Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

‘ఇప్పటివరకు ఒక్క శాకాహారికి కూడా కరోనావైరస్ సోకలేదు’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెప్పలేదు

0

WHO నివేదిక ప్రకారం ఇప్పటివరకు ఒక్క శాకాహారికి కూడా కరోనావైరస్ సోకలేదని క్లెయిమ్ చేస్తూ ఒక ఫోటో ప్రచారం అవుతుంది. ఆ ఫొటోలోని సమాచారం నిజామా కాదా అని అడుగుతూ Factly వాట్సాప్ కి ఆ ఫోటో పంపారు.  ఆ క్లెయిమ్ లో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం.

క్లెయిమ్: WHO నివేదిక ప్రకారం ఇప్పటివరకు ఒక్క శాకాహారికి కూడా కరోనావైరస్ సోకలేదు.

ఫాక్ట్ (నిజం): WHO రిపోర్ట్ లో కానీ, WHO ప్రతినిధి కానీ అలాంటి ప్రకటన చేయలేదు. అంతేకాక, WHO సరిగ్గా వేడి చేసి వండిన మాంసాన్ని తినవచ్చని ప్రజలకు సలహా ఇచ్చింది. కావున, ఫోటో లోని క్లెయిమ్ తప్పు. 

WHO అలాంటి  ప్రకటన చేసిన రిపోర్ట్ ఏదైనా ఉందా అని వెతికితే,  అలాంటి రిపోర్ట్ ఏదీ కనిపించలేదు. అలాగే, పోస్ట్‌లో పేర్కొన్న సమాచారానికి సంబంధించి FACTLY WHO ని సంప్రదించినప్పుడు, చైనా లో ఉన్న WHO ప్రతినిధి తాను ఒక సందర్భం లో ఇచ్చిన ప్రకటనని తప్పుగా వాడుతున్నారని స్పష్టం చేశారు. జూనోటిక్ వ్యాధులు (జంతువుల ద్వారా మనుషులకు వ్యాప్తి చెందేవి) మరియు మానవ జనాభా లోకి  ఆ వ్యాధులు ‘స్పిల్-ఓవర్’  అయ్యే అవకాశం వలన ప్రపంచానికి పొంచి ఉన్న ప్రమాదం గురించి ఒక చర్చలో చెప్పానని WHO ప్రతినిధి అన్నారు. ఒక రకమైన ఆహారాన్ని ఆమోదించడం లేదా ఇంకొక రకమైన ఆహారాన్ని ఖండించడం ఆ చర్చ యొక్క ఉద్దేశ్యం కాదని, కానీ ప్రజలు మాంసాన్ని తినేంతవరకు, జంతువులను పెంచుకోవడం, వాటిని చంపడం,  వాటి ఉత్పత్తులను పంపిణీ చేయడం మరియు అమ్మడం జరుగుతాయని, దీని కారణంగా జంతువులు మరియు మనుషులు దగ్గర అయ్యి జంతు-మానవ స్పిల్-ఓవర్లు జరిగి అంటు వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయని తెలిపారు. కావున, పశువుల పెంపకం దగ్గర నుండి మాంసం విక్రయాల వరకు అన్ని ఒక ఆరోగ్య విధానంలో నియంత్రించడం ముఖ్యం అని చెప్పారు. అంతేకాక, ఆహారం కోసం అడవి జంతువులతో  చేసే అక్రమ వ్యాపారంలో ఇది ఇంకా ఎక్కువ వర్తిస్తుందని తెలిపారు. అంతేకాని, ఆ చర్చలో ‘ఇప్పటివరకు ఒక్క శాకాహారికి కూడా కరోనావైరస్ సోకలేదు’ అని చెప్పలేదు.

సరిగ్గా వేడి చేసి వండిన మాంసాన్ని తినొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రజలకు సూచించింది. అలాగే, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) తన రిపోర్ట్ లో, ‘జంతువులు లేదా జంతువులకు చెందిన ఆహారం ద్వారా కోవిడ్ -19 వైరస్ మనుషులకు  వ్యాపిస్తుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవు’ అని పేర్కొంది.

కొన్ని న్యూస్ రిపోర్ట్స్ మరియు రీసెర్చ్ ఆర్టికల్స్, SARS-CoV-2 వైరస్ మన శరీరం లోని కణాల ఉపరితలంపై ఉండే ACE2 అనే ప్రోటీన్‌ ని,  తాళంలో ఇమిడే కీ లాగా పట్టుకుంటుందని, వ్యాధి సంక్రమణ ప్రారంభం కావడానికి ఇది మొదటి దశ అని సూచించాయి. ‘ACE2‘ మనుషులలో వివిధ అవయవాలలో కనిపిస్తుంది.  ‘కరోనావైరస్ శరీరంలోని  కణాలను ఎలా హైజాక్ చేస్తుంది’ అనే అంశంపై ‘The New York Times’ వారి ఇంటరాక్టివ్ విజువలైజేషన్ ని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ‘ఇప్పటివరకు ఒక్క శాకాహారికి కూడా కరోనావైరస్ సోకలేదు’ అని చెప్పలేదు. 

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll