సుభాష్ చంద్రబోస్ హిందుత్వవాది, RSS భావాజాలానికి అనుకూలమని నేతాజీ కుమార్తె అనితా బోస్ అనలేదు

మా నాన్న హిందుత్వ వాది. మా నాన్న భావాజాలం RSSకు అనుకూలం”, అని సుభాష్ చంద్రబోస్ కుమార్తె అనితా బోస్ వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

YouTube Poster

క్లెయిమ్: సుభాష్ చంద్రబోస్ హిందుత్వవాది మరియు RSS భావాజాలానికి అనుకూలమని నేతాజీ  కుమార్తె అనితా బోస్ వ్యాఖ్యలు చేశారు.

ఫాక్ట్ (నిజం): సుభాష్ చంద్రబోస్ హిందూ ధర్మాన్ని అమితంగా అనుసరించేవాడైనప్పటికీ, ఇతర మత విశ్వాసాలను కూడా గౌరవించేవాడని అనితా బోస్ పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. సుభాష్ చంద్రబోస్ వామపక్ష వాది అని, అతని భావజాలం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS)  మరియు బీజేపీ భావజాలానికి పూర్తి భిన్నమని అనితా బోస్ స్పష్టం చేశారు. నేతాజీ భావజాలం చాలావరకు కాంగ్రెస్‌ భావాజాలానికి దగ్గరగా ఉంటుందని ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం ఇంటర్నెట్లో వెతికితే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ భావాజాలానికి సంబంధించి ఆయన కూతురు ‘అనితా బోస్’ ఇటీవల చేసిన వ్యాఖ్యలను రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. సుభాష్ చంద్రబోస్ వామపక్ష వాది అని, అతని సిద్దాంతాలు మరియు విలువలు RSS, బీజేపీ భావజాలానికి పూర్తి భిన్నంగా ఉండేవని అనితా బోస్ వ్యాఖ్యలు చేసినట్టు ఈ వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి.

23 జనవరి 2023 నాడు కోల్‌కతాలో నేతాజీ జయంతి వేడుకలు నిర్వహించేందుకు RSS ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో, అనితా బోస్ ‘ఇండియా టుడే’ న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, “RSS నేతాజీ జయంతి వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు నేను విన్నాను. RSS నేతాజీ సిద్ధాంతాలు, విలువలను అనుసరించాలని కోరుకుంటే నేను ఖచ్చితంగా సంతోషిస్తాను. దేశంలోని అన్నీ పార్టీల నేతలు నేతాజీని గుర్తుంచుకోవడం సంతోషంగా ఉంది. కానీ, నేతాజీ RSS, బీజేపీ భావజాలాలను పంచుకుంటారని చేస్తున్న ప్రచారాన్ని నేను ఖచ్చితంగా అంగీకరించను”, అని తెలిపారు.

సుభాష్ చంద్రబోస్ సోషలిస్ట్ నాయకుడని, తనని తాను కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ వింగ్ నాయకుడిగా పరిగణించుకొనేవాడని అనితా బోస్ ఈ ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాదు, నేతాజీ భావజాలం చాలావరకు కాంగ్రెస్‌ భావాజాలానికి దగ్గరగా ఉంటుందని ఆమె ‘ఇండియా టుడే’ ఇంటర్వ్యూలో తెలిపారు. సుభాష్ చంద్రబోస్ హిందూ ధర్మాన్ని అమితంగా అనుసరించేవాడైనప్పటికీ, ఇతర మత విశ్వాసాలను కూడా గౌరవించేవాడని అనితా బోస్ పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. సుభాష్ చంద్రబోస్ హిందుత్వవాది అని, RSS మరియు బీజేపీ భావజాలం కలిగిన వ్యక్తి అని అనితా బోస్ ఎన్నడూ, ఎక్కడా పేర్కొనలేదు.

చివరగా, సుభాష్ చంద్రబోస్ హిందుత్వవాది అని, RSS భావాజాలానికి అనుకూలమని నేతాజీ కుమార్తె అనితా బోస్ వ్యాఖ్యలు చేయలేదు.