టైటిల్ తో ఆ యూట్యూబ్ ఛానల్ పబ్లిష్ చేసింది. 2004 ఇరాక్ యుద్ధంలో భాగంగా 36వ ఇరాకి కమెండో బెటాలియాన్ కి చెందిన అమెరికా సైనికులు సమర్రా నగరంలోని గోల్డెన్ మసీదు పై రెయిడ్ నిర్వహిస్తున్న దృశ్యాలని ఈ వీడియో వివరణలో తెలిపారు. ఈ వీడియోని ఇదే వివరణతో military-footage.com అనే వెబ్సైటు కూడా పబ్లిష్ చేసింది.

అమెరికా సైనికులు 2004 సంవత్సరంలో సమర్రా నగరంలోని గోల్డెన్ మసీదు పై జరిపిన రెయిడ్ గురించి The Guardian న్యూస్ సంస్థ రిపోర్ట్ చేసింది. ఆ న్యూస్ రిపోర్ట్ ని ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో జెరూసలేం నగరంలోని  అల్-అక్సా మసీదుకి సంబంధించింది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

పాలస్తీనా తో యుద్ధం ముగిసే సరకి ఇజ్రాయెల్ సైన్యం ఎంతవరకు వెళ్ళితే అక్కడివరకు కొత్త సరిహద్దు ఉంటుందని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నేతనేహ్యు ప్రకటించారా అని అతని అధికారిక ట్విట్టర్ అకౌంట్లో వెతికితే, ఈ విషయాన్నీ ప్రకటిస్తూ బెంజమిన్ నేతనేహ్యు ఎటువంటి ట్వీట్ చేయలేదని తెలిసింది.

07 మే 2021 నాడు జెరూసలేం నగరంలోని అల్-అక్సా మసీదు ప్రాంగణంలో ఇజ్రాయెల్ పోలీసులు, పాలస్తీనా నిరసనకారుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో 300లకు పైగా పాలస్తినియన్లు గాయపడినట్టు న్యూస్ ఆర్టికల్స్ రిపోర్ట్ చేసాయి. కాని, పోస్టులో షేర్ చేసిన వీడియోకి, అల్-అక్సా మసీదు ప్రాంగణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణకి ఎటువంటి సంబంధం లేదు.

చివరగా, 2004 అమెరికా-ఇరాక్ యుద్ధానికి సంబంధించిన వీడియోని ఇజ్రాయిల్ సైన్యం అల్-అక్సా మసీదుని ఆధీనంలోకి తీసుకుంటున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.