ఇటీవల గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన ర్యాలీపై న్యూయార్క్ టైమ్స్ ఇటువంటి ఆర్టికల్ ప్రచురించలేదు

ఒక ర్యాలీలో అత్యధిక సంఖ్యలో ప్రజలను సమీకరించడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రపంచ రికార్డును నెలకొల్పిందనే వాదనతో న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన ఒక ఆర్టికల్ యొక్క ఫోటో అని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ అవుతుంది. ఆర్టికల్ యొక్క ఉప శీర్షికలో ఇలా ఉంది, “Nearly 25 crores people attended Arvind Kejriwal’s rally in Gujarat after his Landslide win in Punjab Election.” ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

YouTube Poster

క్లెయిమ్: గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ 25 కోట్ల మందితో ర్యాలీ నిర్వహించిందని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన ఆర్టికల్ యొక్క ఫోటో.

ఫాక్ట్: 02 ఏప్రిల్ 2022న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే, 02 ఏప్రిల్ 2022న న్యూయార్క్ టైమ్స్ ఆమ్ ఆద్మీ పార్టీపై ఎలాంటి ఆర్టికల్ ప్రచురించలేదు. న్యూయార్క్ టైమ్స్ ఇది ఎడిట్ చేయబడిన ఇమేజ్ అని, ఆ ఆర్టికల్ తాము రాయలేదు, ప్రచురించలేదని ట్వీట్ కూడా చేసింది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.        

న్యూయార్క్ టైమ్స్ వెబ్సైటులో వెతకగా , 02 ఏప్రిల్ 2022న ఆమ్ ఆద్మీ పార్టీపై వారు ఆర్టికల్ ప్రచురించినట్టు ఎక్కడా కూడా సమాచారం లభించలేదు. న్యూయార్క్ టైమ్స్ యొక్క ఇండియా పేజీలో ఇటీవల గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ర్యాలీ గురించి ఒక్క ఆర్టికల్ కూడా లేదు.

న్యూయార్క్ టైమ్స్ తరచూ వాడే పదాలకు భిన్నంగా ఈ ఆర్టికల్‌లో ఉపయోగించిన పదాలు ఉన్నాయి. ‘crores’ అనే పదం న్యూయార్క్ టైమ్స్, వారి ఆర్టికల్స్‌లో మామూలుగా వాడరు.

అదే ఫోటో ట్వీట్ చేసిన ఒక యూజర్ కు న్యూయార్క్ టైమ్స్ సమాధానం ఇస్తూ, ఇది ఎడిట్ చేయబడిన ఫోటో అని మరియు ఆ ఆర్టికల్ తాము రాయలేదు, ప్రచురించలేదని తెలిపింది.

02 ఏప్రిల్ 2022న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ భారీ ర్యాలీ నిర్వహించారు. న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం, ర్యాలీకి చాలా మంది వచ్చారు; ర్యాలీకి ముందు, దాదాపు 50,000 మంది ఇందులో పాల్గొంటారని కూడా భావించారు.

చివరగా, ఇటీవల గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన ర్యాలీపై న్యూయార్క్ టైమ్స్ ఇటువంటి ఆర్టికల్ ప్రచురించలేదు.