హాలీవుడ్ నటుడు మెల్ గిబ్సన్ జీవితంలో చోటుచేసుకున్న ఆటుపోట్లు అని షేర్ చేస్తున్న ఈ మెసేజ్ చాలా వరకు కల్పితం

హాలీవుడ్ నటుడు మెల్ గిబ్సన్ జీవితంలో చోటుచేసుకున్న ఆటుపోట్లు అని సోషల్ మీడియాలో ఒక మెసేజ్ షేర్ అవుతుంది. మెల్ గిబ్సన్ కుటుంబం దాదాపు పాతిక సంవత్సరాల క్రితం జీవనోపాధి కోసం అమెరికా నుంచి ఆస్ట్రేలియా వచ్చారని, యుక్త వయసులో మెల్ గిబ్సన్ సర్కస్ లో టేప్రిజ్ ఆర్టిస్టు అవ్వాలని కోరుకున్నట్టు ఈ మెసేజ్ లో తెలిపారు. అయితే, ఒక రోజు గిబ్సన్ పై అయిదుగురు దొంగలు కత్తులతో దాడి చేసి నిర్దాక్షనియంగా అతన్ని చావబాదినట్టు ఇందులో తెలిపారు. ఈ దాడిలో అతని ముఖం ఒక రక్తం ముద్దలా అయిందని, ముక్కు వేలాడుతు కనిపించిందని, ఒక కన్ను సాకెట్ నుంచి బయటికొచ్చిందని, అతని దవడ పక్కకు తిరిగిపోయిందని, పుర్రె రెండు చోట్ల బ్రద్దలై ఉందని ఈ మెసేజ్ లో వివరించారు. అతడి శరీరం పై పదహారు ఫ్రాక్చర్లు పడినట్టు, అతని పళ్ళు అన్ని ఉడిపోయినట్టు మెసేజ్ లో తెలిపారు. భయంకరమైన తన శరీర ఆకృతి వలన అతనికి ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదని, చివరికి తను టేప్రిజ్ ఆర్టిస్టుగా పనిచేయాలనుకున్న సర్కస్ లోనే గిబ్సన్ ఫీట్లు చేయాల్సి వచ్చిందని తెలిపారు. అతన్ని సర్కస్ వీక్షించడానికి వచ్చిన ప్రజలు ‘A Man with no Face’ అని పిలిచేవారని తెలిపారు. ఇంత జరిగినా, అతడు తన చిన్ననాటి అలవాటుని పోగొట్టుకోకుండా ఖాళీ సమయాలలో చర్చికు వెళ్లి ప్రశాంతంగా ‘ధ్యానం’ చేసుకునేవాడని, ఉన్నంతలో దానధర్మాలు చేసేవాడని ఈ మెసేజ్ లో తెలిపారు. గిబ్సన్ పై జాలి పడిన ఆ చర్చి ఫాదర్, తన ప్లాస్టిక్ సర్జన్ స్నేహితుడి సహాయంతో గిబ్సన్ దేహాన్ని ఒక ఆకారానికి తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ మొత్తం సంఘటన ఆధారంగా ‘The Man Without a Face’ అనే చిత్రం రూపొందించినట్టు, ఆ చిత్రంలో మెల్ గిబ్సన్ కథానాయకుడి పాత్ర పోషించినట్టు ఈ పోస్టులో తెలిపారు. ఆ తరువాత మెల్ గిబ్సన్ Mad Max, Lethal Weapon, Brave Heart లాంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించినట్టు మెసేజ్ లో తెలిపారు. అపజయానికి కృంగి పోక విజయానికి పొంగిపోక తన గమ్యం వైపు వెళ్ళే వాడే పరిపూర్ణమైన వ్యక్తని ఈ మెసేజ్ యొక్క సారాంశం. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: హాలీవుడ్ నటుడు మెల్ గిబ్సన్ జీవితంలో చోటుచేసుకున్న ఆటుపోట్లని వివరించే మెసేజ్.

ఫాక్ట్ (నిజం): హాలీవుడ్ నటుడు మెల్ గిబ్సన్ సంబంధించి షేర్ అవుతున్న ఈ మెసేజ్ చాలా వరకు కల్పితం. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలకి కల్పిత కథలని జోడిస్తూ ఈ మెసేజ్ ని షేర్ చేస్తున్నారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయిమ్ కి సంబంధించిన సమాచారం కోసం గూగుల్ లో వెతికితే, హాలీవుడ్ నటుడు మెల్ గిబ్సన్ జీవితానికి సంబంధించి షేర్ అవుతున్న ఈ మెసేజ్ గురించి ‘Snopes’ సంస్థ 09 అక్టోబర్ 2000 నాడు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ కథని మొట్ట మొదటగా రేడియో కామెంటేటర్ పాల్ హార్వే తెలిపినట్టు ఈ ఆర్టికల్ లో రిపోర్ట్ చేసారు. ఆన్లైన్లో షేర్ అవుతున్న ఈ మెసేజ్ చాలా వరకు కల్పితం అని, మెల్ గిబ్సన్ జీవితంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలకి కల్పిత కథలు జోడిస్తూ ఈ మెసేజ్ ని షేర్ చేస్తున్నట్టు ‘Snopes’ స్పష్టం చేసింది.

‘Snopes’ న్యూస్ సంస్థ తమ ఆర్టికల్ లో తెలిపిన సమాచారం ప్రకారం, మేల్ గిబ్సన్ 12 సంవత్సరాల వయసున్నప్పుడు తన కుటుంబం న్యూయార్క్ నుండి ఆస్ట్రేలియా సిడ్నీ నగరానికి వచ్చిన మాట వాస్తవం. కానీ, మెల్ గిబ్సన్ తన యుక్త వయసులో టేప్రిజ్ ఆర్టిస్టు అవ్వాలని ఎప్పుడు కోరుకోలేదు. గిబ్సన్ హై స్కూల్ లో చదువుకునేటప్పుడు చెఫ్ లేదా జర్నలిస్ట్ అవ్వాలని కోరుకున్నాడు. కాని, తను ‘National Institute of Dramatic Art’ కాలేజీలో చేరాడు. ఈ కాలేజీలో చదువుకుంటున్నప్పుడే  గిబ్సన్ ‘Summer City’ అనే చిన్న చిత్రంలో నటించాడు. ఆ తరువాత  ‘State Theatre Company of South Australia’ ప్రొడక్షన్ చేసిన కొన్ని చిత్రాలలో గిబ్సన్ నటించాడు. జార్జ్ మిల్లర్ దర్శకత్వం వహించిన ‘Mad Max’ చిత్రంతో మెల్ గిబ్సన్ దశ తిరిగింది.

Mad Max చిత్రం ఆడిషన్ ముందు రోజు మెల్ గిబ్సన్ కొందరు గుర్తు తెలియని వ్యక్తులతో ఘర్షణ పడినట్టు Snopes రిపోర్ట్ చేసింది. ఈ ఘర్షణలో మెల్ గిబ్సన్ ముఖానికి కొన్ని గాయాలయిన మాట వాస్తవం. కాని, పోస్టులో తెలుపుతున్నట్టు మెల్ గిబ్సన్ కన్ను సాకెట్ నుండి బయటికి రాలేదు, అతని దవడ పక్కకు తిరగలేదు, అతని పుర్రె, కాళ్ళు, చేతులు విరగలేదు. మెల్ గిబ్సన్ ముఖానికి కొన్ని కుట్లు పడినట్టు, కొన్ని వారాలలో అతను గాయలనుండి కోలుకున్నట్టు ‘Snopes’ తమ ఆర్టికల్ లో రిపోర్ట్ చేసారు. Mad Max చిత్రం ఆడిషన్ ముందు రోజు జరిగిన ఈ ఘటనకు సంబంధించి పబ్లిష్ అయిన మరొక న్యూస్ ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు. మెల్ గిబ్సన్ జీవితంలో చోటుచేసుకున్న ఈ సంఘటనకి కొన్ని కల్పిత కథలని జోడిస్తూ ఈ మెసేజ్ షేర్ చేసినట్టు తెలుస్తుంది. 

1993లో మెల్ గిబ్సన్ దర్శకత్వం మరియు కథానాయకుడిగా చేసిన ‘The Man Without a Face’ చిత్రం రిలీజ్ అయింది. ఈ చిత్రం ‘Isabelle Holland’ రాసిన నవల ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రం ఆక్సిడెంట్ లో వికలాంగుడైన ఒక వ్యక్తి సమాజానికి దూరంగా ఎలా బ్రతికాడనే నేపథ్యంలో తీసినది. ఈ చిత్రం మెల్ గిబ్సన్ జీవిత కథ ఆధారంగా తీసినది కాదు.

మెల్ గిబ్సన్ కు సంబంధించి షేర్ అవుతున్న ఈ కథని మొట్టమొదటగా రేడియో కామెంటేటర్ పాల్ హర్వే తెలిపారని పాఠకులు తమకు తెలిపినట్టు Snopes రిపోర్ట్ చేసింది. కాని, తమ విశ్లేషణలో మెల్ గిబ్సన్ కి సంబంధించి పాల్ హర్వే తెలిపిన సమాచారానికి కొన్ని కల్పిత కథలని జోడిస్తూ ఈ మెసేజ్ ని షేర్ చేస్తున్నట్టు ‘Snopes’ స్పష్టం చేసింది. మెల్ గిబ్సన్ దర్శకత్వం వహించిన ‘The Passion of the Christ’ చిత్రం క్రైస్తవ దైవం జీసస్ గురించి కావడంతో అతను జీసస్ ని ఆరాధించడానికి తరచూ చర్చికి వెళ్లేవాడనే కల్పిత కథని ఈ మెసేజ్ లో జోడించారు.

చివరగా, హాలీవుడ్ నటుడు మెల్ గిబ్సన్ జీవితంలో చోటుచేసుకున్న ఆటుపోట్లని వివరిస్తూ షేర్ చేస్తున్న ఈ మెసేజ్ చాలా వరకు కల్పితం.