అదృశ్యమైన శాంటియాగో ఫ్లైట్ 513 35 ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగొచ్చిందంటూ ఈ వీడియోలో చెప్తున్నది ఒక కల్పిత కథ

శాంటియాగో ఫ్లైట్-513 1954 జర్మనీలో అదృశ్యమై, 35 ఏళ్ల తర్వాత 1989లో బ్రెజిల్‌లో ల్యాండ్ అయ్యిందని వివరిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: శాంటియాగో ఫ్లైట్-513 1954 జర్మనీలో అదృశ్యమై, 35 ఏళ్ల తర్వాత 1989లో బ్రెజిల్‌లో ల్యాండ్ అయ్యింది.

ఫాక్ట్ (నిజం): అదృశ్యమైన శాంటియాగో ఫ్లైట్-513 35 ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగివచ్చినట్టు ఎటువంటి వార్తా కథనాలు, అధికారిక రికార్డులు లేవు. శాంటియాగో ఎయిర్లైన్స్ పేరుతో అసలు ఒక విమానయాన సంస్థ ఉన్నట్టు కూడా ఎలాంటి ఆధారాలు లేవు. శాంటియాగో ఫ్లైట్ అదృశ్యమై 35 ఏళ్ల తరవాత ప్రత్యక్షం అయ్యింది అంటూ మొదటిసారిగా వీక్లీ వరల్డ్ న్యూస్ (WWN) అనే అమెరికన్ ప్రింట్- ఆధారిత టాబ్లాయిడ్ 1989లో ప్రచురించింది. అయితే ఈ సంస్థ ఇలాంటి కల్పిత కథనాలు అనేకం ప్రచురించింది. ఈ సంస్థ కల్పిత కథనాలను ప్రచురి౦చడంలో ప్రసిద్ది చెందింది అని చెప్తూ పలు వార్త సంస్థలు రిపోర్ట్ చేసాయి. కావున, ఈ పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ముందుగా ఈ సంఘటనకు సంబంధించిన సమాచారం కోసం “శాంటియాగో ఫ్లైట్ 513” మరియు “శాంటియాగో ఎయిర్‌లైన్స్” అన్న కీవర్డ్స్ తో వెతకగా ఇలాంటి ఒక సంఘటన జరిగినట్టు వార్తా కథనాలు గాని లేక అధికారిక రికార్డులు గాని మాకు లభించలేదు. అసలు ఆ పేరుతో ఒక విమానయాన సంస్థ ఉన్నట్టు కూడా మాకు ఎలాంటి ఆధారాలు లేవు.

ఐతే ప్రస్తుతం వైరల్ వీడియోలో చెప్తున్న కథనే వీక్లీ వరల్డ్ న్యూస్‌ (WWN) అనే అమెరికన్ వార్త ప్రింట్- ఆధారిత టాబ్లాయిడ్ 14 నవంబర్ 1989లో ప్రచురించిన కథనం మాకు కనిపించింది. వీక్లీ వరల్డ్ న్యూస్‌ (WWN) అనే అమెరికన్ వార్త ప్రింట్-ఆధారిత టాబ్లాయిడ్ అయిన వీక్లీ వరల్డ్ న్యూస్‌ (WWN) 14 నవంబర్ 1989లో ప్రచురించబడిన కథనంలో ఈ కథ వచ్చింది. ఇలాంటి మరో సంఘటన “1955లో అమెరికా నుండి ఒక విమానం తప్పిపోయి 30 ఏళ్ల తర్వాత 1985లో వెనిజులాలో ల్యాండ్ అయ్యిందని” కథనాన్ని 7 మే 1985 నా WWN ప్రచురించింది, కానీ ఇలాంటి సంఘటన జరిగినట్టు కూడా ఎలాంటి రిపోర్ట్స్ లేవు.

వీక్లీ వరల్డ్ న్యూస్‌ (WWN) గురించి మరింత సమాచారం కోసం వెతకగా,  ఈ సంస్థ కల్పిత కథలనూ ప్రచురి౦చడంలో ప్రసిద్ది చెందింది అని చెప్తూ ప్రముఖ వార్తా సంస్థలు యుఎస్ఏ టుడే, ది వాషింగ్టన్ పోస్ట్, ది అట్లాంటిక్ కథనాలు ప్రచురించాయి. వీక్లీ వరల్డ్ న్యూస్‌ పత్రిక ప్రచురించిన కొన్ని కల్పిత కథనాలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. WWN రాసిన అదృశ్యమైన విమానాల కథనాలు కల్పితమని రిపోర్ట్ చేస్తూ స్నోప్స్, న్యూస్ చెకర్ లాంటి ఫాక్ట్-చెకింగ్ సంస్థలు కూడా కథనాలు ప్రచురించాయి .

చివరగా, 35 సంవత్సరాల తర్వాత ప్రత్యేక్షమైయిన శాంటియాగో ఫ్లైట్ 513 అంటూ ఈ వీడియోలో చెప్తున్నది ఒక కల్పిత కథ.