2024 కన్నా ముందే భారతదేశం హిందూ రాష్ట్రంగా ప్రకటించబడుతుందని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ అన్నట్టు ఎటువంటి సమాచారం లేదు.

‘2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే భారతదేశం హిందూ రాష్ట్రంగా ప్రకటించబడుతుంది’ అని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ అనట్టు చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తకి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ‘2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే భారతదేశం హిందూ రాష్ట్రంగా ప్రకటించబడుతుంది’ – ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్

ఫాక్ట్(నిజం): ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ నిజంగానే మొసాద్ ఇలా వ్యాఖ్యానించి ఉంటే మన దేశ మీడియా ఈ విషయాన్ని ప్రముఖంగా రిపోర్ట్ చేసి ఉండేది. భారతదేశం లౌకికతత్వాన్ని (సెక్యూలరిజం) అవలంభిస్తుందని రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ అయిన ప్రీయాంబల్‌లో పేర్కొనగా, బేసిక్ స్ట్రక్చర్‌ని సవరించకూడదని పలు సార్లు సుప్రీం కోర్టు చెప్పింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు మాకు ఎటువంటి వార్తా కథనాలుగాని లేక ఇతర సమాచారంగాని లభించలేదు. ఒకవేళ నిజంగానే ఒక దేశ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇలాంటి వ్యాఖ్యలు చేసుంటే మన మీడియా దీన్ని ప్రముఖంగా రిపోర్ట్ చేసి ఉండాలి, కాని మాకు ఈ విషయానికి సంబంధించి ఎటువంటి మీడియా కథనాలు లభించలేదు.

అలాగే భారతదేశం హిందూ రాష్ట్రంగా ప్రకటించే అంశంపై దేశంలో ఎటువంటి చర్చలు జరుగుతున్నట్టు సమాచారం లేదు. రాజ్యాంగం ప్రకారం భారతదేశం లౌకికతత్వాన్ని (సెక్యూలరిజం) అవలంభిస్తుంది. భారతదేశం పాటిస్తున్న లౌకికతత్వం ప్రకారం రాజ్యానికి ఎటువంటి అధికారిక మతం ఉండదు.రాజ్యం ముందు అన్ని మతాలు ఒక్కటే.

రాజ్యాంగంలోని ప్రీయాంబల్‌లో భారతదేశం లౌకికతత్వాన్ని (సెక్యూలరిజం) అవలంభిస్తుందని స్పష్టంగా పేర్కొన్నారు. ప్రీయాంబల్‌ రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ యొక్క భాగమని, రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్‌ని సవరించకూడదని గతంలో అనేక తీర్పుల్లో సుప్రీం కోర్టు పేర్కొంది.

అలాగే అదేవిధంగా ప్రాథమిక హక్కులలో ఆర్టికల్ 25 – 28 కూడా లౌకికతత్వాన్ని పునరుద్ఘాటిస్తున్నాయని సుప్రీం కోర్టు పలు తీర్పులలో పేర్కొంది. ఒకవేళ భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలన్నా రాజ్యాంగ సవరణ చేయాలి. కానీ, ప్రస్తుతం ఈ విషయంలో రాజ్యాంగ సవరణ చేయనునట్టు ఎటువంటి సమాచారం లేదు, రాజకీయ ప్రకటనలు కూడా లేవు.

చివరగా, 2024 కన్నా ముందే భారతదేశం హిందూ రాష్ట్రంగా ప్రకటించబడుతుందని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ అన్నట్టు ఎటువంటి సమాచారం లేదు.