అదానీ గ్రూప్ సంస్థలు ప్రభుత్వానికి ఏటా లక్ష కోట్ల టాక్స్ చెల్లిస్తున్నాయన్న వాదన నిజం కాదు.

అదానీ గ్రూప్ సంస్థలు ప్రతీ సంవత్సరం భారత ప్రభుత్వానికి లక్ష కోట్ల టాక్స్ చెల్లిస్తున్నాయన్న వాదనతో ఒక పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. పైగా అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ సంస్థలు కట్టే టాక్స్‌లే భారత ఆర్ధిక వ్యవస్థను నడిపిస్తున్నాయి/దేశ బడ్జెట్‌కు ఉపయోగపడుతున్నాయి అని కూడా ఈ వీడియోలో చెప్తున్నారు. ఈ కథనం ద్వారా ఈ పోస్టులో చేస్తున్న  క్లెయిమ్‌లకు సంబంధించి నిజమెంతుందో చూద్దాం.

YouTube Poster

క్లెయిమ్: అదానీ గ్రూప్ సంస్థలు ప్రతీ సంవత్సరం భారత ప్రభుత్వానికి లక్ష కోట్లు టాక్స్ రూపంలో చెల్లిస్తున్నాయి.

ఫాక్ట్(నిజం): అదానీ సంస్థలు సంవత్సరానికి లక్ష కోట్ల టాక్స్ చెల్లిస్తున్నాయని IBEF చెప్పలేదు. ప్రభుత్వానికి ఎక్కువ టాక్స్ కడుతున్న కంపెనీల లిస్టులో కూడా అదానీ సంస్థల పేర్లు లేవు. 2022 ఆర్ధిక సంవత్సరంలో అదానీకి చెందిన ఏడు లిస్టెడ్ కంపెనీలు మొత్తం కలిపి కట్టిన టాక్స్‌ల విలువ 5000 కోట్ల రూపాయల కన్నా తక్కువే. పొతే రిలయన్స్, TCS, SBI, మొదలైన సంస్థలు ప్రభుత్వానికి టాక్స్ చెల్లించే లిస్టులో ముందు వరసలో ఉన్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

IBEF లెక్కలు?

ఈ వీడియోలో IBEF ఇచ్చిన లెక్కలు ప్రకారం అదానీ గ్రూప్ సంస్థలు ప్రతీ సంవత్సరం భారత ప్రభుత్వానికి లక్ష కోట్ల టాక్స్ చెల్లిస్తున్నాయని వాదిస్తున్నారు. కాని నిజానికి IBEF అదానీ లక్ష కోట్ల టాక్స్ చెల్లిస్తున్నారని ఎలాంటి రిపోర్ట్ విడుదల చేయలేదు.

డిసెంబర్ 2022లో ఒక మీడియా ఇంటర్వ్యూలో తమ వ్యాపార సంస్థల ఆర్ధిక పరిస్థితి, విస్తరణ, మొదలైన విషయాలపై అదానీ మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలో అదానీ మాట్లాడుతూ ‘రాబోయ దశాబ్దంలో తమ వ్యాపార సంస్థలు భారత దేశ GDPకి ప్రతి 12-18 నెలలకు 1 ట్రిలియన్ డాలర్లు (లక్ష కోట్లు) కాంట్రిబ్యూట్ చేస్తాయని’  అన్నారు.

ఈ ఇంటర్వ్యూలో అదానీ మాట్లాడిన వార్తను IBEF తమ వెబ్‌సైట్‌లో షేర్ చేసింది. ఐతే IBEF షేర్ చేసిన ఈ క్లిప్‌ను తప్పుగా అర్ధం చేసుకొని, ‘అదానీ సంవత్సరానికి లక్ష కోట్లు టాక్స్ కడుతున్నాడంటూ’ వాదిస్తున్నారు. పైగా IBEF షేర్ చేసిన ఈ న్యూస్ క్లిప్‌లో ఈ వార్తలో తప్పులుంటే తమకు సంబంధంలేదని ఒక వివరణ కూడా రాసింది.

అసలు దేశానికి  ఎక్కువ పన్నులు చెల్లిస్తున్న కంపెనీలు ఏవి?

కథనంలో చెప్తున్నటు Ace Equity అనే సంస్థ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో కనీసం రూ. 5000 కోట్ల టాక్స్ కట్టిన కంపెనీలు 15 ఉన్నాయి. పొతే మొత్తం 60 కంపెనీలు 1000 కోట్లకు పైగా టాక్స్ కట్టాయి.

ఇందులలో ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ సంస్థలు అత్యధికంగా 16,297 కోట్లు టాక్స్ చెల్లించగా. ఆ తరవాతి స్థానంలో  13,382 కోట్లతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిలిచింది. 13,238 కోట్లతో TCS మూడో స్థానంలో ఉంది. HDFC బ్యాంక్, వేదాంత, JSW స్టీల్, IOC, మొదలైన కంపెనీలు ఆ తరవాతి స్థానాల్లో ఉన్నాయి.

ఐతే ఇక్కడ గమనించాల్సిన విషయం కనీసం రూ. 5000 కోట్ల టాక్స్ కడుతున్న ఈ 15 కంపెనీల లిస్ట్‌లో అదానీ సంస్థలు లేవు.

టాప్ 500 కంపెనీలు ప్రభుత్వానికి చెల్లిస్తున్న టాక్స్‌లకు సంబంధించి రాసిన ఈ కథనం ప్రకారం 2022లో వివిధ రంగాలలో అదానీ గ్రూపుకి చెందిన ఏడు లిస్టెడ్ కంపెనీలు సుమారు 4000కోట్ల రూపాయల టాక్స్ కట్టాయి. అదానీ ప్రభుత్వానికి కట్టే టాక్స్‌లకు సంబంధించి పలు వార్తా సంస్థలు రాసిన కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

అదాని ఎందుకు టాక్స్ తక్కువ కడుతున్నాడు:

భారత దేశ కార్పోరేట్ చట్టాల ప్రకారం కార్పొరేట్ టాక్స్ అనేది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్‌పై కాకుండా, అవి ఆర్జించిన లాభాలపై విధిస్తారు. ఐతే ఈ కథనం ప్రకారం అదానీకి చెందిన ఏడు లిస్టెడ్ కంపెనీలు పెద్దగా లాభాలను ఆర్జించట్లేదని, అందుకే అదానీ గ్రూప్ సంస్థలు భారత ప్రభుత్వానికి ఎక్కువ టాక్స్ చెల్లించడం లేదని ఈ కథనంలో పేర్కొన్నారు.

ఉదాహారణకి అదానీకి చెందిన Adani Enterprises Ltd & Adani Ports and SEZ Ltd కంపెనీల 2021-22 వార్షిక నివేదికలు పరిశీలిస్తే, Adani Enterprises Ltd సంస్థ ఆ సంవత్సరం 477 కోట్లు రూపాయలు టాక్స్ చెల్లించగా, Adani Ports and SEZ Ltd సంస్థ 746 కోట్లు టాక్స్ చెల్లించింది.

ఈ లెక్కన చుస్తే అదానీకి చెందిన ఏడు లిస్టెడ్ కంపెనీలు మొత్తం కలిపి ప్రభుత్వానికి చెల్లించిన టాక్స్ విలువ 5000 కోట్ల కన్నా తక్కువే ఉంటుందని పైన చేసిన వాదన నిజమని రుజువైంది.

దేశ GDPలో కార్పొరేట్ టాక్స్ వాటా ఎంత?

ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌ లెక్కల ప్రకారం 2022-23 (RE) సంవత్సరంలో కార్పొరేట్ టాక్స్‌ల ద్వారా ఆర్జించింది 8.35లక్షల కోట్లు. మొత్తం GDPలో ఈ వాటా 3% కన్నా తక్కువే. అంతకు ముందు సంవత్సరం 2021-22(Actuals) 7.12 లక్షల కోట్లతో మొత్తం GDPలో 3.01% వాటాను నమోదు చేసింది. అంటే భారత దేశ GDPలో కార్పొరేట్ టాక్స్‌ల వాటా సుమారు 3% ఉంటూ వస్తుంది.

అలాగే కేంద్ర ప్రభుత్వానికి వివిధ టాక్స్‌ల ద్వారా వచ్చే రెవెన్యూ ఆదాయంలో కార్పొరేట్ టాక్స్‌ వాటా 30% కన్నా తక్కువే ఉంది. 2022-23 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మొత్తం 30లక్షల కోట్లకు పైచిలుకు వివిధ టాక్స్‌ల రూపంలో ఆర్జించగా, ఇందులో కార్పొరేట్ టాక్స్‌ల వాటా 27.4% (8.35 లక్షల కోట్లు). అంతకు ముందు సంవత్సరం 2021-22లో కూడా ఈ వాటా (26.3%) ఇంచు మించు అంతే వుంది. దీన్ని బట్టి, కేవలం కార్పొరేట్ సంస్థలు కట్టే టాక్స్‌ల వల్లే భారత ఆర్ధిక వ్యవస్థ నడుస్తుందన్న వాదనలో కూడా కరెక్ట్ కాదని స్పష్టమవుతుంది.

చివరగా, అదానీ సంస్థలు ప్రభుత్వానికి ఏటా లక్ష కోట్ల టాక్స్ చెల్లిస్తున్నాయన్న వాదన పూర్తిగా అవాస్తవం.