Fake News, Telugu
 

ఈ వీడియోలో కనిపించే దృశ్యాలలో ఎక్కువ భాగం ద్వారకాకు సంబంధించినవి కావు

0

గుజరాత్‌కి పశ్చిమాన సముద్రగర్భంలో కలిసిపోయిందని భావిస్తున్న ద్వారకా నగరం 36,864 చ. కిమీ విస్తీర్ణంలో ఉండేదని, 9 లక్షల రాజభవనాలతో కూడిన అత్యాధునిక కట్టడాలు కూడా ఉండేవని చెప్తూ సముద్రంలో మునిగిపోయిన కొన్ని ప్రాచీన కట్టడాల దృశ్యాలను చూపుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: 36,864 చ. కిమీ విస్తీర్ణంలో ఉండే ద్వారకా నగరం యొక్క సముద్రగర్భంలో కలిసిన పోయిన కట్టడాల యొక్క దృశ్యాలు.

ఫాక్ట్: సముద్రగర్భంలో కలిసిపోయిందనుకుంటున్న ద్వారకా నగరం యొక్క విస్తీర్ణత గురించి ఎక్కడా అధికారిక సమాచారం లేదు. 9 లక్షల రాజభవనాల గురించి కూడా ASI, UNESCO ఎక్కడా ప్రస్తావించలేదు. పైగా వీడియోలోని అనేక దృశ్యాలు ద్వారకా నగరానికి సంబంధించినవి కావు. కావున, పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు దోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా, పురాతన ద్వారకా నగరంగా భావించబడుతున్న ఈ ప్రదేశం యొక్క విస్తీర్ణం గురించి మరియు ఇందులో ఉన్నాయని చెప్పబడుతున్న 9 లక్షల రాజభవనాల గురించి వివిధ ప్రచురణలని పరిశీలించాము. UNESCO, National Oceanographic and Atmospheric Administration(NOAA) వెబ్‌సైట్లలో ఇచ్చిన వివరాల ప్రకారం ఎక్కడా కూడా ద్వారకా విస్తీర్ణం గురించి ఎటువంటి సమాచారం లేదు. అలాగే, Archaeological Survey of India రిపోర్టులో కూడా 9 లక్షల రాజభవనాల గురించిన ప్రస్తావన ఎక్కడా లేదు. వివిధ సమయాల్లో ద్వారకా నగరం వద్ద తవ్వకాల్లో బయటపడ్డ పురాతన వస్తువుల గురించి ఈ వీడియోలో చూడవచ్చు.

ఇక వీడియోలో చూపించిన దృశ్యాలను పరీక్షించగా, వీటిలో అనేక ఫొటోలు ద్వారకా నగరానికి సంబంధించినవి కావని మేము ఇదివరకే రుజువు చేయడమైనది. సంబంధిత ఫాక్ట్- చెక్ కథనాలను ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.

ఇక వీడియోలో కనిపించే మరికొన్ని ఫొటోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సాఫ్ట్‌వేర్లను ఉపయోగించి కృత్రిమంగా రూపొందించినట్లు ఇదివరకే కొందరు సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

చివరిగా, ద్వారకా నగరం గురించి సంబంధం లేని దృశ్యాలను చూపుతూ ఆధారాలు లేని విషయాలు ప్రస్తావిస్తూ ఈ వీడియో వీక్షకులను తప్పుదోవ పట్టిస్తుంది.

Share.

About Author

Comments are closed.

scroll