Fake News, Telugu
 

కేవలం ఐదు దేశాలు మాత్రమే కాదు, ప్రపంచంలో చాలా దేశాలు కోవిడ్-19 వ్యాక్సిన్లను తయారు చేస్తున్నాయి

0

ప్రపంచంలోని 190కి పైగా దేశాల్లో కేవలం 5 దేశాలు మాత్రమే కోవిడ్-19 వ్యాక్సిన్లను తయారు చేస్తున్నాయని చెప్తూ, ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. అన్ని వ్యాక్సిన్ల కంటే భారతదేశానికి రీసెర్చ్ చేసి తయారు చేసిన భారత్ బయోటెక్ వారి ‘కోవాక్సిన్’ అత్యంత ప్రభావంతమైనదని పోస్ట్ లో రాసి ఉంది. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ప్రపంచంలో కేవలం 5 దేశాలు మాత్రమే కోవిడ్-19 వ్యాక్సిన్లను తయారు చేస్తున్నాయి. అన్ని వ్యాక్సిన్ల కంటే భారతదేశ వ్యాక్సిన్ అత్యంత ప్రభావంతమైనది.

ఫాక్ట్: కోవిడ్-19 వ్యాక్సిన్లు తయారు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. కానీ, కేవలం ఐదు దేశాలు మాత్రమే కాదు, ప్రపంచంలో చాలా దేశాలు వివిధ కోవిడ్-19 వ్యాక్సిన్లను తయారు చేస్తున్నాయి. అంతేకాదు, అన్ని వ్యాక్సిన్ల కంటే భారత్ బయోటెక్ వారి ‘కోవాక్సిన్’ అత్యంత ప్రభావంతమైనదని చెప్పడానికి ఇప్పటివరకైతే ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. భారత్ బయోటెక్ చైర్మన్ డా. కృష్ణ ఎల్లా మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న మూడో దశ‌ క్లినికల్‌ ట్రయల్స్‌ డేటా మార్చి 2021 నాటికి విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

ప్రపంచం అంతటా కోవిడ్-19 కేసులు రిపోర్ట్ అవ్వడంతో, చాలా దేశాలు కోవిడ్-19 కి వాక్సిన్ తయారు చేయడానికి తగిన చర్యలు చేపట్టాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన ‘Draft landscape of COVID-19 candidate vaccines’ డాక్యుమెంట్ లో 05 జనవరి 2021 నాటికి 63 వ్యాక్సిన్లు క్లినికల్ డెవలప్మెంట్ స్టేజ్ లో మరియు 172 వ్యాక్సిన్లు ప్రీ-క్లినికల్ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉన్నట్టు చదవొచ్చు.

క్లినికల్ డెవలప్మెంట్ ‘స్టేజ్3’ లేదా స్టేజ్ 2/3’ ఫేజ్ లో ఉన్న వ్యాక్సిన్ల కి సంబంధించిన డెవలపర్స్ పేర్లను కింద లిస్టులో చూడవొచ్చు (భారత్ బయోటెక్ వారి ‘కోవాక్సిన్’ కూడా ‘స్టేజ్3’ లో ఉంది). కేవలం ఐదు దేశాలు మాత్రమే కాదు, చాలా దేశాలకు [భారత్ (Bharat Biotech), యూఎస్ (Moderna), యూకే (AstraZeneca), రష్యా (Gamaleya), జపాన్ (AnGes), చైనా (Sinovac), కెనడా (Medicago), జర్మనీ (BioNTech), ఖజకిస్తాన్‌ (Research Institute for Biological Safety Problems), మరియు ఇతర దేశాలు] చెందిన కార్పొరేట్ మరియు ప్రభుత్వ సంస్థలు వివిధ కోవిడ్-19 వాక్సిన్లు తయారు చేస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి లిస్టులో చూడవొచ్చు.

ఒక వ్యాక్సిన్ యొక్క తయారీ కేవలం దాన్ని కనుగొన్న దేశానికే పరిమితం కాదు. ఉదాహరణకి, ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వారు కనుగొన్న వ్యాక్సిన్ ని భారత్ లో ‘సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ మరియు ఆస్ట్రేలియాలో ‘సీఎస్ఎల్’ వారు ఉత్పత్తి చేస్తున్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తి మరియు సరఫరాను వేగవంతం చేయడానికి 15 కంటే ఎక్కువ దేశాలలో 20 కి పైగా సరఫరా భాగస్వాములతో వారు పనిచేస్తున్నట్టు ఆస్ట్రాజెనెకా వెబ్సైటులో చదవొచ్చు. ‘ఫైజర్’ మరియు ‘బయో ఎన్ టెక్’ యొక్క వ్యాక్సిన్ ని జర్మనీ, బెల్జియం, మరియు యూఎస్ లో ఉత్పత్తి చేస్తున్నట్టు ‘రాయిటర్స్’ రిపోర్ట్ చేసింది.

అంతేకాదు, అన్ని వ్యాక్సిన్ల కంటే భారత్ బయోటెక్ వారి ‘కోవాక్సిన్’ అత్యంత ప్రభావంతమైనదని చెప్పడానికి ఇప్పటివరకైతే ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. భారత్ బయోటెక్ చైర్మన్ డా. కృష్ణ ఎల్లా మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న మూడో దశ‌ క్లినికల్‌ ట్రయల్స్‌ డేటా మార్చి 2021 నాటికి విడుదల చేసే అవకాశం ఉందని తెలిపినట్టు పలు వార్తాసంస్థలు రిపోర్ట్ చేసాయి.

భారత్ లో తయారవుతున్న వాక్సిన్ల వైపు చాలా దేశాలు చూస్తున్నాయి. బ్రెజిల్ ప్రైవేట్ క్లినిక్‌లు భారత్ బయోటెక్ తో ఒప్పందం చేసుకున్నట్టు వార్తాసంస్థలు రిపోర్ట్ చేసాయి. అంతేకాదు, నేపాల్ మరియు శ్రీలంక కూడా భారత్ నుండి వాక్సిన్ల కోసం చూస్తున్నట్టు తెలిసింది. అయితే, పోస్ట్ లో చెప్పినట్టు 32 చిన్న, పెద్ద దేశాలు వాక్సిన్ల కోసం ముందస్తు ఆర్డర్లు చేసినట్టు ఖచ్చితమైన సమాచారం ఎక్కడా లభించలేదు. కానీ, కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ పంపిణీ కి సంబంధించి ‘సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’, ‘GAVI’, ‘వ్యాక్సిన్ అలయన్స్’, మరియు ‘బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్’ కలిసి పనిచేస్తున్నట్టు ‘GAVI’ వెబ్సైటులో చదవొచ్చు.

చివరగా, కేవలం ఐదు దేశాలు మాత్రమే కాదు, ప్రపంచంలో చాలా దేశాలు వివిధ కోవిడ్-19 వ్యాక్సిన్లను తయారు చేస్తున్నాయి. అంతేకాదు, అన్ని వ్యాక్సిన్ల కంటే భారత్ బయోటెక్ వారి ‘కోవాక్సిన్’ అత్యంత ప్రభావంతమైనదని చెప్పడానికి ఇప్పటివరకైతే ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll