‘కొరోనా వైరస్ ను ల్యాబ్ లోనే సృష్టించారు’ అని నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ తసుకు హోంజో అనలేదు

కొరోనా వైరస్ సహజంగా వచ్చింది కాదని, చైనాయే సృష్టించి ప్రపంచం మీదకు వదిలిందని జపాన్ నోబెల్ బహుమతి గ్రహీత మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ తసుకు హోంజో అన్నారని చెప్తూ ఒక మెసేజ్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: కొరోనా వైరస్ సహజంగా వచ్చింది కాదని, చైనాయే సృష్టించి ప్రపంచం మీదకు వదిలిందని జపాన్ నోబెల్ బహుమతి గ్రహీత మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ తసుకు హోంజో అన్నారు.

ఫాక్ట్ (నిజం): ఆ వ్యాఖ్యలు నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ తసుకు హోంజో చేసారని ఎక్కడా కూడా అధికారిక సమాచారం లేదు. కొరోనా వైరస్ సహజమైనది కాదని ఈ మధ్య తను ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా ఎక్కడా అనలేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్టులోని విషయం గురించి వెతకగా, కొన్ని తెలుగు మీడియా సంస్థలు [టీవీ 9 (ఆర్కైవ్డ్) మరియు తెలుగు వన్ (ఆర్కైవ్డ్)]  పోస్టులోని విషయాన్నే చెప్తూ ఆర్టికల్స్ రాసినట్టు తెలుసుతుంది.

నోబెల్ బహుమతి పొందిన మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ తసుకు హోంజో అని జపాన్ నుండి ఎవరైనా ప్రొఫెసర్ ఉన్నారా అని వెతకగా, ప్రతికూల రోగనిరోధక నియంత్రణను నిరోధించడం ద్వారా క్యాన్సర్ చికిత్సను కనుగొన్నందుకు జేమ్స్ పి. అల్లిసన్ తో పాటు 2018 లో డాక్టర్ తసుకు హోంజో నోబెల్ అవార్డు అందుకున్నట్లు తెలుస్తుంది. కానీ, పోస్ట్‌లోని వ్యాఖ్యలు తాను చేసినట్టు ఎక్కడా కూడా అధికారిక సమాచారం లేదు.

తను తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో, ‘వైరస్ ఇన్ఫెక్షన్లను రోజుకు 10,000 కు పైగా గుర్తించడానికి పీసీఆర్ పరీక్షలను వేగవంతం చేయవలసిన అవసరం ఉంది.  టోక్యో, ఒసాకా మరియు నాగోయ యొక్క మూడు నగరాల ప్రజలు బయటికి వెళ్ళకుండా పూర్తి స్వీయ నియంత్రణ పాటించాలి’ అని అన్నారు. దీనికి ముందు ఇచ్చిన మరొక ఇంటర్వ్యూలో కూడా తసుకు హోంజో జపాన్ అధికారులను మరింత చురుకైన విధానాన్ని అవలంబించమని ప్రోత్సహించారు మరియు జపాన్ అనుసరించడానికి తైవాన్ గొప్ప నమూనాగా ఉపయోగపడుతుందని అన్నారు. కానీ, ఎక్కడా కూడా పోస్టులో చెప్పినట్టు కరోనావైరస్ సహజంగా వచ్చింది కాదని, చైనా దీనిని తయారు చేసారని తను అనలేదు.

తసుకు హోంజో ప్రస్తుతం క్యోటో యూనివర్శిటీ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మరియు విశిష్ట ప్రొఫెసర్ పదవిలో పనిచేస్తున్నారు. అతని పూర్తి ప్రొఫైల్ వారి వెబ్‌సైట్‌లో చూడవచ్చు. తసుకు హోంజో చైనాలోని వుహాన్ ప్రయోగశాలలో 4 సంవత్సరాలు పనిచేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులో ఉంది, కానీ దాని గురించి అతని ప్రొఫైల్‌లో మాత్రం లేదు. కావున, తసుకు హోంజో చైనాలోని వుహాన్ ప్రయోగశాలలో 4 సంవత్సరాలు పనిచేసాడనే క్లెయిమ్ కూడా తప్పు.

కొద్ది రోజుల క్రితం ఒక ఫ్రెంచ్ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరొక నోబెల్ గ్రహీత లూక్ మోంటాగ్నియర్ చైనా యొక్క వుహాన్‌లోని ఒక ప్రయోగశాలలో కొరోనా వైరస్ తయారు చేయబడిందని అన్నారు. హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్‌ఐవి) ను కనుగొన్నందుకు 2008 మెడిసిన్ నోబెల్ బహుమతిని ఫ్రాంకోయిస్ బార్-సినౌస్సీ మరియు హరాల్డ్ జుర్ హౌసెన్‌లతో కలిసి మోంటాగ్నియర్ గెలుచుకున్నారు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కార్యాలయం వారు ఈ వాదనలను ఖండించారు మరియు కోవిడ్ -19 వ్యాప్తికి మరియు చైనా నగరమైన వుహాన్ లోని పీ4 పరిశోధన ప్రయోగశాల పనికి మధ్య సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు ఎటువంటి వాస్తవమైన ఆధారాలు లేవని స్పష్టం చేశారు.

కోవిడ్-19 వ్యాధి ప్రారంభం అయినప్పటి నుండి దాన్ని వుహన్ లోని రీసెర్చ్ ల్యాబ్ లో తాయారు చేసారని చాలా క్లెయిమ్స్ వచ్చాయి. అయితే, ఆ క్లెయిమ్స్ తప్పు అంటూ ప్రపంచంలోని చాలా ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థలు ఇప్పటికే చాలా ఆర్టికల్స్ రాసాయి. కొరోనా వైరస్ ని ల్యాబ్ లో తయారు చేసారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని మార్చిలో ఒక స్టడీ తెలిపింది. తమ దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం కొరోనా వైరస్ గత సంవత్సరం చివరలో చైనాలోని జంతువులలో ఉద్భవించిందని, ల్యాబ్ లో తయారు చేయబడలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు కూడా అనేకసార్లు తెలిపారు.

చివరగా, ‘కొరోనా వైరస్ ను ల్యాబ్ లోనే సృష్టించారు’ అని నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ తసుకు హోంజో అనలేదు.

వివరణ (APRIL 28, 2020):
నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ తసుకు హోంజో పేరు మీద ఫేక్ మెసేజ్ వైరల్ అవ్వడంతో క్యోటో యూనివర్శిటీ వారు, ప్రొఫెసర్ హోంజో ఇచ్చిన స్టేట్మెంట్ ని తమ వెబ్సైటు లో ప్రచురించారు. తసుకు హోంజో తన స్టేట్మెంట్ లో, తన పేరు మరియు యూనివర్సిటీ పేరు మీద వైరల్ అవుతున్న తప్పుడు సమాచారానికి తాను చాలా బాధపడుతున్నానని తెలిపాడు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?