Fake News, Telugu
 

ఆంధ్రాలో టెస్లా కంపెనీ ప్రారంభమవుతుందని మంత్రి అమరనాథ్ ప్రకటించినట్టు మార్ఫ్ చేసిన ‘TV9 Telugu’ న్యూస్ బులెటిన్ ఫోటో షేర్ చేస్తున్నారు

0

విశాఖను ఐటి హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా టెస్లా అధినేత ఎలాన్ మాస్క్‌తో చర్చలు పూర్తిచేశామని,  విశాఖపట్నంలో త్వరలో టెస్లా కంపనీ ప్రారంభమవబోతుందని ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ రెడ్డి ఇటీవల పేర్కొన్నారు, అంటూ ‘TV9 Telugu’ ఛానెల్ న్యూస్ బులెటిన్ల స్క్రీన్ షాట్లని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: విశాఖలో త్వరలో టెస్లా కంపనీ ప్రారంభమవబోతుందని ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ రెడ్డి ప్రకటించారు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెస్లా కంపనీ ప్రారంభమవబోతుందని ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ రెడ్డి ప్రకటించలేదు. 2023 మార్చి నెలలో విశాఖపట్నంలో జరుగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (GIT) ఆహ్వానితుల జాబితాలో టెస్లా సిఈఓ ఎలాన్ మస్క్ పేరు కూడా ఉంది. కానీ, పోస్టులో తెలుపుతున్నట్టు ఆంధ్రప్రదేశ్‌లో టెస్లా కంపనీ ప్రారంభించబోతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాని, టెస్లా యాజమాన్యం గాని ప్రకటించలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

పోస్టులో తెలుపుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో టెస్లా కంపనీని ప్రారంభించబోతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ రెడ్డి ప్రకటించారా? అని వెతికితే, అమరనాథ్ రెడ్డి అటువంటి వ్యాఖ్యలు చేసినట్టు ఎక్కడా రిపోర్ట్ కాలేదని తెలిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెస్లా కంపనీని ప్రారంభించబోతున్నామని అమరనాథ్ రెడ్డి ప్రకటించినట్టు ‘TV9 Telugu’ వార్తా సంస్థ కూడా ఎటువంటి న్యూస్ రిపోర్ట్ పబ్లిష్ చేయలేదు. టెస్లా కంపెనీకి సంబంధించి అమరనాథ్ రెడ్డి తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఎటువంటి ట్వీట్ పెట్టలేదు.

విశాఖపట్నంలో ఇటీవల నిర్వహించిన ఇన్ఫినిటీ వైజాగ్ సదస్సులో భాగంగా అమరనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, త్వరలోనే విశాఖలో ఇన్ఫోసిస్ మరియు అదాని డాటా సెంటర్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. విప్రో, ఆపిల్ అనుబంధ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని, రాండ్‌స్టాడ్ లాంటి దిగ్గజ కన్సల్టెన్సీ సంస్థలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆపరేషన్స్ మొదలుపెట్టాయని అమరనాథ్ రెడ్డి మీడియాకి తెలిపారు. రాష్ట్రంలో టెస్లా కంపనీని ప్రారంభించబోతున్నట్టు అమరనాథ్ రెడ్డి ఈ మీడియా సమావేశంలో పేర్కొనలేదు.

ఇన్ఫినిటీ వైజాగ్ సదస్సులో భాగంగా అమరనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడిన వీడియోని ‘TV9 Telugu’ వార్తా సంస్థ 21 జనవరి 2023 నాడు పబ్లిష్ చేసింది. ‘TV9 Telugu’ పబ్లిష్ చేసిన వీడియోలోని న్యూస్ బులిటెన్లని ఎడిట్ చేసి పోస్టులో షేర్ చేసిన ఫోటోని రూపొందించారు.

2023 మార్చి నెలలో విశాఖపట్నంలో నిర్వహించబోతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కి (GIT) టెస్లా సిఈఓ ఎలాన్ మస్క్‌, ఆపిల్ సిఈఓ టిమ్ కుక్, అమాజోన్ ఛైర్మన్ జెఫ్ బెజోస్ సహ పలు కంపనీ సిఈఓలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానించినట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెస్లా కంపనీ పెట్టుబడులు పెట్టాలని 2022 జనవరి నెలలో కదిరి శాసనసభ్యుడు వెంకట సిద్ధ రెడ్డి ఎలాన్ మాస్క్‌కు ట్వీట్ చేసారు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నట్టు టెస్లా యాజమాన్యం గాని, తమ రాష్ట్రంలో టెస్లా కంపనీని ప్రారంభించబోతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాని ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడినదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, మార్ఫ్ చేసిన ఫోటోని షేర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెస్లా కంపనిని ప్రారంభించబోతునట్టు ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ రెడ్డి ప్రకటించినట్టుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll