Fake News, Telugu
 

TRS ప్రభుత్వం ‘ఇస్లామిక్ బ్యాంక్’ను స్థాపించి ముస్లింలకు మాత్రమే రుణాలు ఇస్తుందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు

0

తెరాస ప్రభుత్వం స్థాపించబోతున్న ‘ఇస్లామిక్ బ్యాంక్’ లో ముస్లిం యువకులకు మాత్రమే వడ్డీ లేని అప్పు ఇస్తారు” అని చెప్తున్న ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: TRS ప్రభుత్వం స్థాపించబోతున్న ‘ఇస్లామిక్ బ్యాంక్’ లో ముస్లిం యువకులకు మాత్రమే వడ్డీ లేని రుణాలు ఇస్తారు.

ఫాక్ట్(నిజం):  తెలంగాణ ప్రభుత్వం ‘ఇస్లామిక్ బ్యాంక్’ ను ప్రారంభిస్తున్నట్లు ఎటువంటి అధికారిక ప్రకటన లేదా వార్తా కథనాలు లేవు. అంతే కాదు, రిజర్వ్ బ్యాంక్ 2017లో దేశంలో ఇస్లామిక్ బ్యాంకింగ్ ను ప్రవేశపెట్టడం లేదు అని నిర్ణయం తీసుకుంది. కావున, పోస్టులో చెప్తున్న క్లెయిమ్ తప్పు.

ముందుగా, పోస్టులో ఉన్న “BANK ISLAM” ఫొటో గురించి ఇంటర్నెట్లో వెతకగా అది మలేషియాకు చెందిన బ్యాంక్ అని తెలిసింది. ఈ బ్యాంక్ వెబ్‌సైటు ప్రకారం, వారికి భారత దేశంలో ఎటువంటి శాఖలు లేవు. భారత్ లో కార్యకలాపాలను ప్రారంభిస్తున్నట్లు ఎక్కడా కథనాలు లేవు.

ఇస్లామిక్ బ్యాంకింగ్ అంటే ఏమిటి?

ఇస్లామిక్ బ్యాంకింగ్ అనేది షరియా నిబంధనలకు అనుగుణంగా పని చేసే బ్యాంకింగ్ వ్యవస్థ. . షరియా నిబంధనల ప్రకారం వడ్డీ అనేది  నిషేధం కాబట్టి బ్యాంక్ నుంచి డబ్బును అప్పుగా తీసుకున్న వాళ్ళు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇక భారత్ లో బ్యాంకులు అన్నీ ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ నిబంధనలను అనుసరించి పని చేయాల్సి ఉంటుంది. 2017లో టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన కథనం ప్రకారం, దేశంలో ఇస్లామిక్ బ్యాంకింగ్ ను ప్రవేశపెట్టే ప్రతిపాదనను ముందుకు తీసుకుపోమని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. అంతే కాదు, ఇస్లామిక్ బ్యాంకింగ్ భారత దేశంలో ప్రవేశ పెట్టాలంటే ‘బ్యాంకింగ్ రెగ్యులేషన్’ చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుంది. అలాంటి సవరణలు చేసినట్టు ఎక్కడా అధికారిక సమాచారం లేదు.

ఇక తెలంగాణ ప్రభుత్వం ఇస్లాం బ్యాంక్ ను స్థాపిస్తున్నట్లు ఎక్కడా ఆధారాలు లేవు. తెలంగాణలో ముస్లిం పేర్లతో  ఉన్న బ్యాంకులు కూడా రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం నడుచుకుంటాయి. ఇవి ఋణాలపైన వడ్డీని విధిస్తాయి, మరియు అన్ని సామాజిక వర్గాల కస్టమర్లతో లావాదేవీలు జరుపుతాయి.  

అయితే, ఆర్ధికంగా వెనుకబడిన సామాజిక వర్గాలకు ప్రభుత్వం వివిధ సందర్భాలలో వడ్డీ లేని రుణాలు లేదా తక్కువ వడ్డీ రుణాలను మంజూరు చేస్తుంది. వాటి వివరాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, తెలంగాణ ప్రభుత్వం ఇస్లామిక్ బ్యాంక్ ను స్థాపించి కేవలం ముస్లింలకు మాత్రమే రుణాలు ఇవ్వనున్నట్లు చెప్తున్న పోస్టులో నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll