Fake News, Telugu
 

గుట్కా అక్రమ రవాణా కేసులో బండి సంజయ్ అరెస్ట్ అంటూ డిజిటల్‌గా మార్ఫ్ చేసిన న్యూస్ క్లిప్ షేర్ చేస్తున్నారు

0

ప్రస్తుత తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, గుట్కా అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయినప్పటి ఫోటో అంటూ పోలీసులతో బండి సంజయ్ ఉన్న ఒక న్యూస్ పేపర్ క్లిప్‌ను షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గతంలో గుట్కా అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయినప్పటి ఫోటో.

ఫాక్ట్ (నిజం): వైరల్ అవుతున్న న్యూస్ క్లిప్, నిజానికి 2012లో విద్యుత్ శాఖ ఎస్ఈను నిర్బంధించిన ఘటనకు సంబంధించింది. పండుగ సమయాల్లో విధ్యుత్ కోతలకు నిరసన తెలపడంలో భాగంగా అక్టోబర్  2012లో బండి సంజయ్ ఎస్ఈను నిర్బంధించారు, ఇందుకుగాను ఆయనను పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ వార్తను అప్పట్లో అనేక వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. ఈ వార్తను రిపోర్ట్ చేసిన అలాంటి ఒక న్యూస్ పేపర్ క్లిప్ హెడ్లైన్‌ను డిజిటల్‌గా ఎడిట్ చేసి ‘గుట్కా అక్రమ రవాణా కేసులో ఆరుగురి అరెస్టు’ గా మార్చారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోలీసుల అదుపులో బండి సంజయ్ ఉన్న వైరల్ న్యూస్ పేపర్ క్లిప్, నిజానికి 2012లో బండి సంజయ్  కరీంనగర్‌లో విద్యుత్ శాఖ ఎస్ఈను నిర్బంధించిన ఘటనకు సంబంధించింది.

వైరల్ అవుతున్న ఫోటోకు సంబంధించి వివరణ కోసం మీము బండి సంజయ్‌ను మెయిల్ ద్వారా సంప్రదించగా, బండి సంజయ్ ఆఫీస్ మా మెయిల్‌కు స్పందిస్తూ గుట్కా అక్రమ రవాణా ఆరోపణను తోసిపుచ్చింది. అసలు బండి సంజయ్ ఎప్పుడు అక్రమ రవాణ కేసులో అరెస్ట్ కాలేదని స్పష్టం చేసింది.

వైరల్ అవుతున్న న్యూస్ క్లిప్ నిజానికి బండి సంజయ్  కరీంనగర్‌లో విద్యుత్ శాఖ ఎస్ఈను నిర్బంధించిన ఘటనకు సంబంధించిందని తెలిపింది. పైగా ఆ ఘటనకు సంబంధించి వివిధ వార్తా సంస్థలు ప్రచురించిన కథనాలకు సంబంధించిన క్లిప్పింగ్స్ కూడా మాతో షేర్ చేసారు. ఈ క్లిప్పింగ్స్ కింద చూడొచ్చు.

ఈ క్లిప్పింగ్స్ లో వైరల్ అవుతున్న క్లిప్ కూడా ఉంది. ఐతే అసలు న్యూస్ క్లిప్పింగ్‌లో ‘ఎస్ఈ నిర్బంధం కేసులో ఆరుగురి అరెస్టు’ అనే హెడ్లైన్ ఉంది. దీన్నిబట్టి, ఈ క్లిప్‌ను డిజిటల్‌గా ఎడిట్ చేసి హెడ్లైన్‌ను ‘గుట్కా అక్రమ రవాణా కేసులో ఆరుగురి అరెస్టు’ గా మార్చినట్టు స్పష్టంగా అర్ధమవుతుంది.

ఈ న్యూస్ క్లిప్పింగ్‌లోని సమాచారం ప్రకారం అక్టోబర్‌ 2012లో పండుగ సమయాల్లో కరెంటు కోతలను నిరసిస్తూ, బండి సంజయ్ విద్యుత్ శాఖ ఎస్ఈను నిర్బంధించడంతో పోలీసులు ఆయనను మరియు అయన అనుచరులను అరెస్ట్ చేసారు. ఈ కేసులో 2019లో కోర్ట్ తీర్పు కూడా ఇచ్చింది.

చివరగా, గుట్కా అక్రమ రవాణా కేసులో బండి సంజయ్ అరెస్ట్ అంటూ డిజిటల్‌గా మార్ఫ్ చేసిన  న్యూస్ క్లిప్‌ను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll