భారతదేశం మరియు మోడీకి సంబంధించి 2014 నుంచి 2026 మధ్యలో ఏమవుతుందో నోస్ట్రడామస్ కాలజ్ఞానం చెప్పినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదు

2014 నుంచి 2026 మధ్యలో భారతదేశం సూపర్ పవర్ గా ఆవిర్భవిస్తుందని, ఓ మధ్య వయస్కుడు భారతదేశాన్ని సరైన దిశలో నడిపిస్తాడని, భారతదేశం మరియు నరేంద్ర మోడీ గురించి 1555 లోనే ఫ్రాన్స్ కి చెందిన నోస్ట్రడామస్ కాలజ్ఞానం రాసాడంటూ బీజేపీ లీడర్ కిరణ్ రిజిజు చెప్పినట్టు ఉన్న పోస్ట్ ని ఫేస్బుక్ లో కొందరు షేర్ చేస్తున్నారు. పోస్ట్ లో చెప్పినట్టు నోస్ట్రడామస్ అలాంటి కాలజ్ఞానం ఏమైనా చెప్పాడో లేదో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : 2014 నుంచి 2026 మధ్యలో భారతదేశం సూపర్ పవర్ గా ఆవిర్భవిస్తుందని, మోడీ దేశాన్ని సరైన దిశలో నడిపిస్తాడని కాలజ్ఞానం చెప్పిన నోస్ట్రడామస్.

ఫాక్ట్ (నిజం): భారతదేశం మరియు మోడీకి సంబంధించి 2014 నుంచి 2026 మధ్యలో ఏమవుతుందో నోస్ట్రడామస్ కాలజ్ఞానం చెప్పినట్టు ఎక్కడా కూడా దొరకలేదు . కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

పోస్ట్ లో చెప్పినట్టు బీజేపీ లీడర్ కిరణ్ రిజిజు వ్యాఖ్యలు చేసాడా అని గూగుల్ లో వెతకగా, 2016 లో తన ఫేస్బుక్ అకౌంట్ లో భారతదేశం మరియు మోడీ గురించి నోస్ట్రడామస్ కాలజ్ఞానం చెప్పినట్టు పోస్ట్ చేసాడని ‘ఇండియా టుడే’ ఆర్టికల్ లో చూడవచ్చు.

నోస్ట్రడామస్ అలాంటి కాలజ్ఞానం ఏమైనా చెప్పాడా అని వెతకగా, భారతదేశం మరియు మోడీకి సంబంధించి 2014 నుంచి 2026 మధ్యలో ఏమవుతుందో తను చెప్పినట్టు ఇంటర్నెట్ లో ఎక్కడా కూడా దొరకలేదు. కానీ, ఫ్రాంకోయిస్ గౌటియర్ అనే వ్యక్తి భారతదేశం మరియు మోడీ గురించి నోస్ట్రడామస్ కాలజ్ఞానం చెప్పినట్టు ఆర్టికల్స్ రాసాడని తెలుస్తుంది. ఫ్రాంకోయిస్ గౌటియర్ రాసిన ఆర్టికల్స్ చదువుతే, ‘Bamprelle de la Rochefoucault’ అనే ఫ్రెంచ్ స్కాలర్ కి భారతదేశం మరియు మోడీ గురించి నోస్ట్రడామస్ రాసిన కాలజ్ఞాన పత్రాలు కొన్ని సంవత్సరాల ముందు ఒక ట్రంక్ పెట్టలో దొరికినట్టు తెలుస్తుంది. కానీ, గూగుల్ లో ‘Bamprelle de la Rochefoucault’ అనే ఫ్రెంచ్ స్కాలర్ కోసం వెతకగా, తన గురించి ఎటువంటి సమాచారం దొరకదు. అంతే కాదు, ఫ్రాంకోయిస్ గౌటియర్ ఆ ట్రంక్ పెట్ట గురించి వివిధ సమయాల్లో వివిధ రకాలుగా చెప్పినట్టు AltNews వారు రాసిన ఆర్టిల్ లో చదవచ్చు.

ఫ్రాంకోయిస్ గౌటియర్ రాసిన ఆర్టికల్స్ చూడగా, తను 2009, 2013 మరియు 2019 లలో ఎన్నికలకు సంబంధించి రాసిన మూడు ఆర్టికల్స్ లో భారతదేశం మరియు మోడీ గురించి నోస్ట్రడామస్ కాలజ్ఞానం చెప్పిన విషయాలను రాసినట్టు చదవచ్చు. కానీ, మూడు ఆర్టికల్స్ లో నోస్ట్రడామస్ కాలజ్ఞానం చెప్పినట్టు వేరేవేరే విషయాల గురించి రాసాడు. ఒకవేళ,  నోస్ట్రడామస్ కాలజ్ఞానం చెప్పిన పత్రాలు నిజంగా దొరికితే, అవి ప్రతి సారీ మారుతూ ఉండవు కదా!!

అంతేకాదు, నోస్ట్రడామస్ కాలజ్ఞానం చెప్పినట్టు రాసిన విషయాల్లో కొన్ని పేర్లను కూడా ఫ్రాంకోయిస్ గౌటియర్ తను రాసిన ఆర్టికల్స్ లో మారుస్తూ ఉండడం చూడొచ్చు.

టైమ్స్ అఫ్ ఇండియా లో ‘Nostradamus and India’ అని ఫ్రాంకోయిస్ గౌటియర్ రాసిన ఆర్టికల్ లో ‘ఈ ఆర్టికల్ లో రాసినవి నిజాలు కావు. కేవలం వ్యంగ్యంగా రాసిన విషయాలు మాత్రమే’ అని ఒక డిస్క్లైమర్ ఉన్నట్టు చూడవచ్చు. అంతేకాదు, వివిధ దేశాల్లో జరిగిన సంఘటనలు కూడా నోస్ట్రడామస్ తన కాలజ్ఞానం తో ముందే చెప్పినట్టు వచ్చిన కొన్ని వార్తలపై ‘Snopes’ సంస్థ వారు రాసిన ఆర్టికల్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చదవచ్చు. కావున, నోస్ట్రడామస్ కాలజ్ఞానం అంటూ పోస్ట్ లో చెప్పినవి నిజాలు కావు.

చివరగా భారతదేశం మరియు మోడీకి సంబంధించి, 2014 నుంచి 2026 మధ్యలో ఏమవుతుందో నోస్ట్రడామస్ కాలజ్ఞానం చెప్పినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?