1996లోనే కాంగ్రెస్ ప్రభుత్వం లిథియాన్ని వెలికితీసి చైనాకు తరలించిందంటూ తప్పుడు సమాచారం షేర్ చేస్తున్నారు

జమ్ము కాశ్మీరీలో 5.9 మిలియన్ టన్నుల లిథియం ఖనిజ నిల్వలు ఉన్నవిగా భావిస్తున్నట్లు ఇటీవల Geological Survey of India (GSI) ప్రకటించిన నేపథ్యంలో, అసలు భారత్‌లో 1996లోనే లిథియం నిల్వలున్నట్లు కనుగొన్నారని, ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా దాచి, దానిని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తరువాతి రోజుల్లో చైనాకి తరలించిందని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.  

YouTube Poster

క్లెయిమ్: భారతదేశంలో 1996లోనే లిథియం ఖనిజ నిల్వలను కనుగొని కాంగ్రెస్ ప్రభుత్వం చైనాకు తరలించింది.

ఫాక్ట్: 1999లో GSI ప్రచురించిన రిపోర్ట్ ప్రకారం, 1995-97 మధ్య కాలంలో జమ్ము కాశ్మీర్లో అనేక ప్రాంతాలలో లిథియం నిల్వలను గుర్తించడానికి కొన్ని ప్రాధమిక పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలలో తీసుకున్న శాంపిల్స్ లో బౌక్సైట్ మరియు ఇతర ఖనిజాల్లో లిథియం ఉన్నట్లు గుర్తించారు. కానీ, తదుపరి పరీక్షలు చేయాలని ఈ రిపోర్టులో సిఫార్సు చేశారు. ఇటీవల, దాదాపు 20 ఏళ్ల తరువాత దీనికి సంబంధించిన రెండవ పరీక్ష చేసి జమ్ము కాశ్మీరీలో 5.9 మిలియన్ టన్నుల లిథియం ఖనిజ నిల్వలు ఉన్నవిగా భావిస్తున్నట్లు GSI పేర్కొంది. పూర్తిస్థాయిలో లిథియం వెలికితీత సాధ్యమవుతుందో లేదో తెలియాలంటే మరో రెండు పరీక్షలు చేయవలసి ఉంటుంది. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లిథియం వెలికి తీయలేదని గనుల మంత్రిత్వ శాఖ పార్లమెంటులో స్పష్టం చేసింది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా వైరల్ వీడియోలో చెప్పినట్లుగా 1996 లో జమ్ము కాశ్మీర్‌లో GSI నిర్వహించిన సర్వే రిపోర్టుల కోసం వారి అధికారిక వెబ్‌సైట్లో వెతికాము. 1995 నుండి 1997 మధ్య కాలంలో చేసిన సర్వేలను సమాచారంతో ఉన్న “FINAL REPORT ON REGIONAL GEOCHEMICAL SURVEY FOR BASE METALS AND LITHIUM IN SALAL AREA, UDHAMPUR DISTRICT” అనే రిపోర్ట్ లభించింది. దీనిని 1999లో ప్రచురించారు. ఈ రిపోర్టులోని ముఖ్యాంశాల ప్రకారం, సేకరించిన శాంపిల్స్ లో లిథియం బౌక్సైట్ మరియు ఇతర ఖనిజాలతో కలిసి ఉందని పేర్కొన్నారు.

పైగా, వీటిల్లో లిథియం ఖనిజ రూపంలో కాకుండా ‘silicates’ & ‘ ‘Lattices’ రూపాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఇక దీనిపై మరింత పరిశోధన జరగాలని ఈ రిపోర్ట్ లో సూచించారు.

అయితే, గనుల మంత్రిత్వ శాఖ వారు అనుసరించే “United Nations Framework Classification” ప్రకారం, ఏదైనా ఖనిజాన్ని కనుగొని వెలికితీయడానికి నాలుగు దశలు ఉంటాయి. వాటినే G1, G2, G3 మరియు G4 గా విభజించారు. 1999లో ప్రచురించిన రిపోర్టు G4 కేటగిరి కిందికి వస్తుంది. ఈ దశలో కేవలం పరిమితమైన సంఖ్యలో శాంపిల్స్ తీసుకొని ప్రాధమిక సమాచారాన్ని విశ్లేషిస్తారు.

ఈ ఏడాది విడుదల చేసిన రిపోర్టుని G3 గా GSI పేర్కొంది. పైగా అందులో ‘inferred’ అనే అనే పదాన్ని వాడారు. అంటే లభించిన ఆధారాలతో లెక్క కట్టడం అనే అర్థం వస్తుంది, కాబట్టి దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం ఇక్కడ చూడవచ్చు.

ఇక దేశంలో లిథియం నిల్వలు ఎంత ఉన్నాయో పార్లమెంటులో ప్రశ్నించగా, గనుల మంత్రిత్వ శాఖ సమాధానమిస్తూ GSI అనేక చోట్ల ప్రాధమిక సర్వేలు నిర్వహిస్తుందని, అయితే నేషనల్ మినరల్ ఇన్వెంటరీలో ఎటువంటి లిథియం నిల్వలు లేవని స్పష్టం చేసింది.

చివరిగా, 1996లో కేవలం ప్రాధమిక సర్వేలో జమ్ము కాశ్మీర్లో లిథియం నిల్వలు ఉండవచ్చు అని గుర్తించారే కానీ దాన్ని వెలికి తీసి చైనాకు తరలించలేదు.