‘భారతదేశ వార్తా ఛానెళ్లలో 83% జర్నలిస్టులు ప్రభుత్వ వ్యతిరేకులు’ అంటూ ఏ ‘ప్రపంచ మీడియా’ సర్వే వెల్లడించలేదు

‘ప్రపంచ మీడియా సర్వే ప్రకారం భారతదేశ వార్తా ఛానెళ్లలో 83% జర్నలిస్టులు ప్రభుత్వ వ్యతిరేకులు ప్రపంచంలో సగటున 10% మీడియా ప్రభుత్వ వ్యతిరేకం’ అని ఉన్నపోస్ట్ ని సోషల్ మీడియా లో చాలా మంది షేర్ చేస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవమో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారతదేశ వార్తా ఛానెళ్లలో 83% జర్నలిస్టులు ప్రభుత్వ వ్యతిరేకులు, ప్రపంచంలో సగటున 10% మీడియా ప్రభుత్వ వ్యతిరేకం అని ప్రపంచ మీడియా సర్వే పేర్కొన్నది.

ఫాక్ట్ (నిజం): పోస్టులో పేర్కొన్న సర్వేకి సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. ‘వరల్డ్ మీడియా’ పేరుతో చాలా సంస్థలు ఉన్నాయి, కానీ అవి ఏవీ కూడా ఇలాంటి సర్వే చేసినట్లుగా ఆధారాలు లేవు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

పోస్టులో పేర్కొన్న సర్వే గురించి గూగుల్ లో ‘World media survey news channels in india 83% journalists against government’ అని వెతికినప్పుడు, అలాంటి సర్వే కి సంబంధించి ఎటువంటి సమాచారం సెర్చ్ రిజల్ట్స్ లో రాలేదు.

గూగుల్ లో ‘world media’ అని సెర్చ్ చేసినప్పుడు, సెర్చ్ రిజల్ట్స్ లో అలాంటి పేరుతోనే ‘వరల్డ్ మీడియా గ్రూప్’ అనే సంస్థ ఉన్నట్లుగా తెలిసింది. ఆ సంస్థ గురించి సమాచారం కోసం చూసినప్పుడు, అది ప్రపంచంలోని ప్రముఖ మీడియా సంస్థల కూటమి అని తెలిసింది. కానీ, ఆ సంస్థ పోస్టులో పేర్కొన్న సర్వే చేసినట్లుగా ఎక్కడా తెలియలేదు.

చివరగా, ‘భారతదేశ వార్తా ఛానెళ్లలో 83% జర్నలిస్టులు ప్రభుత్వ వ్యతిరేకులు’ అంటూ ఏ ‘ప్రపంచ మీడియా’ సర్వే వెల్లడించలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?